అక్కడి నుంచి నిషేధిత నగరానికి ( forbidden city)కి వెళ్ళాం. ఇది చైనాలోని అతి పెద్ద పురాతన భవనాలలో ఒకటి. ఇది చారిత్రక నిర్మాణం. మింగ్, క్వింగ్ రాజుల నివాసం. ఐదు వందల సంవత్సరాలకు పైగా 24 మంది మింగ్, క్వింగ్ చక్రవర్తులు అక్కడ నివసించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద. దీనిని ‘ Palace of Museum ‘ అని కూడా పిలుస్తారు. దీనిని 1406లో మింగ్ వంశంలోని యోంగిల్ చక్రవర్తి నిర్మించాడు. ఆనాటి చక్రవర్తులకు ఒక్కొక్కరికి 300 మంది ఉంపుడు గత్తెలు ఉండేవారని గైడ్ చెప్పినప్పుడు .. అందువల్లే చైనా విప్లవంలో స్త్రీలు అధికసంఖ్యలో పాల్గొని ఉంటారని అనిపించింది.
గిరియానం – 7
చైనా విప్లవోద్యమ చరిత్ర,సాంస్కృతిక విప్లవం, సాహిత్యం, మట్టి మనుషులు చేసిన జైత్రయాత్ర, శ్రీశ్రీ 80ల్లో రాసిన చైనా యానం చదివడం వల్ల చైనా దేశం పట్ల ఉద్వేగభరితమైన ఆసక్తి ఏర్పడింది. 2018 జూన్ లో వెళ్ళే అవకాశం ఉన్నా వెళ్ళలేక పోయాను. 2019 లో దాట్ల దేవదానం రాజు రాసిన చైనా యానం చదివిన తర్వాత చైనాకు వెళ్ళే అవకాశం కోసం చూస్తూనే వున్నాను. అనుకోకుండా చైనాకు వెళ్ళే అవకాశం వచ్చింది. రెండుమూడు వారాల వ్యవధి లోనే వీసాతో పాటు అన్ని పనులు చకచకా జరిగిపోయాయి.
అక్టోబర్ నాలుగో తేదీ రాత్రి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాం. సుమారు ఎనిమిది గంటల ప్రయాణం. మధ్యలో హాంగ్ కాంగ్ లో ఫ్లైట్ మారాం. భారతీయ కాలమానం కంటే చైనా కాలమానం రెండున్నర గంటల ముందుంది. 22 మంది సభ్యుల బృందం. మేం మా సామానుతో బయటకు వచ్చేసరికి మా టూరిస్టు గైడ్ చెరీ సిద్ధంగా ఉన్నాడు. అతనిని అనుసరించాం. బస్ లో చెరీ తనను పరిచయం చేసుకొంటూ పాములు, కప్పలు, కుక్కలు, ఎలుకలు లాంటివి తినరని, చికెన్, మటన్, ఫిష్, డక్ మాత్రమే చాలా మంది చైనీయులు తింటారని చెప్పడం వల్ల చైనా దేశం ఆహారం పట్లవుండే కొన్ని అభిప్రాయాలు కేవలం అపోహలని తెలిసింది.
బీజింగ్ చైనాలో రెండో అతిపెద్ద నగరం. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు రాజధాని. దీనిని పూర్వం ‘ పెకింగ్ ‘అనే పేరుతో పిలిచే వాళ్ళు. జనాభా సుమారు 22 మిలియన్లు. ప్రపంచంలోని ముఖ్యమైన పర్యాటక నగరాలలో బీజింగ్ ఒకటి. మూడు వేల యేళ్ళ చరిత్ర కలిగిన పురాతన మైన నగరం. అందువల్ల వల్ల పాత కొత్తల మేళవింపుతో అక్కడి సంస్కృతి కనిపించింది. చరిత్రకు, రాజకీయాలకు కళలకు, క్రీడలకు, వ్యాపారానికి బీజింగ్ నెలవు. అందులోనూ మేం వెళ్ళింది అక్టోబర్ మొదటి వారం. ఆ రోజులు వాళ్ళకు సెలవు దినాలు. అందువల్ల కాబోలు పర్యాటక ప్రదేశాలన్నీ రద్దీగా ఉన్నాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన చాలా మంది అమ్మాయిలు వీధుల్లో కనిపించారు. కుటుంబాలు, మిత్రులతో సంతోషంగా విందులు చేసుకుంటూ వీధులలో ప్రజల సందడి కనిపించింది.
