“ఈ నవంబర్ మాసాన్ని బాలల హక్కుల రక్షణలో ఒక ముఖ్య మార్పు కు నాంది పలకండి. ఉదాసీనత నుండి చర్యకు, నిశ్శబ్దం నుండి కార్యాచరణకు, యుద్ధం నుండి శాంతికి అనే సందేశాన్ని ప్రతిధ్వనించనివ్వండి. అన్ని యుద్ధాలను ఆపండి. ప్రతి బిడ్డకు పౌష్టిక ఆహారం అందించండి. పాఠశాలలు సైనిక చర్యలతో ధ్వంసం చేయకుండా పిల్లలతో భర్తీ చేయదానికి పూనుకోండి. అన్ని యుద్ధాలు మరియు వివధ దేశాలలో జరుగుతున్న సాయుధ చర్యలను వెంటనే ఆపి ఆకలి లేని బాల్యం కోసం కృషి చేయాలి. ప్రతి బిడ్డ శాంతి, విద్య మరియు మనుగడ హక్కును కాపాడాలని ప్రపంచ నాయకులకు అంతర్జాతీయ సంస్థలకు మరియు పౌర సమాజానికి విజ్ఞప్తి. బాలల హక్కుల దినోత్సవం ఒక రోజు జరుపుకునే సంబరాలు కాకుండా బాలల హక్కుల పరిరక్షణ కోసం ఒక ఉద్యమంగా మారి ఛిద్రమవుతున్న బాల్యాన్ని కాపాడుదాం.”
(నవంబర్ 20 అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సందర్భంగా)
ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ మాసాన్ని బాలల హక్కుల పరిరక్షణ మాసంగ ఘనంగా జరుపుకుంటారు. నవంబర్ 20 తేదీ 1989వ సంవత్సరం ఐక్యరాజ్య సమితిలో బాలల హక్కుల ఒడంబడిక ఆమోదించిన రోజు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి బిడ్డ రక్షణ, గౌరవం మరియు అభివృద్ధికి మన నిబద్ధతను పునరుద్ఘాటించే సమయం ఇది. ఒక్క అమెరికా తప్ప దాదాపు అన్ని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల ఆమోదం పొందిన అతి ముఖ్యమైన ప్రతిష్టాత్మకమైన ఒడంబడిక ఇది. ప్రపంచ దేశాల నాయకులు బాలలకు చేసిన వాగ్దానాలన్నీ మరచిన కారణంగా 2025 సంవత్సరంలో వివిధ దేశాలలోని లక్షలాది మంది పిల్లలు యుద్ధం, ఆకలి, అనారోగ్యం మరియు నిర్వాసితులై భయానక పరిస్థితులను అనుభవిస్తున్నప్పుడు బాలల స్థితిగతులను అర్ధం చేసుకోకుండా వేడుకలు జరుపుకోవడం అర్థరహితం.
యుద్ధ భూములలో బాల్యం బలి
గాజా నుండి సూడాన్ వరకు, ఉక్రెయిన్ నుండి మయన్మార్ వరకు మరియు ఆఫ్రికా మరియు ఆసియా దేశాలలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సాయుధ సంఘర్షణలతో పాటు పాలకుల నిర్లక్ష్యానికి గురి అవుతూ ఆకలితో బాల్యం ఛిద్రమౌతున్నది. యుద్దాలలో పిల్లలు చంపబడుతున్నారు.
గాజా/వెస్ట్ బ్యాంక్ తీవ్రమైన యుద్ధం. వేలాది మంది పిల్లలు మరణించారు. సూడాన్ లో కరువుతో పిల్లలతో సహా 10 మిలియన్లకు పైగా స్థానభ్రంశం చెందారు. మయన్మార్ లో అంతర్యుద్ధం. DR కాంగో తూర్పున సాయుధ పోరాటంలో పిల్లల నియామకం సహెల్ ప్రాంతంలో (మాలి, బుర్కినా ఫాసో, నైజర్) ఉగ్రవాదం మరియు తిరుగుబాట్లతో ఆకలి మరియు పాఠశాలలు అసురక్షితంగా మారాయి. సోమాలియాలో కొనసాగుతున్న సాయుధ పోరాటం, కరువు, ఇథియోపియా టిగ్రేలో సంఘర్షణ, నైజీరియా బోకో హరామ్ హింస పాఠశాల కిడ్నాప్‌లు, హైతీ ముఠా యుద్ధాలు మరియు రాష్ట్ర పతనం, పాఠశాలకు వెళ్లలేని పిల్లలు.
ఆఫ్ఘనిస్తాన్ సంఘర్షణ తాలిబాన్ నియంత్రణతో బాలికలకు విద్య నిరాకరించబడింది, మొజాంబిక్ లో తిరుగుబాటు పిల్లలు నిరాశ్రయులయ్యారు, లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దు దాడులు; పాలస్తీనా శరణార్థులు (లెబనాన్, జోర్డాన్, సిరియాలలో) కొనసాగుతున్న దీర్ఘకాలిక స్థితిలేనితనం కొనసాగుతుంది.
ఆకలి రాజ్యాలు: పోశాకాహార లోపంతో బాల్యం
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం ప్రపంచంలో 67 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారాని వెల్లడించింది. ఇందులో పిల్లల ఆకలి చెప్పనలవి కాదు. ఆహార ఉత్పత్తి పెరిగినంత మాత్రాన అదరికి ఆహారం అందుతుందనే గ్యారంటీ లేదని ఈ నివేదిక ద్వారా తెలుస్తుంది. పేదరికము, యుద్దాలు, ఆస్తిర ఆర్ధిక పరిస్థితి, బలహీనమైన పాలనా వ్యవస్థలు ముఖ్య కారణంగా తెలుస్తుంది. అతి ఆకలితో అలమటిస్తున్న పది దేశాలు ఆఫ్రికా ఖండంలోనే ఉండడం విచారకరం. అతి ఖనిజ సంపద గల ఈ దేశాలలో బాలలు ఆకలికి గురికావడం అన్యాయం. సోమాలియా,సౌత్ సూడాన్,కాంగో. మడగాస్కర్ ,హైతీ,చాద్, సేటరాల ఆఫ్రికన్ రిపబ్లిక్. నైజీరియా మరియు పాపువా న్యూ జీని దేశాలు మొదటి పది స్థానాలలో నిలిచాయి.
అంతే కాకుండా ఇథియోపియాలో కొనసాగుతున్న తీవ్రమైన ఆకలి మరియు పోషకాహార లోపం, నైజర్ లో తీవ్రమైన ఆహార అభద్రత లోపం, పిల్లల ఎదుగుదలలో పెరుగుదల లేకపోవడం, ఆఫ్ఘనిస్తాన్ లో ఆర్థిక వ్యవస్థ పతనం ఆకలి సంక్షోభం దాదాపు మిలియన్ల మంది పిల్లలను ప్రభావితం చేస్తుంది. గాజా స్ట్రిప్ దిగ్బంధనం మరియు విధ్వంసం, ఆహారం, నీరు లేదా పాఠశాల విద్య లేని పిల్లలు. ఎరిట్రియా కొనసాగుతున్న అణచివేత మరియు పేదరికం; పిల్లల పోషకాహార లోపం మరియు బలవంతపు శ్రమ. యెమెన్ లో ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఆకలి తో అలమటిస్తున్నారు. మధ్య-ఆదాయ దేశాలలో కూడా, అసమానత, స్థానభ్రంశం మరియు ఆర్థిక షాక్‌ల కారణంగా పిల్లల ఆకలి మరియు పోషకాహార లోపంతో పెరుగుతున్నారు.
భరోసా లేని బాల భారతం
భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. భారత్ ఆర్ధికంగా ఎంతో పురోగమిస్తున్నదని చెప్పుకున్నా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం మన దేశం 125 దేశాలలో సీరియస్ క్యాటగిరి దేశాల సరసన 102వ స్థానంలో ఉంది. ప్రపంచం లోనే అతి పెద్ద ఆహార ఉత్పత్తి చేసే దేశమైన కూడా ఆకలి సవాళ్లను ఎదురుకుంటుంది. కోట్ల మంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దేశంలో వివిధ ప్రాంతాలలో కరువు కాటకాలతో బాధ పడుతున్నారు. అసమాన ఆహార పంపిణీ ఈ పరిస్థితికి కారణం. మణిపూర్ జాతుల మధ్య జరిగిన ఘర్షణలలో వేలాది మంది పిల్లలు నిరాశ్రయినారు, మత విద్వేష ఘర్షణలలోభారత్ మొదటి స్థానంలో ఉందని ఈ మధ్య ప్యూ నివేదిక వెల్లడి చేసింది, ఉగ్రవాద దాడులలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవుతున్నారు.
