విశ్వంభరపు విశాల దృశ్యం

కవిలోపల ఉవ్వెత్తున ఎగిసే భావాల ప్రవాహం కవిత్వం. ఆ ప్రవాహం కొన్నిసార్లు సున్నితమైన వాగులా పారుతుంది అది సరళత. అదే ప్రవాహం కొన్నిసార్లు గంభీరమైన సముద్రంలా విస్తరిస్తుంది అది క్లిష్టత. సరళంగా రాయడం కష్టం , క్లిష్టంగా రాయడం సులభం. డాక్టర్ సి.నారాయణరెడ్డి తనరచనల్లో సరళతకే అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. అలతి అలతి మాటల్లో గేయలక్షణాల్నిసంతరించుకుని ఆయన కవిత్వం సాగుతుంది. తొలిరోజుల్లో రాసిన కావ్యాల్లో కొంత సంక్లిష్టత కనిపిస్తుంది. కానీ సినారె రెండు ధోరణుల సమన్వయంతో రాశారు. సరళతలోని స్పష్టత, క్లిష్టతలోని లోతు ఆయనలో కనిపిస్తాయి. ఈ రెండు కలిసినప్పుడు ఆ కవిత్వం సంపూర్ణమవుతుంది. అందుకే ఆయన కవిత మొదట సులభంగా అర్థమవుతుంది, మళ్లీ చదివినప్పుడు కొత్తఅర్థం లోతు కనిపిస్తుంది.

సినారె 1931 జూలై 29న ఉమ్మడి కరీంనగర్ జిల్లా హనుమాజిపేటలో జన్మించారు. సాధారణ గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆయన భాషపట్ల, కవిత్వం పట్ల అసాధారణమైన ఆసక్తిని పెంచుకున్నాడు. ప్రాథమికవిద్య ఉర్దూలో సాగినా, జానపదంపై, తరువాత తెలుగు సాహిత్యంపై గాఢమైన ఆకర్షణ ఏర్పరుచుకున్నారు. ఆ ఆకర్షణే ఆయనను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లింది. సినారె సాహిత్య ప్రయాణం విస్తృతమైనది. కవిత్వం ప్రధాన వేదిక అయినప్పటికీ, ఆయన రచనలు గేయాలు, వ్యాసాలువంటి అనేకప్రక్రియలుగా విస్తరించాయి. ముఖ్యంగా సినిమారంగంలో రాసిన పాటలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఈ ప్రజాదరణ మధ్య కూడా ఆయన సాహిత్య గంభీరత తగ్గలేదు.

సినారె కవిత్వంలో ప్రధానంగా కనిపించే లక్షణం మానవతాదృక్కోణం. ఆయనకు మనిషి ప్రధానం. జాతి, మతం, భాష అనే గోడలకంటే మించి, మనిషి విశ్వజీవి అనేభావన ఆయన కవిత్వంలో ప్రతిధ్వనిస్తుంది. ప్రకృతిపట్ల అనుబంధం కూడా ప్రత్యేకమైనది. భూమిని తల్లిగా, జీవాన్ని విశ్వప్రయాణంగా చిత్రించారు. భాషాపరంగా సినారెది ప్రత్యేకశైలి. పదాలు సులభంగా ఉంటాయి. వాటివెనుక భావం లోతు, లాలిత్యం, సంగీతాత్మకత, తాత్వికత ఈ మూడు లక్షణాలు ఆయన కవిత్వంలో సమన్వయంగా కనిపిస్తాయి.

