ఉస్మానియా వర్సిటీకి మహర్దశ

– వెయ్యి కోట్లు విడుదలకు సీఎం రేవంత్‌ అం‌గీకారం
– వెంటనే విడుదలకు విద్యా శాఖ ఉత్తర్వులు
– అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధికి  కంకణం
– తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియాదే కీలకం
– గుండెనిండా ప్రేమతో ఇక్కడికి వొచ్చా
– చదువు రాకున్నా.. చదువు విలువ తెలిసినోడిని
– ఉస్మానియా సభలో సీఎం రేవంత్‌ ‌భావోద్వేగ ప్రసంగం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే సంకల్పంతో వచ్చానని సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు ఉస్మానియానే కేంద్రమని అన్నారు. ఆధిపత్యానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు వచ్చాయి. నిజాం, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది. సామాన్యులైన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య దొరలపై పోరాడారు. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగలేదని తెలంగాణ ఉద్యమం వొచ్చింది. ఉద్యమాన్ని ఉస్మానియా నుంచే విద్యార్థులు ప్రారంభించారు. గతంలో ఈ వేదిక నుంచే స్వరాష్ట్ర ఆకాంక్షను విద్యార్థులు బలంగా వినిపించారు. పోరాడి సాధించిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా లేదా అని ఇక్కడే తెలుసుకోవాలని అనుకున్నానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఉస్మానియా వర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఓయూకు రూ.1000 కోట్ల నిధులను  విడుదల చేశారు. ఈ నిధులను విద్యార్థులకు అంకితం చేశారు. అలాగే ఓయూ అభివృద్ధికి రూ.45 లక్షల చెక్కును పూర్వ విద్యార్థులు అందజేశారు. అనంతరం ఆర్ట్స్‌ ‌కాలేజీ భవనం దగ్గర ’సర్వం సిద్ధం’ పేరుతో నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు. స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా ఉస్మానియా యూనివర్సిటీ వినిపించిందని తెలిపారు. భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించడానికి ఓయూకు వొచ్చానని వివరించారు. గతంలో ముఖ్యమంత్రులను అడ్డుకున్న చరిత్ర ఉందని ప్రస్తావించారు. మీరు ఎందుకు ఓయూకు వెళ్లే ధైర్యం చేస్తున్నారని కొంతమంది తనతో అన్నారని గుర్తుచేశారు.మీరిచ్చే సూచనలు, మేధావులు ఇచ్చే సలహాలతో ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉండాలనే ఒకే ఆలోచనతో ఇక్కడకు వచ్చానని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ధైర్యంతో కాదని.. విద్యార్థుల గుండెల నిండా ఉన్న అభిమానంతో ఆర్టస్ ‌కాలేజీ వద్దకు వచ్చానని వ్యాఖ్యానించారు. తమ ప్రసంగాలు చదువుకొని కాదని.. తన మనసులో ఉన్నది చెప్పాలని ఇక్కడకు వచ్చానని చెప్పుకొచ్చారు. పురాతన యూనివర్సిటీలో ఉస్మానియా ఒకటని వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీకి గొప్ప చరిత్ర ఉందని అభివర్ణించారు. ఇక్కడకు రావాలంటే ధైర్యం కాదని.. అభిమానం కావాలని చెప్పుకొచ్చారు. తెలంగాణలో చదువు లేకున్నా ఆధిపత్యాన్ని సహించరని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఒక చైతన్యం, పౌరుషం ఉంది. ఎందరో ఓయూ విద్యార్థులు రాష్ట్రం కోసం ఆయుధాలతో అడవిబాట పట్టారు. గద్దర్‌, ‌జార్జిరెడ్డి, పీవీ నరసింహారావు వంటి ఎంతోమంది ప్రముఖులను ఈ యూనివర్సిటీ ఇచ్చింది. బడికి వెళ్లని ఓ పేదింటి