అనుభవాల స్టాచ్యూ

విషాదఛాయలు పులుముకున్నప్పుడు
నడుస్తూ ఉంటా ఒక పొడవాటి బాటలో
పక్కన చెట్లలా ధైర్యవంతులు కొందరు
కనిపిస్తరు కొండలు గుట్టలు
నన్ను ఒక్కడినే విసిరేసినట్టు
సృష్టి పగబట్టి కంపిస్తున్నట్లు
పండ్లు పటపటమని కొరుకుతూ
వానలో తడిసాక తేలిక పడుతుంది
ఆలోచన చలిలో పొదిగి
గంభీరతను పొంది
ఎండను మరిచి వెనుదిరిగి
మళ్ళీ మొదలెడుతుంది నౌకను
గీస్తది కొత్త గీతలను
కలుపుతది బిందువుల బంధువులను
సంభావ్యతల ఒడిలో ఈసారి
ఇంకొంచెం ముందుకెళ్తది
ఇంకో ప్రమాదం పొంచి ఉందన్న
నమ్మకంతోనే ఫలితాల పరంపర
సాధారణీకరణమై మాటిమాటికి
దాటంగా ఊరట పొంది ఒకానొక
స్వభావాన్ని చేరుకుంటది
కొత్తగాలులను ఆహ్వానించి
పాత వాటిని నెమరేస్తూ
ప్రక్రియలో అర్థం అవగతం అయి
పరిపక్వత పలకరింపబడుతది
ఎగిసిపడిన భావోద్వేగాలు తటస్థమై
మళ్ళీ ఇట్లాంటి బాటలోనో సరిహద్దుల్లోనో
తచ్చాడినప్పుడు సున్నితత్వం
పరిమళాన్ని వెదజల్లి
పరమానందాన్ని కౌగిలించుకుని
చూపులు హాయిగా నవ్వుతవి
తేటగా అడుగులు క్రమసహితంగా
తడిసి మాటలు తగినంతనే వస్తయి
ఇవన్నీ ఆ అనుభవాల దారిలోనే
వాటంతటవే పొందికై… ఒక చెక్కిన
చిక్కని శిల్పం ఆవిష్కృతమైతది!
 – రఘు వగ్గు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *