– ఉద్యమకారులకు అన్యాయం జరిగింది
– ఊహించిన దానికి భిన్నంగా నిర్ణయాలు
– అందుకే మళ్లీ పోరాటం చేయాల్సి వస్తోంది
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: తాను కచ్చితంగా రాజకీయ పార్టీని స్థాపిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ పేరుతోనే పార్టీ ఉంటుందని, జాగృతి రాజకీయ శక్తిగా మారుతుందని పేర్కొన్నారు. స్వీయ అసిత్వం, ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకోవడం కోసమే రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా ఉండదని కుండబద్దలు కొట్టారు. రాజకీయ పార్టీ స్థాపిస్తానంటే.. తనపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పక్కన పైరవీకారులు లేరని.. ఎప్పుడూ ఉద్యమకారులే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ గురువారం జరిగింది. సభలో కవిత మాట్లాడుతూ ఉద్యమకారులను పట్టించుకోలేదు కాబట్టే ఆ పెద్ద మనిషి అధికారం కోల్పోయారంటూ బీఆరఎస్ అధినేత కేసీఆర్‌ని పరోక్షంగా విమర్శించారు. గత పాలకులు అహంకారం ఎక్కువై ఓడిపోయారంటూ విమర్శలు సంధించారు. కేసీఆర్ హయాంలో అసెంబ్లీ ముందు ఉద్యమకారుడు ఆత్మాహుతి చేసుకుని చనిపోయాడన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని సైతం ఉద్యమకారులు బంగ్లా నుంచి బయటకు గుంజుతారని జోస్యం చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత 63 సీట్లతో అధికారం ఇస్తే అన్ని పార్టీలను విలీనం చేసుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు. ఇక బీఆరఎస్ అధినేత కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాశారన్నారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ ఎత్తేశారని, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అరెస్టులు చేశారంటూ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో ఎవర్ని గెలిపించినా బీఆరఎస్ పార్టీలోకే వెళ్తారన్న పరిస్థితి వచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత చిన్న వారికి లాభం జరగలేదని తెలిపారు. కానీ మెగా కృష్ణారెడ్డి మాత్రమే కుబేరుడు అయ్యాడని వ్యంగ్యంగా అన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేసే బాధ్యత తీసుకోవాలంటూ ప్రొఫెసర్ కోదండరాంకు ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత సూచించారు. ప్రో.కోదండరాం, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరుల వల్లే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మారన్నారు. అయితే రెండేళ్లుగా ఎందుకు మాట్లాడటం లేదంటూ కోదండరాంను కవిత సూటిగా ప్రశ్నించారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సంక్షేమ బోర్డు ప్రకటన చేయాలని, ప్రైవేట్ ఉద్యోగాల్లో 25 శాతం కోటాను ఉద్యమకారుల పిల్లలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. మలి దశ ఉద్యమం మొదలైన ఆరేండ్ల తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టారని కవిత అన్నారు. 1995లో వరంగల్ డిక్లరేషన్ తో మలిదశ ఉద్యమం మొదలైందని చెప్పారు. స్వరాష్ట్ర ఉద్యమంలో మారోజు వీరన్న, గద్దర్ లాంటి వారు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదు
ఈ గడ్డపై విరామం లేకుండా ఒకదాని తర్వాత మరొక ఉద్యమం కొనసాగుతూనే వచ్చిందన్నారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టారని, నిప్పుకణికలా మండుతున్న ఉద్యమాన్ని అగ్గిరాజేసిండని అన్నారు. 2014లో తెలంగాణ తెచ్చుకున్నంక ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదని, ఎక్కడైనా ఉద్యమకారులకు పదవులు దక్కితే వారు మిగతా వారిని పురుగులను చూసినట్లు చూశారని విమర్శించారు. తెలగాణ ఉద్యమ సమయంలో మనను కొట్టించారో వారు సార్ పక్కనే చేరిండ్రు.. కేశవరావు జాదవ్ చనిపోతే ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయా? జయశంకర్ సారు బొమ్మ కేబీఆర్ పార్కు వద్ద పెట్టాలని నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను పదేపదే అడిగిన.. సుప్రీంకోర్టు తీర్పు అడ్డొచ్చింది.. ట్యాంకు బండ్ మీద పెడతామన్న పెట్టుకోలేకపోయినం.. అక్కడున్న ఆంధ్రోళ్ల విగ్రహాలు తీస్తరని అనుకున్నం తీయకపోతివి.. కనీసం మనోళ్ల విగ్రహాలైన పేట్టకపోతివి.. ఆ బాధ వెంటాడుతూనే ఉన్నది. ఇప్పుడొచ్చినైన ఎవరి బొమ్మలు పెడుతుండో అర్థం కాని పరిస్థితి ఉంది. ఉద్యమానికి వ్యతిరేకంగా గన్ను పట్టుకొని తిరిగిన రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నం.. ఆయనకు ఏం సోయి ఉంటది తెలంగాణ అంటే. రవీంద్ర భారతిలో గద్దర్, బిరదరాజు రామరాజు, సుద్దాల విగ్రహాలు ఉండాల్సింది.. ఎవరి విగ్రహాలున్నాయి. చేతులో ఉన్నప్పుడు చేసుకోలేదు. ఇప్పుడు మన చేతులో పోరాటం తప్ప ఏ లేదు. ఇప్పుడు పోరాడితేనే ఉద్యమ కారులకు న్యాయం జరుగుతుంది అని కవిత అన్నారు. తెలంగాణలోని ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్జడెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును పాస్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం జాగృతి పోరాడుతుందని చెప్పారు. రాష్ట్రంలో వందల, వేల సంఖ్యలో ఉద్యమకారులు ఉన్నారని, ఇందుకోసం యాప్ లాంచ్ చేశామని, అందులో వివరాలు నమోదు చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వచ్చే బ్జడెట్లో నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. చేయకుంటే ఊరుకునేది లేదని సీఎంని కాదు కోదండరామ్ ను హెచ్చరిస్తున్నానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