బిడ్డ అందెశ్రీ.. జయజయహే తెలంగాణ నినాదాన్ని అందించారు. సమాజానికి ఏ సమస్య వచ్చినా ఈ యూనివర్సిటీ విద్యార్థులు కదం తొక్కారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఎవరి ఆస్తిలో వాటా అడగలేదు.. కేవలం స్వేచ్ఛ, సమాన అవకాశాలు మాత్రమే అడిగారు. మీరు ఎదిగేందుకు ఈ ప్రభుత్వం స్వేచ్ఛను ఇస్తుంది. ప్రపంచానికే మీరు దిక్సూచిగా మారాలి. ఎవరి గురించీ రాజకీయ వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదు. కొందరు రెండేళ్లుగా మాట్లాడుతున్నారు. నేను గుంటూరులో చదువుకోలేదు.. గూడుపుఠాణీలు చేయలేను. గుంటూరులో చదువుకున్న వాళ్లు బెంజ్‌ ‌కారులో వెళ్లి పేదరికం గురించి తెలుసుకుంటారు. గుంటూరు, పుణె, అమెరికాలో చదువుకున్నాం అని ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా ఏం చెప్పాలని అనుకుంటున్నారు? నాకు భాష సరిగా రాకపోవచ్చు.. కానీ పేదవాడిని అర్థం చేసుకునే భాష వొచ్చు. పేదవాడి బిడ్డ చదువుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో నాకు తెలుసు. పేదలు, నిస్సహాయులకు అండగా ఉండేలా చర్యలు చేపడుతున్నాం. నేను ఫాంహౌస్‌లు కట్టించుకోలేదు.. సాధారణంగానే ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా,  సోదరుడిగా ఈ ఆర్టస్ ‌కాలేజీ ముందు నిలుచున్నా. చరిత్రలో సజీవంగా నిలబడే కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నా. జయజయహే తెలంగాణ గీతం, తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్నాం. వర్గీకరణ ద్వారా దళితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. జనగణనలో కులగణన చేపట్టి వందేళ్ల సమస్యను పరిష్కరించాం. ప్రభుత్వం దగ్గర పంచేందుకు డబ్బు లేదు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు.. గత పదేళ్లలో ఎవరికైనా ఇచ్చారా? భూములు ఉన్న ఆసాములు కూడా వెనుకబాటుతనంతో బాధపడు తున్నారు. దాన్ని నిర్మూలించాలంటే ప్రతి గ్రామంలో విద్యావకాశాలు పెంచాలి. నాణ్యమైన విద్య, స్కిల్స్‌ను అందించేందుకు కృషి చేస్తున్నాం. విద్య ఒక్కటే మన ఆత్మగౌరవాన్ని పెంచుతుందన్నారు.
విద్యాలయాల్లో కుల వివక్ష ఉండకూడదనే యంగ్‌ ఇం‌డియా స్కూల్స్‌లో అందరూ కలిసి చదువుకునేలా చర్యలు చేపట్టాం. డబ్బు ఉన్నవాళ్లు ఎక్కడికి వెళ్లి అయినా చదువుకోగలరు. పేదింటి విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ నాణ్యమైన విద్యను అందించాలి. మంజూరు చేసిన రూ.1000 కోట్లు డబ్బుగా కాదు.. భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా చూస్తున్నాం. ఉత్తుత్తి మాటలు చెప్పను.. మన చేనుకి చీడ పడితే ఏ మందు కొట్టాలో నాకు తెలుసు. నాకు ఇంగ్లీష్‌ ‌రాదని వాళ్లు అనుకుంటున్నారు. చైనాకు కూడా ఆ భాష రాదు.. కానీ ఆ దేశం ప్రొడక్షన్‌ ‌నిలిపివేస్తే అమెరికా కూడా విలవిలలాడుతుంది. భాష కేవలం కమ్యూనికేషన్‌ ‌కోసం మాత్రమే.. అది నాలెడ్జ్ ‌కాదు. రాష్ట్రానికి ఓయూ గుండెకాయ లాంటిది. సమస్యల మీద కొట్లాడతానంటే నేను వద్దనను. రాజకీయ పార్టీల మోచేతి నీళ్లు తాగాలని, వాళ్ల జెండాలు మోయాలని అనుకోవద్దు. స్వతంత్రతను నిలబెట్టుకోండని రేవంత్‌ అన్నారు. ఉస్మానియా వర్సిటీకి ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.వెయ్యికోట్ల నిధుల విడుదల జీవోను విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *