– ఇజ్రాయిల్, అమెరికాలకు దీటుగా జవాబు
– మిస్సైళ్లు, డ్రోన్‌లతో విరుచుకు పడుతున్న ఇరాన్
- చైనా సహకారంతోనే అంటూ..అంతర్జాతీయ కథనాలు
టెహ్రాన్, మార్చి 5: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ ఇటీవల దీటుగా బదులిస్తోంది. దాడుల్లో ఎక్కడా తగ్గడం లేదు. తమ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి అనంతరం మధ్య ప్రాచ్య దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేపట్టింది. భారీ ఆయుధాలతో విరుచుకుపడుతూ పశ్చిమాసియా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓవైపు ఇరాన్ వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులే కాకుండా యూఏఈ, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి 10 దేశాలపై ఇరాన్ ఏకధాటిగా దాడిచేస్తున్న విధానాన్ని చూస్తే ఆ దేశం వద్ద భారీ క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయనే సందేహం తలెత్తకమానదు. అయితే దశాబ్దాలుగా ఆ దేశం ఎంతో కృషిచేసి ఇంత భారీఎత్తున ఆయుధ సామగ్రిని నిర్మించుకుంది. ఆ దేశం ఆయుధగారాన్ని పెంచుకోవడంలో చైనా హస్తం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా స్పష్టమవుతోంది. ఆ మీడియా నివేదికల ప్రకారం.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందే ఇరాన్‌కు చైనా ఆయుధాలను సరఫరా చేసినట్టు తెలుస్తోంది. వీటిలో ఆయుధాల్లో షాహిద్ క్లాస్ కామికేజ్ డ్రోన్ల నుంచి ఫత్తాహ్ క్లాస్ హైపర్‌సోనిక్ మిసైల్స్ వరకు ఇరాన్ భద్రతా వ్యూహంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి శత్రు దేశాలపై దాడిచేయగల సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి. అయితే ఇరాన్ ఈ ఆయుధాలను అభివృద్ధి చేసుకోవడంలో చైనా పాత్ర ఎంతమేర ఉందనేదానిపై స్పష్టత లేదు. గత శుక్రవారం ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాలు దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఇరాన్‌కు ప్రమాదకర ఆయుధాలను, అదనపు రక్షణ ఎలా పొందాలో చైనా వివరించిందని మధ్యప్రాచ్యంలోని ఓ మీడియా సంస్థ నివేదించింది. ఇదిలా ఉండగా చైనా తయారు చేసిన సీఎం 302 యాంటీ షిప్ క్షిపణుల కొనుగోలుపై ఇరాన్-చైనా ఒప్పందం చేసుకోవాలనుకున్నట్టు రాయిటర్స్ తన కథనంలో రాసుకొచ్చింది. ఇక ఇరాన్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆయుధాలలో ఎక్కువ భాగం ఆ దేశంలోనే ఉత్పత్తి అయినవే అయినప్పటికీ వాటిలో చాలావరకు చైనా పాత డిజైన్ల ఉత్పత్తులు లేదా చైనా తయారీ భాగాలపై ఆధారపడి ఇరాన్ రూపొందించుకుని ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొన్నేళ్లుగా ఇరాన్ ఆయుధగార నిర్మాణంలో చైనా కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం సాయంలేకుండా ఇరాన్ ఇంత పెద్దఎత్తున క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అసాధ్యమని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. కాగా, ఇరాన్‌కు 1979-1989 కాలంలో తొలిసారి ఆయుధాలు సరఫరా చేసింది చైనా. పశ్చిమ దేశాలు విధించిన ఆయుధ నిషేధాల నడుమ 1986లో హై 2, సీ 801 యాంటీ షిప్ వ్యవస్థలను నాడు చైనా సరఫరా చేసింది. ఇరాన్‌కు చైనా అతిపెద్ద ఆయుధ సరఫరాదారుల్లో ఒకటని స్టాక్‌హోమ్ పీస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. విమానాలు, క్షిపణులు, తుపాకీ వ్యవస్థలు సహా రక్షణ పరికరాలను అందించిందని పేర్కొంది. ఇదిలా ఉండగా 2005లో ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ అణువ్యాప్తి నిరోధక ఒప్పందం పాటించలేదనే కారణంగా ఇరాన్‌కు చైనా ఆయుధ సామగ్రి సరఫరాను నిలిపివేసింది. అమెరికా ఆంక్షలు చైనా ఆయుధ విక్రయాలను మరింత నియంత్రించాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


