యువతి ప్రాణం తీసిన తప్పటడుగు

“యువతకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి భయం వచ్చినప్పుడు మీరు ఒంటరిగా లేరు. ఆ క్షణంలో నిర్ణయం తీసుకోవద్దు. సహాయం అడగడం బలహీనత కాదు. తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి మీ పిల్లలు నిజం చెప్పడానికి భయపడుతున్నారంటే, అక్కడే ప్రమాదం మొదలవుతుంది. వినే మనసు, భరోసా ఇచ్చే మాట ఒక ప్రాణాన్ని కాపాడగలదు. సైకాలజీ చెబుతుంది ప్రేమ, భావోద్వేగాలు సహజం. వాటిని నేరంగా ముద్ర వేయడమే సరి కాదు. ఒక మంచి సంభాషణ ఒక ప్రాణాన్ని కాపాడగలదు. ఒక మౌనం ఒక ప్రాణాన్ని తీసేయగలదు. అందులో నుండి ఎంచుకోవాల్సింది మనమే..”

– డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి
జాతీయ అధ్యక్షుడు –
( ARPPI), 9703935321

సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద చోటు చేసుకున్న యువతి మృతి చెందిన ఘటన ఒక వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు. ఇది నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, భయం, సమస్యలెదురైనపుడు నిర్ణయం తీసుకోవడంలో కలిగే లోపంలను ప్రతిబింబించే అద్దంలాంటి యధార్థ సంఘటన.

ఒక క్షణం ప్రేమ… మరో క్షణం భయం… అంతలోనే జీవితం ముగింపు.

హైదరాబాద్ పాతబస్తీ కోమటివాడకు చెందిన యువతి (20), చార్మినార్ ప్రాంతానికి చెందిన యువకుని తో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమలో ఉన్న ఇద్దరూ భవిష్యత్తు కలలు కంటున్న సమయంలోనే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

ఖాలీ  ఫ్లాట్‌లో గడిపిన క్షణాలు… అనుకోని తండ్రి రాక… అంతా ఒక్కసారిగా మారిపోయింది.

తండ్రి ఎదురుపడితే ఏమవుతుందన్న భయం, పరువు పోతుందన్న ఆందోళన, ఆ క్షణంలో సరైన ఆలోచన చేయలేని మానసిక స్థితి… ఇవన్నీ కలిసి యువతిని ఒక తప్పటడుగు వైపు నెట్టాయి. బాల్కనీ ద్వారా తప్పించుకునే ప్రయత్నం చివరకు ఆమె ప్రాణాలకే ముప్పుగా మారింది. ఈ సంఘటనను కేవలం అప్రమత్తత లోపం గా లేదా తప్పుడు నిర్ణయం గా చెప్పేసి ముందుకు వెళ్లిపోవడం మన బాధ్యతారాహిత్యం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అసలు ప్రశ్న, యువత ఎందుకు అంతగా భయపడుతోంది? ఎందుకు ఒక క్షణంలో ప్రాణాలకంటే పరువే పెద్దదిగా కనిపిస్తోంది?

 అతి భయం తోనే చావు

ఈ ఘటన వెనుక పని చేసిన ప్రధాన అంశం అతి భయం. అతిగా భయం కలిగినపుడు  మనిషి మెదడులోని ఆలోచన, తర్కానికి బాధ్యమైన భాగం తాత్కాలికంగా పనిచేయడం తగ్గిపోతుంది. ఆ సమయంలో మనిషి పరిణామాలను అంచనా వేయలేడు, ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించలేడు, ప్రమాద స్థాయిని అర్థం చేసుకోలేడు, దీనినే సైకాలజీలో టన్నెల్ విజన్ అంటారు. అంటే ఒకే దారిలోనే ఆలోచన చేస్తూ ఉండడం. ఆ యువతి ఆ క్షణంలో ఆలోచించింది ఒక్కటే ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. కానీ ఎలా? అన్న ప్రశ్నకు మెదడు సరైన సమాధానం ఇవ్వలేకపోయింది.

 పరువు భయం – యువతను చంపుతున్న మౌన హింస

మన సమాజంలో ప్రేమ తప్పు కాదు అని మాటల్లో చెబుతాం. కానీ ఆ ప్రేమ బయటపడితే వచ్చే పరిణామాల భయం యువతను లోపల నుంచే చంపేస్తోంది. తల్లిదండ్రుల భయం,  సమాజపు చూపు, బంధువుల మాటలు ఏమంటారో? అన్న ఆలోచన….. ఇవన్నీ కలిసి యువత మనసులో ఒక ఇన్ విజిబుల్ ప్రెస్సర్ కుక్కర్ ను తయారు చేస్తాయి. ఈ ఒత్తిడి ఒక్కసారిగా పేలినప్పుడు, ఆ పేలుడు ఫలితంతోనే ఇలాంటి విషాదాంతాలు.