సినారెకు జ్ఞానపీఠ అవార్డును తెచ్చిపెట్టిన కావ్యం ‘విశ్వంభర’. దాని శీర్షికనే విశాలప్రతీక. ప్రపంచాన్ని మోసేభూమి సృష్టికి మూలం. సినారె విశ్వంభరలో భూమి నిర్జీవగ్రహం కాదు అది మానవచరిత్రను మోసే సాక్షి, జీవనాన్ని పుట్టించే గర్భగృహం. విశ్వంభరలో సినారె మనిషి పరిణామాన్ని మూడు ప్రధానదశల్లో చూస్తాడు. ప్రకృతికి లోబడిన జీవితం, నాగరికత నిర్మాణం, చివరకు చైతన్య వికాసం. ఈ మూడుదశలు మనిషి తననుతాను తెలుసుకునే యాత్రగా మారుతాయి. ‘విశ్వంభరలో కథానాయకుడు ఒకవ్యక్తి కాదు మానవజాతి. ఇందులో కథలేదు. చరిత్ర ఉంది. కాలపరిమితి లేదు. కాలప్రవాహం ఉంది. ఈ నిర్మాణం కవిత్వాన్ని నిరంతర ప్రవాహంగా మార్చింది. ఇందులో సినారె మనిషిచరిత్రను విశాలదృశ్యంగా చిత్రిస్తాడు. గుహల్లో జీవించిన ఆదిమనిషి నుంచి నగరాల్లో నివసించే ఆధునికమనిషి వరకు అది ఒక నిరంతర యాత్ర. ఈ యాత్రలో మనిషి ప్రకృతితో పోరాడాడు, నాగరికతను నిర్మించాడు, విజ్ఞానాన్ని ఆవిష్కరించాడు. కానీ ఈ అన్నివిజయాల మధ్య అతను తనఆత్మను వెతుకుతూనే ఉన్నాడు. ఈ ప్రశ్నే విశ్వంభరకు కేంద్రమైన తాత్వికదృక్పధం.

మనిషి ఎంత ఎదిగినా, తననుతాను పూర్తిగా తెలుసుకున్నాడా? అన్నది కవిగా సినారె పడే తపన. విశ్వంభర మానవతావాదంతో ముడిపడి ఉంది. జాతి, మతం, దేశంవంటి విభజనలు కృత్రిమమని, అసలు సత్యం మానవత్వమని సినారె స్పష్టం చేస్తాడు. ఈ భావన భారతీయ తాత్విక సంప్రదాయంలోని వసుధైక కుటుంబకం సిద్ధాంతానికి సమీపంగా ఉంటుంది. అదేసమయంలో, ప్రకృతి-మనిషి సంబంధాన్నికూడా ఆయన లోతుగా పరిశీలిస్తాడు. ప్రకృతిని జయించాలనుకున్న మనిషి, చివరికి తాను కూడా ప్రకృతిలో భాగమేనని గ్రహించే క్షణం రావాలన్నది కవిగా ఆశిస్తాడు. సినారె ఇతరరచనలతో పోలీస్తే విశ్వంభరలో ప్రతీకలు కీలకపాత్ర పోషిస్తాయి. భూమి జీవనమూలం, మనిషి సృష్టి చైతన్యం, ప్రకృతి సమతుల్యత, నగరం నాగరికత సంక్లిష్టతకు ప్రతీకలుగా నిలుస్తాయి.

సాహిత్యంతోపాటు సినారె కళా, సామాజిక, విద్యారంగాల్లో కూడా కృషిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా రాజ్యసభ సభ్యుడిగా, తెలుగుభాష అభివృద్ధికి, సాహిత్య విస్తరణకు దోహదం చేశాడు. ఏ మారుమూల నుంచో ఓ కొత్తకవి తన పుస్తకం పంపితే దానికి బదులుగా అభినందనలు ఆశీస్సులు తప్పకుండా పంపేవాడాయన. వర్తమానకవికి ఎంతో ప్రోత్సాహమది. అంతేకాదు సాయంత్రాలు సభలకు కేటాయించినా ఉదయం మాత్రం వర్షం కురుస్తూ వున్నా గొడుగు పట్టుకుని ఉదయపు నడకకు వెళ్ళిన జీవనశైలి ఆయనది. జ్ఞానపీఠంతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి గౌరవాలు ఆయన సాహిత్యప్రస్థానంలో అందుకున్నారు. 2017 జూన్ 12న ఆయన తనువు చాలించారు. ఎవరేమన్నా ఆయన కవిత్వం సజీవం. ఎందుకంటే నిజమైన కవి తనజీవితంతో కాదు, తన రచనలతో నిలుస్తాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *