“దశాబ్దాలు ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన తెలంగాణ అనేక ప్రజా పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు జూన్ 2 వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. హైదరాబాద్ నగరం దేశం లోని వివిధ ప్రాంతాల ప్రజలతో విశ్వనగరంలా ఆవిర్భవించింది. నిజాం నవాబు నుండి విముక్తి పొంది స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన సెప్టెంబర్ 17 వ తేదీని “తెలంగాణ విమోచన దినోత్సవం”గా జరపాలని కొంతమంది,విలీన దినోత్సవంగా జరపాలని మరి కొంతమంది ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. నిజాం పాలనలో కొనసాగి,విముక్తి పొందిన సెప్టెంబర్ 17 వ తేదీని “విమోచన దినం” గా పాటించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ విషయంలో బేధాభిప్రాయాలున్నప్పటికీ గత చరిత్ర కు గురుతుగా సెప్టెంబర్ 17 వ తేదీ కున్న ప్రత్యేక ప్రాధాన్యతను మరచిపోలేం.”
రాజకీయ ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను,రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించకూడదు. వంచించబడినా,హింసించ బడినా, కీర్తింపబడినా ప్రతీ సంఘటనకు సాక్షీభూతంగా చరిత్ర పుటల్లోని ప్రతీ అక్షరం అద్దం పడుతుంది. చరిత్రను వక్రీకరించడం, చరిత్రకు వక్రభాష్యాలు పలకడం భావ్యం కాదు. గత చరిత్రకు ఆనవాళ్ళు ప్రస్తుత చరిత్ర పుస్తకాలు. అలాంటి చరిత్ర పుస్తకాలను నిజాలతో నింపాలి. నిజానిజాలను తెలియచెప్పే నిజమైన చరిత్ర కారులకు, రచయితలకు ఆహ్వానం పలకాలి. గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి.ఎంతో మంది ఉద్యమకారులు ప్రజల కోసం, ప్రజల స్వేచ్ఛకోసం, ప్రజాకంటకుల పీడననుండి విముక్తి కోసం వీరోచితంగా పోరాడారు. అలాంటి పోరాటాలు తెలంగాణలో కూడా జరిగాయి.
అలాంటి ఉద్యమాల ఫలితాలకు సెప్టెంబర్ 17 ఒక చెరగని సాక్ష్యం.రజాకార్ల దమననీతి అంతం- తెలంగాణా విమోచనం.ప్రజలను హింసించి, ఆధిపత్యం చెలాయించానుకోవడం,అడ్డొచ్చిన వారిని అడ్డు తొలగించుకోవడం,భయపెట్టి లొంగదీసుకోవడం,స్త్రీలపై బహిరంగంగా అత్యాచారాలకు పాల్పడడం లాంటి చర్యల ద్వారా ప్రజలను బానిసలుగా మార్చి వారికి నిత్య నరకం చూపించడం వంటి చర్యలు తాలిబాన్ల ఏలుబడిలో జరిగిన,జరుగుతున్న సంఘటనలు. కాని ఇంతకంటే ఘోరమైన అకృత్యాలు శతాబ్ధాల క్రిందట తెలంగాణలో చోటు చేసుకున్నాయి. నైజాం సర్కార్ దాష్టీకాల మధ్య నలిగి పోయి, పోరుబాట పట్టిన తెలంగాణ ప్రజానీకం పోరాట పఠిమ ప్రశంసనీయం.
భారతదేశంలోని ప్రతీ రాష్ట్రం, ప్రతీ ప్రాంతం ఏదో ఒక ప్రత్యేకతతో చరిత్రలో ఉన్నతమైన స్థానం సంపాదించుకుంది. దేశంలోని అన్ని భాషాసంస్కృతులు విశిష్ఠమైనవే.అన్ని ప్రాంతాల సాంస్కృతిక వారసత్వాన్ని, చరిత్రను గుర్తించి గౌరవించడంలోనే మన విజ్ఞత ప్రదర్శించబడుతుంది. గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని, నాటి పోరాటాలను, త్యాగాలను స్మరించుకోవడం మన కనీస బాధ్యత.భారత దేశం సుదీర్ఘ కాలం పరపీడనలో మగ్గి పోయింది.బ్రిటీషు పాలన లోను, సంస్థానాధీశుల ఏలుబడిలోను భారత దేశంలోని ప్రజలు ఎంతగానో నలిగి పోయారు.అయితే అన్నింటికంటే ఎక్కువగా అణచి వేతకు గురైన ప్రాంతం “తెలంగాణ” అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. స్వాతంత్య్రానికి ముందు,స్వాతంత్య్రం తర్వాత కూడా తెలంగాణా ప్రజలు అనేక కష్టానష్టాలకు గురైనారు.
ఎన్నో అరాచకాలు అణచివేతలు,హత్యలు అత్యాచారాల తర్వాత ఎన్నో మహోద్యమాల ఫలితంగా సెప్టెంబర్ 17 వ తేదీన ఎట్టకేలకు తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది.ఎన్నో ఉద్యమాలు నడిపి,తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన తెలంగాణా వీరయోధుల నిరుపమాన త్యాగాల ఫలితమే తెలంగాణా విమోచనం. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నాటి తెలంగాణా ఉద్యమ నేపథ్యాన్ని అవగతం చేసుకోవాలి.పోతన ఘంటం,రుద్రమదేవి శౌర్యం తెలంగాణ నేలను పులకరింప చేసింది. దాశరథి కలం తెలంగాణ స్వరాన్ని ఇనుమడింపచేసింది. సురవరం ప్రతాపరెడ్డి ఉద్యమ స్ఫూర్తి ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనింప చేసింది. కాళోజీ కవిత్వం నిజాం దమననీతిని దునుమాడింది. కొమరం భీమ్ ప్రాణత్యాగం తెలంగాణ గడ్డను పునీతం చేసింది.చాకలి ఐలమ్మ భూమి,భుక్తి పోరాటం జనవాహినిలో చైతన్యం రగిలించింది. షోయబుల్లా ఖాన్ రక్తతర్పణం రజాకార్ల గుండెలను హడలెత్తించింది.
ఎంతో మంది రచయితలు,ఉద్యమకారులు, వివిధ రంగాలకు చెందిన మేథావులు ఒక్కటై నిజాం పాలనలో,రజాకార్ల దమన కాండలో రోదిస్తున్న ప్రజలకు అండగా నిలబడ్డారు. తెలంగాణ గొంతు వినిపించారు. బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి,రావి నారాయణ రెడ్డి,జమలా పురం కేశవరావు,పులిజాల వెంకటరావు,తదితర ప్రముఖులు ఉద్యమాన్ని ఉధృతం చేసారు. హైదరాబాద్ సంస్థానాన్ని ఏలుతున్న అసఫ్ జాహీ పాలకుల్లో చివరివాడైన ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పై అలుపెరుగని పోరాటం చేసారు.ఎన్నో తిరుగుబాట్లు,సాయుధ పోరాటాల ఫలితంగా తెలంగాణ విమోచన జరిగింది. కన్నడ,మరాఠా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 16 జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి. 1947 ఆగష్టు 14 వ తేదీన భారత దేశంలో రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యపు కోటలు బద్దలయ్యాయి. ఆగష్టు 15 వ తేదీన భారతీయుల జీవితాల్లో నిజమైన ఉషః కాంతులు ప్రసరించాయి. హైదరాబాద్ సంస్థానంలో మాత్రం అమావాస్య చీకట్లు తొలగి పోలేదు.