– డిజిపి ఎదుట లొంగిన ప్రధాన నేతలు
– లొంగిన వారిలో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, జగన్, గంగన్న
– 40 ఏళ్ల అజ్ఞాతానికి వీడ్కోలు పలికిన మావోయిస్టులు
– వారిపై ఉన్న రివార్డును అందిస్తామన్న డిజిపి
– ఇక 11మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: తెలంగాణలో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మంగళవారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. వీరిలో పొలిట్ బ్యూరో సభ్యుడు (పీబీఎం) తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు (సీసీఎం) మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ రంగారం, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్‌సీఎం) నూనె నరసింహా రెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ రన్నా దాదా ఉన్నారు. 40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో పనిచేసిన ఈ అగ్రనేతలు లొంగుబాటు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ నలుగురి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీలో అగ్రస్థాయి బాధ్యతలు నిర్వహించిన ఇద్దరు కీలక నేతలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన ఇంకా 11 మంది అజ్ఞాతంలో ఉన్నారని అన్నారు. వారు కూడా త్వరలో జనజీవనంలోకి రావాలని డీజీపీ కోరారు. ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి అడవుల్లో లేరని, బయట ఎక్కడో షెల్టర్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. తెలంగాణ ప్రభుత్వ పునరావాస పథకం ప్రకారం తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీపై రూ.25 లక్షలు, మల్లారాజి రెడ్డిపై రూ.25 లక్షలు, బడే చొక్కారావు, నూనె నరసింహా రెడ్డిలపై రూ.20 లక్షల చొప్పున నగదు రివార్డు మొత్తాన్ని వారికి అందజేస్తామని ప్రకటించారు. 2019లో తెలంగాణలో మావోయిస్టులు రిక్రూట్‌మెంట్ జరిగిందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 1982లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్‌లో చేరిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ దండకారణ్యంలో ఆయుధ దళ కార్యకలాపాలు నిర్వహించారు. 1984-89 మధ్య సిరోంచా, పెరిమిలి ప్రాంతాల్లో దళ కమాండర్‌గా పనిచేశారు. 1989లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా, 2001లో సెంట్రల్ కమిటీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా, 2017లో సీఎంసీ ఇన్‌ఛార్జ్‌గా, తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడిగా(పీబీఎం) ఎదిగారు. 1970లలో ఉద్యమంలోకి వచ్చిన మల్లారాజి రెడ్డి..1980లలో డివిజనల్ కమిటీ, రాష్ట్ర కమిటీ స్థాయికి ఎదిగారు. 1990లో సీసీఎంగా నియమితులయ్యారు. మహారాష్ట్ర, దండకారణ్య ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2007లో పీబీ సభ్యత్వం, 2010-16 మధ్య ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. 1996లో ఆర్‌ఎస్‌యూ ద్వారా పార్టీలో చేరి 1999-2000లో ఏటూరునాగారం-మహాదేవపూర్ ప్రాంతాల్లో పార్టీ సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ, ఇతర ప్రాంతీయ కమిటీలలో కీలక బాధ్యతలు చేపట్టారు. నూనె నరసింహా రెడ్డి కూడా రాష్ట్ర కమిటీ స్థాయిలో కీలక పాత్ర పోషించారు. మావోయిస్టు అగ్రనేతలు నలుగురు నేడు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి(పొలిట్ బ్యూరో కమిటీ మెంబెర్).. మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్(సెంట్రమ్ కమిటీ మెంబెర్).. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్(తెలంగాణ స్టేట్ సెక్రటరీ).. నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న సన్ను దాదా (స్టేట్ కమిటీ మెంబర్) పోలీసుల ముందు లొంగిపోయారు. పోలీసులు ఈ నలుగురినీ మంగళవారం డియా ముందుకు తీసుకువచ్చారు.
ప్రజాజీవితంలోకి రావాలనే అజ్ఞాతం వీడాం : దేవ్‌జీ, రాజిరెడ్డి వెల్లడి
ఈ సందర్భంగా దేవ్‌జీ మీడియాతో మాట్లాడుతూ ’అనారోగ్య కారణాల రీత్యా నేను లొంగిపోయాను. రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితం గడపాలని భావిస్తున్నాను. దశాబ్దాల కాలం నుంచి నేను నమ్మిన సిద్దాంతాల ప్రకారమే ప్రజల కోసం పనిచేస్తాను. ప్రజల సమస్యలపై ప్రజల్లో ఉండి పోరాటం చేస్తాను. త్వరలో రాజకీయ ప్రవేశం చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని భావిస్తున్నాను. రు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే పరిస్థితిలో లేను. నేను ఏది మాట్లాడినా అపార్థాలకు దారితీసే విధంగా ఉంటుంది. నేను రాజకీయ జీవితం కొనసాగించాలని కోరుకుంటున్నాను. రడిగే ప్రశ్నలకు నేను చెప్పే జవాబు.. రాజకీయ జీవితానికి ఇబ్బంది కలిగించవద్దని అన్ని విషయాలు పంచుకోవడం లేదు’ అని అన్నారు. మల్లా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ’ప్రజలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నాం. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తాం. చట్ట ప్రకారమే పోరాటం చేయాలని లొంగిపోయాం. మావోయిజం అనేది ఎప్పటికీ అంతం కాదు. కొన్ని ప్రశ్నలను ప్రభుత్వంతో చర్చిస్తాం. త్వరలో అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తాం’ అని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





