ఎవరూ చెరిపెయ్యలేని సామూహిక జ్ఞాపకం

“తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన విజయాలుగా ప్రచారం చేసినవన్నీ అబద్ధాలని ఆ అబద్ధాల పుస్తకం రాసింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట క్రమంలో పది లక్షల ఎకరాల భూమిని భూస్వాముల చెర నుంచి విడిపించి భూమిలేని పేదలకు, కౌలుదార్లకు, పేద రైతులకు పంపిణీ చేయడం జరిగిందనే వాస్తవాన్ని శత్రువులు కూడా ఎన్నడూ ఖండించలేదు గాని ఆ పోరాటానికి నిన్నటిదాకా నాయకుడుగా ఉండిన రావి నారాయణ రెడ్డి ఖండించాడు. మూడు వేల గ్రామాల విముక్తి జరిగిందనే మాటా, గ్రామ రాజ్యాధికార కమిటీల పాలన ప్రారంభమయిందనే మాటా అబద్ధమని కొట్టివేశాడు. పోరాటాన్ని యూనియన్ సైన్యాల రాకతో విరమించి ఉండవలసిందని అభిప్రాయం ప్రకటించాడు.”

ఇది కచ్చితంగా తెలంగాణ గురించి మాత్రమే కాదు. మొత్తం దేశం గురించీ, ప్రపంచం గురించీ కూడా. దేశవ్యాపిత సంచలనం సృష్టించిన ఒక పరిణామం గురించి. ఆ పరిణామానికి తెలంగాణకు చెందిన వ్యక్తులు కారకులు కావడం యాదృచ్ఛికమే కావచ్చు. అదే సందర్భంలో ఇది తెలంగాణ గతానికీ వర్తమానానికీ కూడా సంబంధించిన విషయం కూడా. ఆ మాటకొస్తే మొత్తంగా మానవజాతి భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం. ప్రజా పోరాటాల మీద నమ్మకానికి సంబంధించిన వ్యవహారం. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఏవో పోరాట మార్గాలు ఎంచుకున్నప్పుడు, ఆ పోరాటాలకు నాయకత్వం వహించినవారే పుట్టి ముంచి పోతే, ప్రజల ఆశలను వమ్ము చేస్తే దిక్కు ఏమిటి అనే చారిత్రక ప్రశ్నకు సంబంధించిన వ్యవహారం. ప్రత్యేకంగా డెబ్బై ఐదు సంవత్సరాల కిందటి తెలంగాణ జ్ఞాపకాలు ఇవాళ పునర్జీవిస్తున్నాయి గనుక ఇది తెలంగాణ వ్యవహారం కూడా.

పోరాటమే, ధిక్కారమే తెలంగాణ సామూహిక జ్ఞాపకం, సామూహిక జ్ఞానం. మలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలో తెలంగాణ సగటు మనిషి చైతన్యంలో ధిక్కార స్వభావం, పోరాట కాంక్ష ఎందుకున్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఏయే వ్యక్తీకరణలు పొందాయి అని చరిత్ర చర్చ, పరిశోధన చాలా జరిగాయి. కాకతీయ రాజులను ఎదిరించిన పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, జంపన్న అట్టడుగు ప్రజల ధిక్కార చరిత్ర. ఆ రాజే ఢిల్లీ సుల్తానుల దురాక్రమణ యుద్ధాలను ఎదిరించి, ఓడిపోయి బందీగా ఢిల్లీ వెళ్తూ, బానిసత్వం కన్న చావు మిన్న అని ఆత్మత్యాగం చేసుకున్న ధిక్కార చరిత్ర. కుల అంతరాలను తోసిరాజని చాపకూడు పద్ధతి, సంస్కృత మార్గ పద్ధతిని కాదని తెలుగు ద్విపద పద్ధతి ప్రవేశపెట్టిన వీరశైవ పాల్కురికి సోమన ధిక్కార చరిత్ర, రాజులకు అంకితం ఇవ్వనన్న హాలిక కవి పోతన ధిక్కార చరిత్ర. మొఘల్ సామ్రాజ్యాన్ని చికాకు పరిచిన సర్వాయి పాపన్న ధిక్కార చరిత్ర, బ్రిటిష్-నిజాం పాలనను ఎదిరించిన రాంజీ గోండు ధిక్కార చరిత్ర, మా అడవి మీద మాదే అధికారం అని నినదించిన కొమురం భీమ్ ధిక్కార చరిత్ర. నేను దున్ని, సాది సవరిచ్చి పండించిన పంట నాదే అని తెగేసి చెప్పిన పాలకుర్తి ఐలమ్మ ధిక్కార చరిత్ర… ఇలా శతాబ్దానికొక చిహ్నం, ధిక్కార ప్రతీక ఉన్నదని ఉపన్యాసాల్లో చెపుతుండేవాళ్లం. ఈ నేల సామూహిక జ్ఞాపకమూ జ్ఞానమూ పోరాటమే అని నిర్ధారిస్తుండేవాళ్లం.

ఇప్పుడు ఎవరో వచ్చి ఈ పోరాటాన్ని ఆపేస్తున్నాం, ఇక పోరాటానికి అవకాశం లేదు అంటే చరిత్ర ఏమంటుంది? ఆ పోరాటానికి మూలకారణమైన సమస్యలు అనుభవిస్తున్న ప్రజలు ఏమంటారు? ‘భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వు’ అన్నాడు వేమన. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాల మీద, ప్రజలు నిర్మిస్తున్న చరిత్ర మీద ఎవరో ఒకరు తమ సొంత యాజమాన్యం ప్రకటించి, తామే సొంతదారులం గనుక ఆ దుకాణాన్ని మూసేస్తున్నాం అని అంటే ప్రజలు ఏమంటారు? చరిత్ర ఏమంటుంది? ఒక సమాజ చారిత్రక సామూహిక జ్ఞాపక ధారను పాలకులు చెరిపెయ్యగలరా? పోరాటా నాయకులమనీ, వీరులమనీ అనుకుంటున్నవారు చెరిపెయ్యగలరా? మరీ ముఖ్యంగా పాలకుల చెంత జేరిన గత పోరాట నాయకులు ఒకరో ఇద్దరో పది మందో చెరిపెయ్యగలరా? ఇవాళ్టి పరిణామాలు చూస్తుంటే, తెలంగాణలో ఎనిమిది దశాబ్దాల కిందటి పరిణామాలు పునరావృతమవుతున్నాయని అనిపిస్తున్నది. “చరిత్రలో ప్రతి ఘటనా రెండు సార్లు జరుగుతుంది” అని హెగెల్ అన్నాడని ఉటంకిస్తూ మార్క్స్, “అయితే ఆయన ఒక విషయం కలపడం మరిచిపోయాడు. మొదటిసారి జరిగినప్పుడు విషాదాంతంగా జరిగిన ఘటన, రెండోసారి హాస్యాస్పదంగా జరుగుతుంది” అని కలిపాడు.

“ఇప్పుడు తెలంగాణ నుంచే మరొక రావి నారాయణ రెడ్డి పుట్టుకువచ్చాడు. మళ్లీ బొంబాయి ముఖ్యమంత్రి కనుసన్నలలోనే పోరాట విరమణ ప్రకటిస్తున్నాడు. పోరాటానికి తగిన పరిస్థితి లేదంటున్నాడు. ఆయుధం రాజ్యం చేతికి అప్పగించాడు. దాని ముందు సరిగ్గా రావి నారాయణ రెడ్డి లాగానే విప్లవోద్యమం సాధించిన విజయాలేవీ లేవని కొట్టేశాడు. చేసినవన్నీ తప్పులే అన్నాడు. వ్యక్తిగతంగా ఏమైనా అనుకునే హక్కు ఉంది. కాని ప్రజలు మంచి బతుకు కోసం కన్న, కంటున్న కలలను చిదిమేశాడు. ఆ కలను నిజం చేయడానికి ఏర్పడిన నిర్మాణాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. అప్పటి నగ్న సత్యాలు ప్రకటనకూ, సాయుధ పోరాట విరమణ ప్రకటనకూ మధ్య కొన్ని నెలల కాలం, చర్చలు, వాదోపవాదాలు, అంతర్జాతీయ జోక్యం సాగాయేమో గాని, కొత్త రావి నారాయణ రెడ్డి తన వ్యవహారమంతా నాలుగు వారాల లోపు ముగించేశాడు.”

పైన చెప్పిన సామూహిక జ్ఞాపకాపు పోరాట ధారలో ఐలమ్మ పంటకోత జరిగిన రెండు సంవత్సరాలకు కడివెండి దొడ్డి కొమరయ్య కాల్చివేత జరిగింది. అప్పటిదాకా సాగిన గ్రంథాలయోద్యమం, వర్తక సంఘాలు, ఆంధ్ర మహాసభ, మహజరులు, విన్నపాలు, గుత్పల సంఘాలు, వడిసెలలు, కారపు నీళ్లు అన్నీ గడిచిపోయి చరిత్ర ఒక కొత్తదశలో ప్రవేశించింది. అవతల గడీ లోంచి తుపాకి పేలింది గనుక ఇటు ప్రజల చేతికి కూడా తుపాకి రావాలని తేలిపోయింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమయింది. సబ్బండ వర్గాల ఐక్యతను చూపింది. నిజాం భూస్వామ్య నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఆ పోరాటం వెట్టిని రద్దు చేసింది. భూసంబంధాల అసమానతను ప్రశ్నించింది. దొరలకు సంఘ బహిష్కార శిక్షలు విధించి, పట్నాలకు పరుగెత్తేట్టు చేసింది. నిజాం పోలీసులకు ఎదురు నిలిచి పోరాడింది. వాస్తవంగా భూస్వాముల ప్రైవేటు సైన్యంగా, అదనంగా మతోన్మాద ముసుగు కప్పుకుని వచ్చిన రజాకార్లను తిప్పికొట్టింది. గ్రామాల మీద ప్రజా రాజ్యాధికారం స్థాపించింది. సరిగ్గా అప్పుడే రజాకార్లను అణచడానికి అని పైకి చెప్పి, అసలు కారణం కమ్యూనిస్టులను, అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అణచడానికి అని యూనియన్ సైన్యాలు హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశించాయి.

ఆ పాత ఆపరేషన్ కగార్ ప్రారంభం కాగానే, నాటి పోరాట నాయకుడు రావి నారాయణ రెడ్డి, తన డెన్ లో చీటీ రాసి పెట్టి, బొంబాయి పారిపోయాడు. కేంద్ర నాయకత్వం దగ్గర తన పరపతిని ఉపయోగించుకుని, పార్టీ ఇచ్చిన సౌకర్యాలు వాడుకుంటూనే ‘తెలంగాణ నగ్నసత్యాలు’ పేరుతో అత్యంత దుర్మార్గమైన, శత్రువు కూడా అనడానికి సాహసించని అబద్ధాలతో, వక్రీకరణలతో తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం మీద దుమ్మెత్తిపోసే పుస్తకం రాసి పంపిణీ చేయడం మొదలు పెట్టాడు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన విజయాలుగా ప్రచారం చేసినవన్నీ అబద్ధాలని ఆ అబద్ధాల పుస్తకం రాసింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట క్రమంలో పది లక్షల ఎకరాల భూమిని భూస్వాముల చెర నుంచి విడిపించి భూమిలేని పేదలకు, కౌలుదార్లకు, పేద రైతులకు పంపిణీ చేయడం జరిగిందనే వాస్తవాన్ని శత్రువులు కూడా ఎన్నడూ ఖండించలేదు గాని ఆ పోరాటానికి నిన్నటిదాకా నాయకుడుగా ఉండిన రావి నారాయణ రెడ్డి ఖండించాడు. మూడు వేల గ్రామాల విముక్తి జరిగిందనే మాటా, గ్రామ రాజ్యాధికార కమిటీల పాలన ప్రారంభమయిందనే మాటా అబద్ధమని కొట్టివేశాడు. పోరాటాన్ని యూనియన్ సైన్యాల రాకతో విరమించి ఉండవలసిందని అభిప్రాయం ప్రకటించాడు. పోరాట క్షేత్రం వదిలి పారిపోయిన వ్యక్తి ప్రకటించిన ఆ అబద్ధాలకు, అర్ధసత్యాలకు, వక్రీకరణలకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు తమ ఆచరణ నుంచే జవాబు చెప్పారు. ఆయన పారిపోయిన తర్వాత, ఆ అబద్ధాల పుస్తకం పంపిణీ తర్వాత కూడా పోరాటం ముందుకే సాగింది, కొత్త ప్రాంతాలకు విస్తరించింది.

తొలిరోజుల్లో ఆయన వాదనలను వ్యతిరేకించిన నాయకత్వంలోని ఒక సెక్షన్ కూడా క్రమంగా ఆ వాదనలకు, పోరాట విరమణ ఆలోచనకు లొంగిపోయారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, స్థానిక నాయకులు అంగీకరించక పోవడంతో, పోరాటాన్ని విరమించాలా, కొనసాగించాలా స్టాలిన్ తో చర్చించామని, ఆయన కూడా సముద్ర తీరం వంటి అనుకూల పరిస్థితులు లేకపోతే విరమించమన్నాడనే అబద్ధంతో ఆ నాటి పోరాట నాయకత్వం నారాయణరెడ్డి మార్గాన్నే చేపట్టింది. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి హామీలూ లేకుండానే, పార్టీ మీద నిషేధం కూడా ఎత్తివేయకుండానే, కేసులు ఉపసంహరించకుండానే, ఉరిశిక్షలతో సహా అనేక శిక్షలు అనుభవిస్తున్నవారు జైలులో ఉండగానే, పార్టీ నాయకత్వం సాయుధ పోరాట విరమణ ప్రకటించింది. పార్టీ మీద నిషేధం ఎత్తివేయలేదు గనుక పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఎన్నికల్లో పోటీ చేసింది. రెండు సంవత్సరాల కిందనే పోరాటానికి ద్రోహం చేసి, బొంబాయి పారిపోయి, పోరాటం మీద అబద్ధ ప్రచారం చేసిన వ్యక్తిని గౌరవనీయంగా తమ అభ్యర్థిగా నిలబెట్టడం మాత్రమే కాదు, ఆయనకు దేశంలో అందరికన్నా ఎక్కువ వోట్లు వచ్చాయని అది తమ ఘనతేనని చెప్పుకునే స్థాయికి దిగజారింది.

అయినా ప్రజల సామూహిక జ్ఞాపకం నుంచి పోరాటం చెరిగిపోలేదు. నిత్యజీవిత సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు పోరాటం తప్ప మరొక మార్గం లేదని అప్పటికే గుర్తించి ఉన్నారు గాని, మార్గదర్శకత్వం వహించే నాయకత్వం లేకుండా పోయింది. తెలంగాణ ప్రజల సామూహిక జ్ఞాపకంలో, జ్ఞానంలో అటువంటి పోరాట చరిత్ర, పోరాట స్ఫూర్తి ఉండడం వల్లనే నక్సల్బరీ ప్రజ్వలనం జరగగానే మొట్టమొదట అందుకున్న ప్రాంతాలలో శ్రీకాకుళం బీహార్, పంజాబ్, వైనాడులతో పాటు తెలంగాణ కూడా అగ్రభాగాన ఉంది.

తర్వాత గడిచిన ఆరు దశాబ్దాలలో దేశంలో అప్రతిహతంగా, ఒకరి నాయకత్వంలో కాకపోతే మరొకరి నాయకత్వలో సాగుతూ వచ్చిన సాయుధ పోరాట ధారలో కూడా తెలంగాణ మార్గనిర్దేశక స్థానంలో నిలబడింది. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విజయాలతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ విజయాలను, ఎన్నో రెట్లు ఎక్కువ ప్రాంతాలకు విస్తరించి నక్సల్బరీ పోరాటం విజయాలు సాధించింది. పరిమాణంలోనే కాక, గుణాత్మకంగా కూడా నక్సల్బరీ తెలంగాణకు కేవలం కొనసాగింపుగా మాత్రమే కాక, అధిగమించిన వారసురాలిగా నిలిచింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అతి చిన్న ప్రాంతంలో ఐదు సంవత్సరాలు మాత్రమే సాగగా, నక్సల్బరీ పంథా సాయుధ పోరాటం యాబై ఎనిమిది సంవత్సరాలుగా దేశమంతా ఇరవై రాష్ట్రాలకు పైగా విస్తరించింది. అన్ని పీడిత ప్రజాసమూహాలలోకి విస్తరించింది. తెలంగాణ సాయుధ పోరాటం సృష్టించిన కళా, సాహిత్య, సాంస్కృతిక, మేధా సృజనతో పోలిస్తే వందల రెట్లు ఎక్కువైన, విస్తారమైన, గుణాత్మకంగా విశిష్టమైన సృజన కృషి సాగింది. ఈ యాబై ఎనిమిది సంవత్సరాలలో ఆ ఉద్యమ ధారలోంచి ఎన్ని పాయలు విడివడినా, కొన్ని పాయలు ఉద్యమ మార్గం వదిలి, “జనజీవన స్రవంతి” అనబడేదానిలోనికి వచ్చినా, ఉద్యమం ఆగకుండా ముందుకే సాగింది. తెలంగాణ సాయుధ పోరాట విరమణ అధికారికంగా జరగగానే ఆ పోరాటం ఆగిపోయింది గాని, దాదాపు 1972 నుంచే నక్సల్బరీ మార్గం మీద విమర్శలు, కొత్త పాయలు చీలి, సాయుధ పోరాటాన్ని వదిలేయడం, కొత్త అన్వేషణలు, ఆ అన్వేషణలో పతనాలు, అసలు విప్లవ ఆలోచననే వదులుకోవడం వంటివి ఎన్ని జరిగినా, వేలాది మంది కార్యకర్తలనూ నాయకులనూ రాజ్యం అమానుషంగా, చట్టవ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా పొట్టనపెట్టుకున్నా ఆ పోరాట స్ఫూర్తి ఆగిపోలేదు.

ఇప్పుడు తెలంగాణ నుంచే మరొక రావి నారాయణ రెడ్డి పుట్టుకువచ్చాడు. మళ్లీ బొంబాయి ముఖ్యమంత్రి కనుసన్నలలోనే పోరాట విరమణ ప్రకటిస్తున్నాడు. పోరాటానికి తగిన పరిస్థితి లేదంటున్నాడు. ఆయుధం రాజ్యం చేతికి అప్పగించాడు. దాని ముందు సరిగ్గా రావి నారాయణ రెడ్డి లాగానే విప్లవోద్యమం సాధించిన విజయాలేవీ లేవని కొట్టేశాడు. చేసినవన్నీ తప్పులే అన్నాడు. వ్యక్తిగతంగా ఏమైనా అనుకునే హక్కు ఉంది. కాని ప్రజలు మంచి బతుకు కోసం కన్న, కంటున్న కలలను చిదిమేశాడు. ఆ కలను నిజం చేయడానికి ఏర్పడిన నిర్మాణాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. అప్పటి నగ్న సత్యాలు ప్రకటనకూ, సాయుధ పోరాట విరమణ ప్రకటనకూ మధ్య కొన్ని నెలల కాలం, చర్చలు, వాదోపవాదాలు, అంతర్జాతీయ జోక్యం సాగాయేమో గాని, కొత్త రావి నారాయణ రెడ్డి తన వ్యవహారమంతా నాలుగు వారాల లోపు ముగించేశాడు.

కాని చరిత్ర నిర్మాణం అంతా వేగంగా, హడావుడిగా సాగేది కాదు, చరిత్ర విధ్వంసమూ అంత వేగంగా, హడావుడిగా సాగేది కాదు. చరిత్ర ప్రజల మనసుల్లో, హృదయాల్లో, మాటల్లో, ఆట పాటల్లో, ఆచరణలో, సామూహిక జ్ఞాపకంలో, సామూహిక జ్ఞానంలో నిలిచే ఉంటుంది. నిలిచి వెలుగుతూనే ఉంటుంది. దాని ఎవరూ మలిపెయ్యలేరు, చెరిపెయ్యలేరు. ఎక్కువలో ఎక్కువ అప్పుడప్పుడు అది గడ్డ కడుతుంది. కాలంబు రాగానే అన్నట్టు, మళ్లీ ఉధృత ప్రవాహం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page