వేగుంట రాఉడు పాడిన చలిగీతం

చిడతలు ఊడిన రెక్కలకిటికీ తెరిచిపెట్టవద్దని ఒహటే మొత్తుకోలు! వడగాలిలా సుడిగాలిలా ఆ వేళ చలిగాలి రివ్వున వీయడంతో కవిగారి కవోష్ణ హృదయంలో చేతులు కొంగర్లుపోవడం, పై పెదవికి కిందిపెదవికి పోట్లాట మొదలయినా అదేదో వినోదప్రదర్శనలా ఆయనగారి స్వదేహమే పులకరించిపోతూ తిలకించడం! కవిగారికి ఇప్పటివరకు తన హృదయమనే ఎయిర్ కండిషన్డ్ గదిలో వెచ్చగ మునగదీసుకుని మూడంకె వేసి పడుకునేవిద్య ఒక్కటే తెలుసును. రాఉడు రాయైనా కిటికీకి అడ్డం పెట్టలేనంత వేగంగావీచే వడగాలి చలిగాలికి ఇప్పుడేంచేయాలో ఊహామాత్రంగానైనా తోచని అయోమయం.

బైట ఎట్లాంటి కష్టాలుకడగండ్లు చెలరేగినా ఆయనగారికి తన హృదయాంతరాళపు రుధిరప్రవాహంలో తనలోతానుగా ముడుచుకుని పడుకోవడమొక్కడే తెలుసులాగుంది. అందుకే అక్కడెక్కడో వీచే కాశ్మీర్ చచ్చేచలిగాలులకు పనికొచ్చే ఉన్ని శాలువాలను గూర్చి అసందర్భపు ఊహలు. ఊహల వెచ్చదనం కోసం కవిగారు పడే తాపత్రయం! తాను తట్టుకోలేని పొగమంచు మంచుపొగను ఎండమావి అనుకున్నంత మాత్రాన వళ్లేమైనా వెచ్చబడేనా? భ్రాంతి కాకపోతే! అంత కష్టంలోనూ ఆ పొగమంచును ప్రపంచమనే పడుచు కప్పుకున్న మేలిముసుగుగా వర్ణించి మురుసుకోవడం కవిగారిలోని కవిపుంగవుడికే చెల్లు. చలిగాలికిగానీ మతి చలించేదేమో! మనసులోని భావాలు ఒకచోట నిలకడగా నిలబడని చంచలస్థితి.

‘రాఉడూ! నా యీ కళ్లనే కుంపట్లలో కాస్తంత నిప్పు రాజేయరా బాబూ! కనుపాపలనే ఈ రెండు రాక్షసి బొగ్గులు రాజుకుంటేనన్నా ఈ చలాగుతుందేమో నీ శ్వాస అనే విసనకఱ్ఱతో యీ పొయ్యూదు!’ అంటూ గోలపెట్టే శాల్తీ, మళ్లీ ‘ఇంట్లోని కొబ్బరినూనె సీసాలో గడ్డకట్టుకుపోయిన నూనెతెచ్చి కాస్త తనకళ్ల పొయ్యిసెగన పెట్టమనడం ఏంటి? ఏంటో! ఈ కవులు ఎవరికీ అర్థంకారు. సరే, కనీసం స్వంత వంట్లోని రాఉళ్లకైనా అంతుబట్టేరీతిలో కలవరించరు ఒక్కోసారి!

ఇంత గందరగోళంలోనూ ఎవరో తలుపుతట్టి ‘ఇంట్లో వంట్లో ఆ నైటుకి కాస్త చోటడిగినట్లు’ కవిగారి అపోహ. ‘కుదర్దని’ కుండలు బద్దలుకొట్టి’ తన సచ్చీలతను ప్రకటించుకున్నట్లు బడాయిలు కూడాను! రాఉడు తొందరపడి తలుపుతీస్తే చలిగాలి వణుక్కుంటూ వచ్చి తన చలితీర్చుకోడం కోసం కవిగారిని కావలించుకుంటుందని బెంగట! కాస్త ఓవరనిపించడంలా వేగుంట మోహన ప్రసాదు సారూ?

