మూగబోని జ్ఞాపకం.. ఇనుగుర్తి బడి గంట విజయ నాదం

– దశాబ్దాల ప్రస్థానం.. వేల మందికి దిక్సూచి
– డీఐజీ, ఏసీపీ, జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన నాటి సమయపాలన

ఇనుగుర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: కాలం మారుతోంది, భవనాలు మారుతున్నాయి, కానీ ఇనుగుర్తి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆ ‘బడి గంట’ మాత్రం మారలేదు. కొన్ని దశాబ్దాలుగా వేల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఆ గంటే దిక్సూచిగా నిలిచింది. నేడు ఎన్నో అత్యాధునిక ఎలక్ట్రానిక్ బెల్స్ వచ్చినా, ఈ పాఠశాలలోని పాత ఇనుప గంట శబ్దం వెనుక ఒక గొప్ప చరిత్ర, ఎన్నో భావోద్వేగాలు దాగి ఉన్నాయి. ఆ గంట మోతను విని ఎదిగిన విద్యార్థులు నేడు దేశ రక్షణలో, ఉన్నత హోదాల్లో కొలువై ఉండటం విశేషం. అరిగిపోయినా, తుప్పు పట్టినా ఆ గంట మ్రోగు తూనే ఉంటుంది… కొత్త తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.

క్రమశిక్షణకు అది ఒక గురువు: మాలోత్ రాములు (డీఐజీ), అయ్యగారిపల్లి)
“ఆ బడి గంట మాకు కేవలం సమయాన్ని చెప్పే వస్తువు కాదు, అది మాలో క్రమశిక్షణను నింపిన గురువు. ఉదయం ప్రార్థనకైనా, తరగతుల మార్పుకైనా ఆ గంట మ్రోగగానే ఒక బాధ్యత కలిగేది. నేడు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే, ఆనాడు ఆ బడి గంట నేర్పిన సమయపాలనే పునాది.

ప్రేరణనిచ్చే గాంభీర్యం.. దశాబ్దాల వారసత్వానికి సజీవ సాక్ష్యం

కన్నా వెంకటనారాయణ ఇనుగుర్తి (భారత వాలీబాల్ మాజీ కెప్టెన్)

విద్యార్థులను ప్రయోజకులను చేయడంలో గంట పాత్ర మరువలేనిది. స్కూల్ గంట మోగగానే పుస్తకాలు సర్దుకుని క్లాసులకు పరిగెత్తిన ఆ రోజులు కళ్ళముందే ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా ఆ పాత ఇనుప గంట శబ్దంలో ఉండే గాంభీర్యం, ప్రేరణ మరెక్కడా దొరకదు.

అది విద్యార్థుల విజయ నాదం: కందుకూరి నాగన్న (ఏసీపీ)

మా బాల్య జ్ఞాపకాల్లో ఇనుగుర్తి బడి గంట ఒక చెరగని సంతకం” అని ఏసీపీ కందుకూరి నాగన్న తెలిపారు. ఆ గంట మ్రోత వింటూ చదువుకున్న ఎందరో నేడు ఉన్నత హోదాల్లో దేశానికి సేవ చేస్తున్నారని, ఆ పాత గంటను నేటికీ కాపాడుకోవడం ఊరి విద్యా వారసత్వానికి ఇచ్చే గొప్ప గౌరవమని పేర్కొన్నారు. అది కేవలం ఇనుము కాదు, వేలాదిమంది విద్యార్థుల విజయ నాదమని ఆయన భావోద్వేగంతో చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *