భారతీయ హిందీ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహా నటుల్లో ధర్మేంద్ర ఒకరు. సగం శతాబ్దానికి పైగా తన నటనా ప్రస్థానంతో కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించిన ఈ మహానటుడు నవంబర్ 24, 2025న తన 90వ ఏట తుది శ్వాస విడిచి మహా ప్రస్థానం చేశారు. ఆయన మరణం భారత సినీ ప్రపంచానికి ఒక యుగాంతం. సాహసోపేత యాక్షన్, సహజమైన ప్రేమాభినయం, హాస్యంలో మృదుత్వం, గంభీరతలో సౌమ్యత—అదే ధర్మేంద్ర. 1935 డిసెంబర్ 8న పంజాబ్ రాష్ట్రంలోని లూధియానా జిల్లా సహ్నేవాల ప్రావిన్స్ బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత పంజాబ్), గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన ధర్మసింగ్ దేవ్ చిన్నప్పటి నుంచే సినిమాల పట్ల అపారమైన ఆకర్షణ కలిగి ఉన్నాడు. పంజాబ్‌లో విద్యను పూర్తిచేసిన అనంతరం ఫిల్మ్‌ఫేర్ పత్రిక నిర్వహించిన “న్యూ టాలెంట్ హంట్” పోటీలో విజేతగా నిలవడం ఆయన సినీ జీవితం ప్రారంభానికి మార్గం సుగమం చేసింది.
ఆ పోటీ ఫలితంగా 1958లో ముంబై చేరుకున్న ఆయన 1960లో విడుదలైన “దిల్ భీ తేరా హమ్ భీ తేరే” చిత్రంతో తెరపై అడుగు పెట్టాడు. మొదట్లో సున్నితమైన ప్రేమికుడిగా, భావోద్వేగ నటుడిగా చిన్నచిన్న పాత్రలు చేసినా, అతని కళ్ళలోని నిజమైన భావం, సహజ హావభావాలు ప్రేక్షకుల మనసును గెలుచు కున్నాయి. “బందిని”, “అనుపమా”, “సత్యకామ్”, “చుప్కే చుప్కే”, “ఆకాశ్ దీప్”, “హక్‌ఢీ” వంటి చిత్రాలు ఆయనలోని లోతైన భావ వ్యక్తీకరణకు సాక్ష్యాలుగా నిలిచాయి. బిమల్ రాయ్, హృషికేశ్ ముఖర్జీ వంటి దర్శకులు ఆయన నటనలోని సహజతను గుర్తించి, క్లాసిక్ సినిమాల్లో ప్రధాన పాత్రలు ఇచ్చారు. 1966లో వచ్చిన “ఫూల్ ఔర్ పత్థర్” ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.
ఇందులో ఆయన యాక్షన్ హీరోగా నటించి, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు. అదే సంవత్సరం ఆయనకు “ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు” నామినేషన్ కూడా దక్కింది. ఆ తర్వాత వచ్చిన రాజా జానీ, షరాఫత్, నయా జమానా, పత్తర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మై జవాన్, మా, చాచా భటిజా, శోలో ఔర్ శభనమ్”, “మజ్బూర్”, “పాయల్ కీ ఝంకార్”, “షికార్”, “యాదోం కీ బారాత్”, “ధర్మ్ వీర్”, “చరసీ”, “జుగనూ”, “దోస్త్”, “రామ్ బలరామ్”, “కతిలో కా కతిల్”, “దిల్ లాగీ”, “అజాద్”, “హక్కీక్త్”, “చుప్కే చుప్కే”, “సీతా ఔర్ గీతా”, “శోలే” వంటి చిత్రాలు ఆయన బహుముఖ ప్రతిభకు సాక్ష్యం. హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వంలో ధర్మేంద్ర నటించిన సత్యకామ్ చిత్రానికి కూడా ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.