కవిగారూ! అసలు విషయం నన్ను సెలవియ్యమందురా. మీ రాఉడి కెలాగూ నోరూవాయా పెగలదు కానీ మార్మికకవులు కదా మీరు! మీకో హృదయం ఉంది. దానితో వేగడం మీవల్ల కానిపని’ అన్న మర్మం మీకు బాగా తెలుసు. అవును మీరన్నట్లు హృదయం నవనాడులూ కలిసే జంక్షనే! ఆత్మకూ దేహానికీ అస్తమానం దెబ్బలాటయ్యే టెంక్షన్ పాయింటూ ఇదేసార్! ఏమాటకామాటే చెప్పుకోవాలి మాష్టారూ! ప్రేమని ఓ గుడ్డి దీపంతో పోల్చడమే కాకుండా ఆ దరిద్రం వెలిగి కొండెక్కేది చోటుకూడా ఇదేనని పసిగట్టడంలోనే ఉంది మీ రసరహస్య ఉప్రజ్ఞ సర్వస్వం! హత్యకు, ఆత్మహత్యకు గుండె ఎందుకు బలిపీఠం అనిపించిందో స్వర్గానికి వల్లకాడు రెండింటికి కూడా ఇదే కేరాఫ్ అడ్రసని తోచిందో మీరు వేరే వివరించకుండానే లాస్ట్ లైన్ పంచ్ లో తేల్చేసారుగా! ‘ప్రేమ’ అనే ఆ దరిద్రపు గుడ్డిదీపం వెలిగి కొండెక్కేదిక్కడన్న మాట ఎంతో అనుభవంమీద చెప్పినమాట మాష్టారూ!

హత్యకు ఆత్మహత్యకు ఇదే బలిపీఠం. స్వర్గసీమ వల్లకాడు రెండూ ఇదే కేరాఫ్ అడ్రస్ అని. ఆహాఁ! ఎంత గొప్పగా చెప్పారు సార్! జీవిచావుకూ, చావుబతుకు కూడా ఈ హృదయమే కరెక్ట్ స్పాట్ అన్న ఒక్క భారీవాక్యం చాలు మోహనప్రసాదు సారూ ఈ  ‘హిమనీ హృది’ని జన్మంతా గుండెలమీద పెట్టుకుని ఇష్టంగా ఈజీగా మొసెయ్యడానికి! హ్యాట్సాఫ్ అనడానికి అసలుపాయింట్ ఇప్పుడు చెప్పనా గురూజీ!  ఒకేదుప్పటి మీ బైరాగి రాఉడితో పంచుకోవడానికి సిద్ధపడిన వైరాగ్యంలో కూడా బైట గాజులసవ్వడి వినబడగానే ఎట్లా ప్లేట్ ఫిరాయించేసార్సార్! హ్హాహ్హాహ్హా!మనిషి మనసులోని చపలత్వం సర్వం రూపుకట్టించేసారుగా! ఏ బొమ్మలపెళ్లి లక్కచిట్టో జలపాతంలా అందెలమువ్వలతో చిందులేసుకొంటూనో అందాల రంగవల్లిలా మీ గుమ్మంముందు చేరి తలుపుతట్టినట్లుగా మీకైమీరే మహాసందడిగా ఊహించేసుకుని మంచులా కరిగిపోయింది ఒక్క మువ్వలసవ్వడికే మీ దీనత్వం, వేదాంతం సర్వం! మహద్భాగ్యంగా స్వీకరిస్తాం ఈ వేగుంట మోహన ప్రసాదం, మనిషి చపలత్వాన్ని మొహమాటం లేకుండా చివరి రెండువరసల్లో వివస్త్రంగా ప్రదర్శించేసినందుగ్గాను.

