“భారత దేశ వాణిజ్య అంశాలు వాషింగ్టన్ లో నిర్ణయాలు జరుగుతున్నాయి. ఎవరి దగ్గర చమురు కొనాలి, ఎవరి దెగ్గర కొనకూడదు అని అమెరికా నిర్ణయించే దౌర్భాగ్య స్థితికి నెట్టివేయబడ్డాము. మొదట్లో భారత్ ఇరాన్ నుండి చమురు కొనే సమయంలో ఇరాన్ పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇరాన్ నుండి కొనటం నిలిపివేసింది భారత్. ఆ తరువాత తక్కువ ధరకే చమురు లభిస్తుందని మన దేశానికి దూరంగా ఉన్న వెనేజువల దెగ్గర నుండి కొనటం కూడా నచ్చని అమెరికా ఆ దేశం పై కూడా ఆంక్షలు విధించటం వలన అక్కడి నుండి కొనుగోళ్ళు మానేసాము. అటు పిమ్మట రష్యా నుండి కొనుగోళ్ళు చేస్తామంటే ఆ దేశం నుండి మాత్రం కొనద్దు కావాలంటే వెనేజువలా నుండి కొనుక్కోండి అని నిర్దేశిస్తుంది అమెరికా.”

తెలంగాణ విద్యావంతుల వేదిక
9493212313
గత కొంత కాలంగా భారత్ అమెరికా దేశాల మధ్య కుదరాల్సిన వాణిజ్య ఒప్పందం ఆశ్చర్యకరంగా రాత్రికి రాత్రి కుదిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఒక ఫోన్ సంభాషణ అనంతరం ఈ వాణిజ్య ఒప్పందం కుదిరిందని స్వయంగా ట్రంప్ తన సోషల్ మీడియా ఎకౌంటు లో ప్రకటించాడు. ఆ తరువాత కొద్ది సమయంలోనే భారత ప్రధాని మోదీ తన ఎక్స్ హేండిల్ ద్వారా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటి వరకు అమెరికా భారత్ పై విధించిన 50% సుంకం నుండి 18% కు తగ్గిస్తున్నామని దానికి బదులుగా భారత్ అమెరికా నుండి 500 బిలియన్ డాలర్ల ఇంధన సాంకేతిక, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులు మరియు మరిన్ని వస్తువుల కొనుగోలు చేస్తుందని స్పష్టం చేసారు. అయితే అమెరికా నుండి దిగుమతి చేసుకునే వస్తువుల పైన అసలెటువంటి సుంకం ఉండదని కూడా తెలిపారు.
అత్యంత సున్నితమైన వ్యవసాయ రంగం లో అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకొనుటకు మార్గం సుగమం చేసే ఈ ఒప్పందం వలన దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడానికి సిద్ధపడిందా మోదీ ప్రభుత్వం? సార్వభౌమ దేశమైన భారత్, రష్యా నుండి చమురు కొనకూడదని నిర్దేశిస్తున్నాడు నియంత ట్రంప్. దానికి “జీ హుజూర్” అని ట్రంప్ దెగ్గర మోకరిల్లి సాగిలపడుతుంది భారత్. ఈ 50% నుండి 18% శాతం సుంకాలు తగ్గిన అంశాన్నిమోదీ ప్రభుత్వం గొప్ప విజయంగా భావిస్తూ విజయోత్సవాలు జరుపుకుంటుంది. బి జే పి పార్టీ కార్యాలయంలో మోదీ కి లభించిన స్వాగత సత్కారాలు చూస్తే ఏదో యుద్ధంలో విజయం సాధించిన వీరుడికి లభించేదిగా అనిపించక మానదు. ప్రభుత్వంతో పాటు, గోది మీడియా, ఐటి సెల్ మరియు యావత్ భజనామండలి మోదీ గారిని ఆకాశానికి ఎత్తటం మొదలుపెట్టాయి. సామాజిక మాద్యమాలలో, పత్రికలలో యదావిధిగా మోదీ పై, బిజేపి ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ గొప్ప విజయానికి కారణమైన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారి లేజర్ కళ్ళు, ప్రధాని మోదీ గారి విశ్వగురు విశ్వరూపం వార్తా చానెళ్ళు మరియు పత్రికలలో ఇంకొన్ని రోజులు మనకు దర్శనమివ్వక మానవు.