“ ముఖ్యంగా 1975లో విడుదలైన “శోలే” చిత్రంలోని ‘వీరు’ పాత్ర ఆయనకు శాశ్వత గౌరవం తెచ్చింది. “బసంతీ, ఇన్ కుత్తోం కే సామ్నే మత్ నాచనా” అనే డైలాగ్ ఇప్పటికీ భారతీయ సినీ చరిత్రలో చిరస్మరణీయంగా మారింది. ఆ సినిమాలో ఆయన చూపిన ఉల్లాసం, ప్రేమ, ధైర్యం అన్నీ కలిపి ఆయనను ప్రజల గుండెల్లో స్థిర పరిచాయి. “సీతా ఔర్ గీతా”లో హేమా మాలినితో ఆయన నటనలో సహజమైన కవితాత్మక ప్రేమ దృశ్యాలు ప్రేక్షకుల మనసును కదిలించాయి. “చుప్కే చుప్కే”లో హాస్యానికి ఆయన చూపిన నటనా స్పర్శ హిందీ కామెడీ సినిమాలకు కొత్త శైలిని తెచ్చింది. “సత్యకామ్”లో ఆయన చేసిన పాత్రలో ఉన్న లోతైన మనోవ్యథ ఆయన నటనా సామర్థ్యాన్ని శిఖరానికి చేర్చింది. “ధర్మ్ వీర్”, “యాదోం కీ బారాత్”, “రామ్ బలరామ్”, “ప్రయాస్”, “ఆజాద్”, “లోహా”, “సహసీ”, “పత్థర్ ఔర్ పాయల్”, “తలాష్”, “బ్లాక్ మెయిల్”, “హకీక్త్”, “తూ హీ మేరిజిందగీ”, “రజియా సుల్తానా” వంటి సినిమాలు ఆయన యాక్షన్, సెంటిమెంట్, సంగీత వైవిధ్యాలను ప్రతిబింబించాయి. హేమా మాలినితో ఆయన జంట హిందీ సినిమా చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందినది.
తెరపై చూపిన వారి ప్రేమ ఆప్యాయత, ఆరాధన వాస్తవ జీవితంలోనూ ఆవిర్భవించి, వారు వివాహ బంధంతో ఒకటయ్యారు. ధర్మేంద్ర జీవితంలో కుటుంబం, విలువలు, స్నేహం, నిబద్ధత ప్రధాన సూత్రాలు. ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఇద్దరూ బాలీవుడ్‌లో అగ్ర హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. 2004లో ధర్మేంద్ర రాజస్థాన్ లోని బికనీర్ నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై రాజకీయ రంగంలో అడుగుపెట్టినా, ప్రజల మనసుల్లో ఆయనను నిలబెట్టింది ఆయన నటన. 2012లో భారత ప్రభుత్వం ఆయనకు “పద్మభూషణ్” పురస్కారం ప్రదానం చేసింది. అంతకుముందు ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, నేషనల్ ఫిల్మ్ గౌరవాలు కూడా ఆయనకు లభించాయి. ఆయన నటించిన వందల సినిమాల్లో దాదాపు ప్రతి ఒక్కటి ప్రేక్షకుల గుండెల్లో ఒక ముద్ర వేసింది.
వయస్సు పెరిగిన తరువాత కూడా ఆయన ఉత్సాహం తగ్గలేదు. “యమ్లా పగ్లా దివానా” సిరీస్‌లో తన కుమారులతో కలిసి నటించి కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ధర్మేంద్ర జీవితం ఒక సాధారణ రైతు కుమారుడు కృషి, నిబద్ధత, పట్టుదలతో ప్రపంచ ఖ్యాతిని పొందగలడని నిరూపించింది. తెరపై ఆయన చూపిన పౌరుషం వెనుక ఒక మృదువైన హృదయం ఉంది. ఆయన నవ్వు వెనుక ఉన్న స్నేహం, ఆయన కన్నీటి వెనుక ఉన్న మానవత్వం ప్రజలకు స్ఫూర్తి. ధర్మేంద్ర మరణం భారతీయ సినిమా ఒక యుగాన్ని కోల్పోయినట్లే. కానీ ఆయన చూపిన మనిషితనం, నటనలోని సహజత్వం, తెరపై సృష్టించిన ఆ మమతా కాంతి ఎప్పటికీ చెరగదు. హిందీ సినిమాకు ఆయన చేసిన సేవ అనిర్వచనీయమైనది. ధర్మేంద్ర కేవలం నటుడు కాదు, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక భావోద్వేగం. ఆయన జీవితమంతా సినిమాకి అంకితం. ఆయన పేరు ఇప్పుడు భారతీయ సినీ చరిత్రలో బంగారు అక్షరాలతో చెక్కబడి నిలిచిపోతుంది.
రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్…9440595494