రాఉడూ! వేసెయ్! తలుపులు వెసెయ్!
ఆ కిటికీ రెక్కకు చిడుత లేదల్లే ఉంది!
పోనీ, ఏదైనా రాయైనా అడ్డం పెట్టు.
ఇదేవిట్రా రాఉడూ! ఇవ్వాళిట్లా
వడగాలిలా, సుడిగాలిలా ఈ చలిగాలి!
నా హృదయం అనే ఎయిర్ కండిషన్డ్ రూంలో
వెచ్చగ ముసుగు వేసి మూడంకె వేసి
హృదయాంతరాళపు రుధిర ప్రవాహంలో
నాలో నేనుగ పడుకొన్నాను కద!
ఇంకా ఏమిటిరా ఈ చలి, మరీ ఆగడం.
కాశ్మీర్లో చచ్చే చలి గనుకనే
అన్నన్ని ఉన్ని శాలువాలు.

రాఉడూ నా ఈ కవోష్ణ హృదయంలో
చేతులు కొంగర్లు పోయి,
పై పెదవికి కింది పెదవికి పోట్లాడ రాగ
దవడలు చప్పట్లు కొడుతూంటే
పులకరించిన దేహం చూస్తూ ఊరుకుంటూంటే
మంచుముక్కలా పడుకున్నాను కద!
ప్రపంచం మరీ ఇంత నీళ్లు గారిపోతున్నదేం?
కళ్ల ముందు ఏమిటీ పొగమంచు!
భ్రాంతి అనే ఎండమావిలా ఈ మంచుపొగ!
ప్రపంచమనే యువతి వేసుకున్న మేలిముసుగు!
నాకే ఇంత చలి వేస్తున్నదే,
వీళ్ల కెంత చలో మఱి!
రాఉడూ! నా యీ కళ్లనే కుంపట్లలో
కాస్తంత నిప్పు రాజేయరా బాబూ!
కనుపాపలనే ఈ రెండు రాక్షసిబొగ్గులు
రాజుకుంటేనన్నా ఈ చలాగుతుందేమో!
నీ శ్వాస అనే విసనకఱ్ఱతో యీ పొయ్యూదు!
మన ఇంట్లో కొబ్బరినూనె సీసాలో నూనె
గడ్డకట్టుకు పోయింది కదూ?
కాస్త నా కళ్ల సెగన పొయ్యి సెగన పెట్టు దాన్ని!

ఈ రాత్రి నెవరురా వారు?
“నీ యింట్లో, నీ హృదయంలో యీ నైటుకి కాస్త
తలదాచుకోనియ్యి” అంటారు! వీల్లేదని చెప్పు!
రాఉడూ! తలపు తియ్యకు! తీశావో,
చలిగాలి ‘ఉహుహు’ అని వణుకుతూ వచ్చి
తన చలి తీర్చుకోవడానికి నన్ను కౌగలించుకుంటుంది.
హృదయం అంటే సామాన్యమా! కర్మ!
నాలోని నవనాడులూ కలిసే చోటు.
ఆత్మకూ దేహకూ పేచీ వచ్చేదిక్కడనే.
‘ప్రేమ’నే ఆ దరిద్రపు గుడ్డిదీపం
వెలిగి కొండెక్కేదిక్కడనే!
హత్యకు ఆత్మహత్యకు ఇదే బలిపీఠం.
స్వర్గసీమ వల్లకాడు రెండూ ఇదే.
ఇక్కడే జీవి చనిపోయేదీ, చావు బ్రతికేదీను.
అసలూ నీవూ నేనూ ఉన్నదే ఇక్కడ.
మనకున్న యీ ఒకే ఒక్క దుప్పటిని నీవు కూడా పంచుకో.

రాఉడూ! చూడు చూడు! ఏవిటా గాజుల సవ్వడి!
జలపాతంలో అందెల మువ్వల చిందులు!
అందాలరంగవల్లి రా ఎవరావిడ?
బొమ్మల పెళ్ళిలో లక్క చిట్టిలా ఎవరు?
రాఉడూ! తీసెయ్! తలుపు బార్లా తీసెయ్!

(భారతి పత్రిక 1960 మే సంచికలో ప్రచురించిన వేగుంట మోహన ప్రసాద్ ‘హిమానీ హృది’ కవితమీద స్పందన)

-కర్లపాలెం హనుమంతరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *