– మహిళా బిల్లు ఆమోదంతో రాజకీయ అధికారం
– మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: పార్లమెంట్‌లో నారీ శక్తి వందనం బిల్లును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ప్రవేశపెట్టనున్నారని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ బిల్లు అమలైతే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ఈనెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ సహా అనేక పార్టీలు మహిళా బిల్లును వ్యతిరేకించాయని తెలిపారు. గతంలో చాలామంది ఈ బిల్లు తేవాలని చూశారని, మోదీ ఈ బిల్లును సుసాధ్యం చేయనున్నారని చెప్పారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తోందని ఉద్ఘాటించారు. చట్టసభల్లో కూడా మహిళలు ఉంటే ఆయా ప్రాంతాలు, రాష్ట్రాల్లో వారికి ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ఎంతో దూరం లేదని, కానీ మహిళా శక్తికి రాజకీయ శక్తి తోడైతే వికసిత్ భారత్ లక్ష్యానికి సులువుగా చేరుకోవచ్చని వివరించారు. ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే క్రెడిట్ బీజేపీకి ఎక్కడ పోతుందోనని ఆలోచించకుండా పార్టీలకతీతంగా అందరూ మద్దతు తెలపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చట్టానికి ఆమోదం తెలిపితే కొత్త శకానికి నాంది పలకనుందని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు అమలైతే స్థానాలు పెరుగుతాయని, డీ లిమిటేషన్ కూడా పూర్తయితే తెలంగాణ నుంచి 9 మంది మహిళలు పార్లమెంట్‌లో అడుగుపెడతారని తెలిపారు. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 180 వరకు పెరుగుతాయని, అంటే 60 మంది మహిళలు అసెంబ్లీలో ఉంటారని వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు కూడా మంచి అవకాశాలు రానున్నాయని వివరించారు. ఇది తాత్కాలికం కాదని.. మూడు టర్మ్‌ల వరకు ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయని వెల్లడించారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