నిజాం నవాబు కనుసన్నల్లో ఖాసింరజ్వీ సారథ్యంలో రజాకార్ల అరాచకానికి అమాయక ప్రజల ధన,మాన,ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం సంస్థానంలోని ప్రజలు పరపీడనలో మగ్గి పోయారు.ఎన్నో వీరోచిత పోరాటాలు,ఎన్నో కమ్యూనిస్టు ఉద్యమాలు,సాయుధ పోరాటాలు తెలంగాణ వ్యాప్తంగా జరిగాయి. కాళోజీ నారాయణ రావు,దాశరథి రంగాచార్య, షోయబుల్లాఖాన్,రావి నారాయణ రెడ్డి వంటి వారు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చారు.”ఖాసిం రజ్వీ” నిజాం నవాబుకు లక్షలాది మంది ప్రైవేటు సైన్యంతో సహాయం చేస్తూ,రజాకార్లతో ప్రజలపై అకృత్యాలు సాగించాడు. అరాచక వాదుల మద మణిచే క్రమంలో విప్లవ వీరుడై, నైజాం సర్కారుఫై గర్జించిన కొమరం భీమ్ హతుడయ్యాడు.భారత్‌లో హైదరాబాద్‌ను విలీనం చేయాలంటూ ఉద్యమించిన షోయబుల్లాఖాన్ ను రజాకార్లు అంతమొందించారు. ఒక వైపు ప్రజల ఆర్తనాదాలు, ఒక వైపు రజాకార్ల అరాచకాలు,మరోవైపు నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటాలతో హైదరాబాద్ సంస్థానం అట్టుడికి పోయింది. రజాకార్లకు ఎదురుపడిన ప్రజలను గుర్రాలతో తొక్కించి హతమార్చడం, భర్తల ముందే భార్యలను చెరబట్టడం, భార్యల ముందే భర్తలను పాశవికంగా హత్య చేయడం, పసి పిల్లలను సైతం పైకెగరేసి, నేలపై నిలబెట్టిన కత్తితో చంపడం, గ్రామీణ ప్రాంతాలపై పడి దోచుకోవడం, పైశాచికంగా జనాన్ని హింసించి,చంపడం నిజాం కాలంలో కొనసాగిన అకృత్యాలకు పరాకాష్ఠ.
నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో విలీనం చేయడానికి సంకల్పించడంతో అప్పటి భారత ప్రభుత్వం సర్ధార్ పటేల్ నాయకత్వంలో “ఆపరేషన్ పోలో” పేరుతో సైనిక చర్య తీసుకుని, 1948 లో హైదరాబాద్ ను భారత దేశంలో విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల వలన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగింది. దశాబ్దాలు ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన తెలంగాణ అనేక ప్రజా పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు జూన్ 2 వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. హైదరాబాద్ నగరం దేశం లోని వివిధ ప్రాంతాల ప్రజలతో విశ్వనగరంలా ఆవిర్భవించింది. నిజాం నవాబు నుండి విముక్తి పొంది స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన సెప్టెంబర్ 17 వ తేదీని “తెలంగాణ విమోచన దినోత్సవం”గా జరపాలని కొంతమంది, విలీన దినోత్సవంగా జరపాలని మరి కొంతమంది ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. నిజాం పాలనలో కొనసాగి,విముక్తి పొందిన సెప్టెంబర్ 17 వ తేదీని “విమోచన దినం” గా పాటించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ విషయంలో బేధాభి ప్రాయాలున్నప్పటికీ గత చరిత్ర కు గురుతుగా సెప్టెంబర్ 17 వ తేదీ కున్న ప్రత్యేక ప్రాధాన్యతను మరచిపోలేం. అప్పటి కేంద్ర హోం మంత్రి సర్ధార్ పటేల్ తెలంగాణ విమోచనలో కీలక పాత్ర వహించిన విషయం మరువరాదు.తెలంగాణ ప్రజలకు నిజాం నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17 వ తేదీని ఒక చారిత్రక సంఘటనకు నిదర్శనంగా భావించి,తెలంగాణ ఉద్యమ వీరుల త్యాగాలను, ఉక్కు మనిషి పటేల్ ధీరత్వాన్ని స్మరించుకోవాలి.





