ఎస్సీ హాస్టల్లో రాత్రి నిద్ర చేసిన కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
భువనగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 31 : విద్యార్థులకు అందించే భోజన విషయంలో రుచి, శుచిశుభ్రత పాటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. నారాయణపుర్ మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్( ప్రీమెట్రిక్ )విద్యార్థులతో కలిసి కలెక్టర్ సోమవారం రాత్రి నిద్ర చేశారు. సాయంత్రం హాస్టల్ కు చేరుకున్న జిల్లా కలెక్టర్..విద్యార్థులను పలకరించి వారికి అందిస్తున్న భోజనం, రోజువారీ దినచర్య గురించి కలెక్టర్ ఆరా తీశారు. హాస్టల్ పరిసరాలను, వంటశాలను పరిశీలించారు. వంట తయారు చేసే విధానాన్ని కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. రోజువారీ మెనూ చార్ట్ పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి, స్టోర్ రూంలో సరుకులు గుడ్లు, కూరగాయలను కలెక్టర్ తనిఖీ చేశారు.
విద్యార్థులు ఉండే గదులను, క్లాస్ రూమ్ లను పరిశీలించారు..అనంతరం విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. సమస్యలనుఅడిగి తెలుసుకున్నారు. నాసిరకం బియ్యం, కూరగాయలు , ఇతర ఆహార పదార్థాలు సరఫరా చేస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, నాణ్యమైన సరుకులు మాత్రమే వాడాలని లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఏ చిన్న ఫిర్యాదు వొచ్చినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన , పురుగుపట్టి తేదీ అయిపోయిన సరుకులను ఉపయోగించొద్దని చెప్పారు. కాగా మెనూ ప్రకారం భోజనం అందిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో భోజనం చేస్తూ వారి విద్య విధానంలో ఎదురవుతున్న సమస్యలు , వాటి పరిష్కారానికి కావలసిన సలహాలు, సూచనలు విద్యార్థులకు అందించారు.
విద్యార్థులతో మమేకమై వారి అభ్యసన సామర్థ్యాలను రాబట్టారు. ఈ సంవత్సరం 10/10 జిపిఏ సాధించాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయులు సిలబస్ ను సకాలంలో పూర్తి చేయాలనీ, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కోరారు. పదో తరగతిలో ఈసారి 100% ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు చదువు అందించడంతోపాటు వారి ఆరోగ్యం పట్ల కూడా అలర్ట్ గా ఉండాలన్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుతున్న నిరుపేద విద్యార్థులను మన బిడ్డలుగా భావించి వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తించాలన్నారు. వార్డెన్ లు తప్పనిసరిగా హాస్టల్ లోనే ఉండాలన్నారు. హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు 15 సైకిళ్లను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో , మండల తహసీల్దార్ శ్రీను, వార్డెన్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.