దేశంలో వివిధ ప్రాంతాలలో పారా మిలటరీ దళాలకు సాయుధ సమూహాల మధ్య ఘర్షణలలో పిల్లలు నలిగిపోతున్నారు. కోట్లాది మంది వలసల కుటుంబాలతో పిల్లలు విద్యను కోల్పోవడమే కాకుండా బాలకార్మికులుగా మారుతున్నారు. 28 కోట్ల మంది ఆరు నుండి పద్దెనిమిది ఏళ్ల వయసు పిల్లలలో దాదాపు అయిదు కోట్ల మంది పిల్లలు పాఠశాలలో లేరని ఇటీవల విడుదల చేసిన ప్రభుత్వ లెక్కలే చెపుతున్నాయి. ఎంత అభివృద్ది చెందిన రాష్ట్రమైనా తలసరి ఆదాయం అన్నీ రాష్ట్రాల కంటే అధికంగా ఉన్నా ప్రతి రాష్ట్రంలో వెనుక వేయ బడ్డ ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పిల్లల పరిస్తితి దయనీయంగా ఉంది. బాలల హక్కులు పెద్ద సంక్షోభం లో పడ్డాయి.
నైతిక వైఫల్యం
ఈ సంక్షోభ కాలంలో కోట్లాది మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. వారికి వాగ్దానం చేసిన అత్యంత ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కు, నేర్చుకునే హక్కు, రక్షణ పొందే హక్కు ,స్వేచ్ఛగా ఉండే హక్కు మరియు కలలుకనే హక్కును నిరాకరిస్తున్నారు. ప్రతి ధ్వంసమైన పాఠశాల, ద్వంసమైన దవాఖాన, ప్రతి శరణార్థి శిబిరం, ప్రతి ఖాళీ తరగతి గది ఈ నిరాకరణకు అద్దం పడుతున్నాయి. పెద్దలు సృష్టించిన సంఘర్షణలలో పిల్లలు చనిపోతున్నప్పుడు మనం బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాలను జరుపుకోవడంలో అర్థం లేదు.
బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి వడంబడికను ఆమోదించినప్పటికి, దేశాలు యుద్ధాలను ప్రకటించడం అంతర్గత సాయుధ పోరాటాలకు మద్దతు ఇవ్వడం లేదా తటస్థంగా ఉండడంతో బాలల హక్కులను కాపాడుతామని ప్రతిజ్ఞ చేసిన ఒడంబడికను ఉల్లంఘిస్తున్నాయి. పాఠశాలపై, ఆసుపత్రుల పై పడే ప్రతి బాంబు, ఆహారం మరియు మందులను నిరాకరించే ప్రతి దిగ్బంధనం, విద్య లేకుండా చేసే ప్రతి సాయుధ ఘర్షణ ,తల్లిదండ్రులను కోల్పోయి అనాధలై నిరాశ్రయులైన బిడ్డల పరిస్థితికి ప్రపంచ సమాజం యొక్క నైతిక వైఫల్యమే అని గుర్తించాలి.
ప్రపంచ దేశ నాయకులారా !
ఈ నవంబర్ మాసాన్ని బాలల హక్కుల రక్షణలో ఒక ముఖ్య మార్పు కు నాంది పలకండి. ఉదాసీనత నుండి చర్యకు, నిశ్శబ్దం నుండి కార్యాచరణకు, యుద్ధం నుండి శాంతికి అనే సందేశాన్ని ప్రతిధ్వనించనివ్వండి. అన్ని యుద్ధాలను ఆపండి. ప్రతి బిడ్డకు పౌష్టిక ఆహారం అందించండి. పాఠశాలలు సైనిక చర్యలతో ధ్వంసం చేయకుండా పిల్లలతో భర్తీ చేయదానికి పూనుకోండి. అన్ని యుద్ధాలు మరియు వివధ దేశాలలో జరుగుతున్న సాయుధ చర్యలను వెంటనే ఆపి ఆకలి లేని బాల్యం కోసం కృషి చేయాలి. ప్రతి బిడ్డ శాంతి, విద్య మరియు మనుగడ హక్కును కాపాడాలని ప్రపంచ నాయకులకు అంతర్జాతీయ సంస్థలకు మరియు పౌర సమాజానికి విజ్ఞప్తి. బాలల హక్కుల దినోత్సవం ఒక రోజు జరుపుకునే సంబరాలు కాకుండా బాలల హక్కుల పరిరక్షణ కోసం ఒక ఉద్యమంగా మారి ఛిద్రమవుతున్న బాల్యాన్ని కాపాడుదాం.