ఉదయమే అల్పాహారం ముగించి, ముందుగా జేడ్ ఫ్యాక్టరీ సందర్శనకు వెళ్ళాం. అక్కడ మొండెం వరకున్న వీరుల విగ్రహాలలో మా తలలు ఉంచి సరదాగా ఫోటోలు తీసుకొని లోపలికి వెళ్ళాం. జేడ్ రాయితో చేసిన అద్భుతమైన కళాఖండాలు చూపు తిప్పనివ్వలేదు. వాటిని తయారు చేసే విధానాన్ని పరిశీలించాను. రాయిని కూడా అభివృద్ధిలో భాగం చేసిన వాళ్ళ నైపుణ్యాన్ని అభినందించకుండా ఉండలేను. నాణ్యమైన వస్తువులే కావడం వల్ల ధరలు అధికంగా ఉన్నాయి. అక్కడి నుంచి ప్రసిద్ధ, పురాతనమైన చైనా వాల్ చూడడానికి బయలు దేరాం.
చైనా వాల్ సందర్శనకు నాలుగు మార్గాలున్నాయిట. మేము రోప్ వే మార్గంలో వెళ్ళాం. అక్కడి నుంచి నలుగురం మాత్రమే మెట్లగుండా మూడు నాలుగు కిలోమీటర్ల వరకు పైకి వెళ్ళాం. మెట్లు కొన్ని చోట్ల ఎత్తుగా, కొన్ని చోట్ల ఓ మాదిరిగా ఉన్నాయి. పొడవు 21, 196కిలోమీటర్లు. క్రి.పూ. 5,6 శతాబ్దాల నుంచి దానిని పడ గొడుతూ మూడు దశలుగా నిర్మించినట్లు గైడ్ చెప్పాడు. చైనాను మంగోలియన్ ల దాడుల నుంచి రక్షించడానికి ప్రస్తుత నిర్మాణం మింగ్ రాజులు నిర్మించారు. గోడ మధ్యలో సుమారు 1200 వాచ్ టవర్లు మూడంతస్తులలో ఉన్నాయి. పొడవు 6, 508 కిలోమీటర్లు. ప్రపంచంలోని ఏడు వింతలలో ఏడవది. ప్రపంచంలోనే మానవులు నిర్మించిన అతి పొడుగైన కట్టడం. సుమారు నలభై వేలమంది ఈ నిర్మాణంలో భాగమయ్యారట.

చైనీస్ రెస్టారెంట్ లో లంచ్ చేశాం. గైడ్ సహాయంతోనే పూర్తి శాఖాహార వంటకాలను చూసుకొని భోజనం ముగించాను. అక్కడ ఫ్లవర్ టీ నాకు చాలా నచ్చింది. అక్కడి నుంచి చాంగ్లింగ్ కు బయలుదేరాం.
బీజింగ్ కు 30 కిమీ దూరంలో ఉంది. అక్కడ 13 మంది మింగ్ చక్రవర్తుల సమాధులున్నాయి. వాటిలో చాంగ్లింగ్ పెద్దది. చైనా భాషలో ‘ లింగ్ ‘ అంటే ‘ సమాధి ‘ అని అర్థం. మింగ్ రాజ వంశంలో మూడో చక్రవర్తి యోంగిల్ సమాధి. అసలు సమాధిని చూడడానికి అనుమతి లేదు. పై నుంచి మాత్రమే చూడవచ్చు. ఐదుగరం మాత్రమే పై వరకూ వెళ్ళాం. సెలవుల కారణంగా కాబోలు కొందరు యువకులు ఆనాటి సాంప్రదాయక చక్రవర్తుల దుస్తులలో, మరికొందరు ఆనాటి పోలీసుల వేషధారణలో కనిపించారు. చక్రవర్తుల దుస్తులు ఎరుపు, బంగారు రంగులో, పోలీసుల దుస్తులు నలుపు రంగులో ఉన్నాయి. సరదాగా వాళ్ళతో కలిసి ఫోటోలు తీయించుకున్నాము. సాయంత్రం మేం నేషనల్ స్టేడియం కు వెళ్ళాం. పక్షి గూడు ఆకారంలో, విద్యుత్ దీపాల కాంతితో మెరిసి పోయింది. 2008లో బీజింగ్ ఒలంపిక్స్ ఫుట్ బాల్ క్రీడల నిర్వహణ కొరకు దాని నిర్మాణం జరిగింది. సుమారు 90 వేలమంది కూర్చోవచ్చు. మొదటిసారి ఒలంపిక్స్ అక్కడే నిర్వహించారని గైడ్ చెప్పా డు.