నిజానికి దేశానికి కనబడనిది, ప్రజలకు తెలియనటువంటిది, చర్చకు రానటువంటిది ఈ వాణిజ్య ఒప్పందం లో నిక్షిప్తమైన అసలు వాస్తవాలు, ఒప్పందం అమలయ్యే నియమ నిబంధనలు మరియు విధి విధానాలు. ఈ ఒప్పంద నేపధ్యంలో మనకు వినబడేది బాజా బజంత్రీల మోతనే కాని అసలు అంశాలు అన్నీ గప్ చుప్. అసలు ఇది స్వేచ్చా వాణిజ్య ఒప్పందమా, ప్రాధాన్యతా అంశాల వాణిజ్య ఒప్పందమా లేదా ఒక సమగ్ర ఒప్పందమా అనేది ఎవ్వరికీ తెలియదు. ఈ ఒప్పందం పై ఎవరు సంతకాలు చేసారో ఎవ్వరికీ తెలియదు. ఇరు పక్షాల నుండి ట్వీట్ ట్వీట్ తప్ప మరేమీ వినపడట్లేదు. అసలు సుంకాల తగ్గింపు తప్పితే మిగతా అంశాల పైన ఎటువంటి ఒప్పందం, అంగీకారం కుదిరిందో ఎవ్వరికీ తెలియదు. అమెరికా లో భారత దేశం పై విజయం సాధించామని, అమెరికన్ ఉత్పత్తుల కొరకు భారత మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయని ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రభుత్వం ఈ ప్రకటనలను కనీసం ఖండించటం లేదు. ఈ ఒప్పందం ద్వారా ఎవరికీ ఏమేమి ఎంతెంత లాభం చేకూరుతుందో స్పష్టత లేదు. ఈ ఒప్పందం చేసుకోవటం ద్వారా ప్రపంచానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాం? అమెరికా సెనెటర్ లిండ్సీ గ్రహం అయితే ఒక అడుగు ముందుకేసి ట్రంప్ భారత దేశాన్ని దారికి తెచ్చినట్టు, ప్రపంచం లోని ఇతర దేశాలు ఇది హెచ్చరికగా తీసుకోవాలని సూచించాడు. రష్యా తో అన్ని వాణిజ్య కార్యకలాపాలను మానుకోవాలని, లేదా భారత్ కి పట్టిన గతే పడుతుందని విచ్చలవిడిగా ప్రకటించాడు.
భారత్, అమెరికా ల మధ్య కుదిరిన ఒప్పందం చారిత్రాత్మకం అని ప్రభుత్వం అంటుంటే విపక్షాలేమో అమెరికా లో అదాని పై ఉన్న నేరారోపణ, సంచలనాత్మక సెక్స్ స్కాండల్ ఎప్స్టిన్ ఫైల్స్ వల్ల భారత ప్రభుత్వం అమెరికా ముందు సాగిలపడింది అని ఆరోపిస్తున్నాయి. మేక్ ఇండియా గ్రేట్ అగైన్ కాక మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కార్యక్రమంలో మోదీ మునిగిపోయాడని చలోక్తులు విసురుతున్నారు.
ఈ గందరగోళ పరిస్థితుల నేపధ్యంలో కొన్ని కొన్ని ప్రధాన ప్రశ్నలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉన్నది. ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా మనం అమెరికాకు సంపూర్ణంగా లొంగిపోతున్నామా? మనం ఏ దేశం నుండి చమురు కొనాలో అమెరికా నిర్ణయిస్తుందా? మన రైతుల నడ్డి విరగనుందా? వ్యవసాయ రంగం లో విదేశీ పెట్టుబడులు, వాణిజ్యం గురుంచి ఎందుకు చొప్పిస్తున్నారు? 18% సుంకం అనేది వాస్తవమేనా లేదా దానిలో కూడా ఏమైనా లోపాయకార ఒప్పందాలు ఉన్నాయా? ఇది భారత్ అమెరికా మధ్య జరిగిన ఒక ఒప్పందమా? లేక బ్లాక్ మెయిల్ ఆ? సమ ఉజ్జీల మధ్య సమాంతరంగా ఇద్దరికీ ప్రయోజనం కలిగేలా చేసుకుంటే ఒప్పందం అవుతుంది.
ఒక వ్యక్తి షరతులు విధిస్తే మరొక వ్యక్తి వాటిని కిమ్మనకుండా అంగీకరిస్తే దాన్ని ఒప్పందం అనరు. బ్లాక్ మెయిల్ అంటారు. రష్యా నుండి చమురు కొనను అని మోదీ ఒప్పుకున్నాడని ట్రంప్ తన సందేశం మొదట్లోనే ప్రకటించాడు. భారత్ ఇప్పుడు అమెరికా మరియు వెనెజువల నుండి చమురు కొంటుంది అని నొక్కి వక్కానించారు . మొదటినుండి రష్యా నుండి చమురు కొనద్దని అమెరికా ఒత్తిడి చేస్తుంది. ఆ ఒత్తిడి లో భాగంగానే అప్పటికే విధింఛిన 25% సుంకానికి మరో 25% కలిపి మొత్తం సుంకాన్ని 50% చేసింది. ఈ సుంకాలకు తలొగ్గి రష్యా నుండి తక్కువ ధరకు కొంటున్న చమురును గత ఏడాది నవంబర్ నెల నుండే కోత పెట్టటం ప్రారంబించింది భారత్. ఆ సమయానికి రష్యా నుండి 40% చమురు దిగుమతి చేసుకున్న సందర్భం ఉన్నది.
నవంబర్ నుండే రాబోయే పది ఏండ్ల వరకు సహజ వాయువు ని అమెరికా నుండి కొంటామని ఒక చారిత్రక ఒప్పందం చేసుకుంది మన దేశం. ఈ విధంగా భారత దేశ వాణిజ్య అంశాలు వాషింగ్టన్ లో నిర్ణయాలు జరుగుతున్నాయి. ఎవరి దగ్గర చమురు కొనాలి, ఎవరి దెగ్గర కొనకూడదు అని అమెరికా నిర్ణయించే దౌర్భాగ్య స్థితికి నెట్టివేయబడ్డాము. మొదట్లో భారత్ ఇరాన్ నుండి చమురు కొనే సమయంలో ఇరాన్ పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇరాన్ నుండి కొనటం నిలిపివేసింది భారత్. ఆ తరువాత తక్కువ ధరకే చమురు లభిస్తుందని మన దేశానికి దూరంగా ఉన్న వెనేజువల దెగ్గర నుండి కొనటం కూడా నచ్చని అమెరికా ఆ దేశం పై కూడా ఆంక్షలు విధించటం వలన అక్కడి నుండి కొనుగోళ్ళు మానేసాము. అటు పిమ్మట రష్యా నుండి కొనుగోళ్ళు చేస్తామంటే ఆ దేశం నుండి మాత్రం కొనద్దు కావాలంటే వెనేజువలా నుండి కొనుక్కోండి అని నిర్దేశిస్తుంది అమెరికా.
ఇప్పుడు జరిగిన వాణిజ్య ఒప్పందం ద్వారా ఒక విషయమైతే స్పష్టమవుతుంది. అమెరికా మనల్ని తోలుబొమ్మను చేసి ఆడిస్తున్నది. చమురు వ్యాపార అంశంతో పాటు మరేవో విషయాలను పరిగణ లోకి తీసుకొని అమెరికా భారత్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నదా? ఆ అంశాలు ఏమై ఉంటాయి? అసహ్యమైన, జుగుప్సాకర సెక్స్ స్కాండల్ ఎప్స్టిన్ ఫైల్స్ లో మన దేశ పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు వినబడుతున్నది. ఎప్స్తీన్ కు భారత ప్రధాని మోదీ తో నెట్వర్కింగ్ జరిగిందని అంతర్జాలంలో వస్తున్న వార్తలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజం కావని విదేశాంగ శాఖ ఖండించినా నిప్పు లేనిదే పొగ రాదు కదా అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వార్తల నేపధ్యంలోనే ఈ వాణిజ్య ఒప్పంద ప్రకటన రావటం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ కి ఆత్మీయ మిత్రుడు, వ్యాపార దిగ్గజం గౌతం అదాని పై అమెరికా లో జరుగుతున్న అవినీతి కేసు అంశం కూడా తెర మీదికి వస్తున్నది. అమెరికా కోర్టు కేసు విషయంలో సమన్లు అందుకున్నాని, కేవలం 90 రోజులలో జవాబు ఇవ్వాలనే ఆంక్ష కూడా ఉందని స్వయంగా అదాని ప్రకటించటాడు. ఇది జరిగిన కేవలం మూడు రోజులలోనే ఈ ఒప్పందం కుదరటం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ఇవేవి సరైన కారణాలు కావని, కేవలం కాల్పనికాలని తోసిపుచ్చవచ్చును. వాస్తవంగా ఇవన్నీ కూడా యాదృచ్చికంగానే జరిగిఉండవచ్చు గాక. అమెరికా భారత్ ను బ్లాక్ మెయిల్ కూడా చేయట్లేదు అని అనుకుందాం. మరి ఎందుకు ఈ దాగుడు మూతలు? వాస్తవాలు ఏమిటి? అమెరికా భారత దేశ దిగుమతుల పై 50% నుండి 18% తగ్గించినాము అని అంటున్నారు. మంచిది.
మరి భారత్ చేసుకునే అమెరికా ఉత్పత్తులపై సున్నా శాతం దిగుమతి సుంకం ఎంతవరకు సబబు? అమెరికా మన వస్తువులపై 18% సుంకం విధించినప్పుడు మనం కూడా అమెరికా వస్తువుల పై కూడా 18% సుంకం ఉండటం సహేతుకం కదా? లేదా మనం సుంకం పూర్తిగా ఎత్తివేసినం కాబట్టి అమెరికా కూడా అదే చేయాలి కదా? నిజానికి 18 శాతానికి సుంకాలను తగ్గించిన దానికి మనం మురిసిపోయి సంబరాలు చేసుకుంటున్నాము కాని ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందర అమెరికా భారత్ పై విధించిన సుంకం కేవలం రెండు లేదా మూడు శాతం మాత్రమే. ఒకవేళ అమెరికా మునపటి 2 లేదా 3 శాతానికి సుంకాలు తగ్గించి ఉంటే మోదీ పై కురిసే ప్రశంసలకు అర్థం ఉండేది.
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని ప్రభుత్వం చారిత్రాత్మక విజయంగా ప్రచారం చేస్తుంటే, వాస్తవం మాత్రం భిన్నంగా కనిపిస్తుంది. అమెరికా ఉత్పత్తులపై సున్నా శాతం సుంకం విధించి, 500 బిలియన్ డాలర్ల కొనుగోళ్లకు అంగీకరించి, రష్యా నుండి చమురు కొనుగోళ్లు నిలిపివేసి, వ్యవసాయ రంగానికి అమెరికా ఉత్పత్తుల ద్వారం తెరిచి – భారత్ నిజానికి లొంగిపోయిందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఒప్పందం పూర్తి వివరాలు బయటపెట్టకపోవటం, పార్లమెంటులో చర్చకు తీసుకురాకపోవటం, ఎప్స్టిన్ ఫైల్స్ మరియు అదాని కేసుల నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరటం – ఇవన్నీ తీవ్ర అనుమానాలను కలిగిస్తున్నాయి. స్వతంత్ర విదేశాంగ విధానం, ఆర్థిక స్వయం సమృద్ధత అనే భారత్ సిద్ధాంతాలకు ఈ ఒప్పందం పెద్ద దెబ్బ. భారత జాతీయ ప్రయోజనాల కంటే రాజకీయ ఒత్తిడులకు లొంగి తీసుకున్న నిర్ణయమే ఈ “చారిత్రాత్మక ఒప్పందం” అనే అనుమానం బలపడుతుంది.