 ఇది ప్రేమ కథ కాదు… ఇది కమ్యూనికేషన్ వైఫల్యం

ఈ ఘటనను “విషాద ప్రేమ కథ”గా మాత్రమే చూడటం ప్రమాదకరం. ఇది అసలు ఒక మానసిక, సామాజిక వైఫల్యం. యువత తమ భావాలను భయంలేకుండా చెప్పుకోలేకపోవడం, తల్లిదండ్రులు వినే వాతావరణం లేకపోవడం, ప్రేమను నేరంగా ముద్ర వేసే ఆలోచనలు, భావోద్వేగ విద్య అవగాహన లేకపోవడం, ఇవన్నీ కలిసే ఇలాంటి సంఘటనలకు దారి తీస్తున్నాయి.

 మన సమాజం ఆలోచించాల్సిన ప్రశ్నలు

ఈ ఘటన తర్వాత మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవి ఒక యువతి తండ్రిని ఎదుర్కోవడానికంటే చావునే ఎందుకు ఎంచుకుంది?, ప్రేమను అంగీకరించలేని భయ వాతావరణం ఎవరు సృష్టించారు? మన ఇళ్లలో పిల్లలు భయపడకుండా మాట్లాడగలుగుతున్నారా?, ఇవన్నీ ఆలోచించకపోతే, ఈ ఘటన చివరిది కాదన్నది చేదు నిజం.

 నివారణ మార్గం ఎక్కడుంది?

తల్లిదండ్రులు భయంతో కాదు, భరోసాతో మాట్లాడే సంస్కృతి, పాఠశాల స్థాయి నుంచే భావోద్వేగ నైపుణ్యాలు నేర్పించడం, ప్రేమ, సంబంధాలపై సరైన అవగాహన కలిపించడం, యువతకు కౌన్సెలింగ్ సేవలు సులభంగా అందుబాటులో ఉండటం, ఇవి లేకుండా కేవలం చట్టాలు, హెచ్చరికలు మాత్రమే ఉంటే సరిపోవు అన్నది అక్షరాల సత్యం.

 పరువు భయంతో చనిపోయిన యువతి…

యువతి మృతి ఒక ప్రమాదం కాదు ఇది భయంతో నడిచే సమాజానికి అద్దం. తండ్రిని ఎదుర్కోవడానికంటే చావునే సులభంగా అనిపించిన మనస్తత్వం ఎలా ఏర్పడింది? ప్రేమను అంగీకరించలేని వాతావరణం ఎవరు సృష్టించారు? తీవ్ర భయం మనిషిని ఆలోచించనివ్వదు. ఆ క్షణంలో సరైన దారి కనిపించదు. అందుకే ఒక యువతి ప్రాణాలనే మూల్యంగా చెల్లించింది. ఇది ప్రేమ కథ కాదు. ఇది కమ్యూనికేషన్ వైఫల్యం. భయం కాదు భరోసా కావాలి. శిక్ష కాదు సంభాషణ కావాలి. లేకపోతే… ఇలాంటి వార్తలు మళ్లీ మళ్లీ చదవాల్సి వస్తుంది.

 ప్రాణం కన్నా పరువు పెద్దది………

యువతి మృతి ఒక ప్రమాదం మాత్రమే కాదు. ఇది మన సమాజానికి ఒక హెచ్చరిక. ప్రాణం కన్నా పరువు పెద్దదిగా అనిపించే పరిస్థితులు మనమే సృష్టించుకుంటే, ఇలాంటి విషాదాలు మళ్లీ మళ్లీ మనల్ని వెంబడిస్తాయి. ఒక యువతి చేసిన తప్పటడుగు వెనుక మనందరి మౌనం కూడా కొంత కారణమే.

 భయం ఎక్కువైతే మనసు ఆలోచించదు

యువతకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి భయం వచ్చినప్పుడు మీరు ఒంటరిగా లేరు. ఆ క్షణంలో నిర్ణయం తీసుకోవద్దు. సహాయం అడగడం బలహీనత కాదు. తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి మీ పిల్లలు నిజం చెప్పడానికి భయపడుతున్నారంటే, అక్కడే ప్రమాదం మొదలవుతుంది. వినే మనసు, భరోసా ఇచ్చే మాట ఒక ప్రాణాన్ని కాపాడగలదు. సైకాలజీ చెబుతుంది ప్రేమ, భావోద్వేగాలు సహజం. వాటిని నేరంగా ముద్ర వేయడమే సరి కాదు. ఒక మంచి సంభాషణ ఒక ప్రాణాన్ని కాపాడగలదు. ఒక మౌనం ఒక ప్రాణాన్ని తీసేయగలదు. అందులో నుండి ఎంచుకోవాల్సింది మనమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page