మరునాడు ప్రపంచంలో అతి పెద్దదైన టియానన్మేన్ స్క్వేర్ కు వెళ్ళాం. ఏడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక వైపు పార్లమెంటు భవనం, మరో వైపు మ్యూజియం, మధ్యలో మావో పార్థివ దేహాన్ని ఉంచిన భవనం ఉంది. వీల్ ఛైర్ సౌకర్యం వుంది. దానికి 300 యువాన్ లు చెల్లించాలి. అయితే వాటిలోకి స్థానికులను మాత్రమే అనుమతిస్తారని గైడ్ చెప్పినప్పుడు నాకు నిరాశ కలిగింది. చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు, నాయకుడైన మావో స్మారకస్థల నిర్మాణం 1976లో మొదలుపెట్టి 1977 లో పూర్తయింది. వందలాది మంది చైనీయులు ఎర్రజెండాలతో అక్కడ కనిపించారు. అందమైన పూలతోటలతో, శిల్పాలతో ప్రాంగణమంతా అందంగా, శుభ్రంగా వుంది. ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు నాలో కలిగిన భావోద్వేగం నేను మాటల్లో చెప్పలేను.
అక్కడి నుంచి నిషేధిత నగరానికి ( forbidden city)కి వెళ్ళాం. ఇది చైనాలోని అతి పెద్ద పురాతన భవనాలలో ఒకటి. ఇది చారిత్రక నిర్మాణం. మింగ్, క్వింగ్ రాజుల నివాసం. ఐదు వందల సంవత్సరాలకు పైగా 24 మంది మింగ్, క్వింగ్ చక్రవర్తులు అక్కడ నివసించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద. దీనిని ‘ Palace of Museum ‘ అని కూడా పిలుస్తారు. దీనిని 1406లో మింగ్ వంశంలోని యోంగిల్ చక్రవర్తి నిర్మించాడు. ఆనాటి చక్రవర్తులకు ఒక్కొక్కరికి 300 మంది ఉంపుడు గత్తెలు ఉండేవారని గైడ్ చెప్పినప్పుడు .. అందువల్లే చైనా విప్లవంలో స్త్రీలు అధికసంఖ్యలో పాల్గొని ఉంటారని అనిపించింది.చైనాలో అతిపెద్ద పురాతన మాము చెక్క కట్టడం. ఆ చెక్కకు చెదలు పట్టవని, చాలా దృఢంగా ఉంటుందని గైడ్ చెప్పాడు. దాని విస్తీర్ణం 720000 చ.మీ. సామాన్య ప్రజలకు ప్రవేశం నిషేధించడం వల్ల దానికి ‘ నిషేధిత నగరం ‘ అనే పేరు వచ్చింది. ఏడాదికి సుమారు 16 మిలియన్ల పర్యాటకులు దానిని సందర్శిస్తారని చెరీ చాలా గర్వంగా చెప్పాడు. ఈనాటికీ చెక్కు చెదరకుండా రాజసం ఉట్టిపడుతూ వుంది. చిన్న గీత కూడా ఎక్కడా కనిపించ లేదు. మనదగ్గర చారిత్రక కట్టడాలపైన భయంకరమైన పిచ్చి గీతలు దర్శనమిస్తాయి.
అక్కడి నుంచి మేం ‘టెంపుల్ ఆఫ్ హెవెన్ ‘ కు వెళ్ళాం.దీనిని కూడా మింగ్ చక్రవర్తి యోంగిల్ 1406 – 1420 లో నిర్మించాడు. పూర్వం చైనాలో చక్రవర్తిని స్వర్గానికి ప్రతినిధిగా భావించేవారట. అది రాజ వంశీయుల ప్రార్థనా మందిరం. భూమిని పూజిస్తూ మంచి పంటల కోసం మతపరమైన వేడుకలు నిర్వహించేవారట. మెట్లు ఎక్కి పైకి వెళితే బీజింగ్ నగరం అంతా కనిపిస్తుంది. ఆలయం లోపలికి ప్రవేశం లేదు. కిటికీలోనుంచి చూసినప్పుడు ఒక మొద్దు ఆకారం కంపించింది. అదే వాళ్ళదేవత కాబోలు. ఇలా మూడురోజుల బీజింగ్ పర్యటనలో చైనీయుల చరిత్ర, సంస్కృతిని తెలుసుకున్నాను.





