– డీజీపీ శివధర్ రెడ్డి
హైదారాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు.మొత్తం 123 కౌంటింగ్ స్టేషన్లను సిద్ధం చేశామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం 12 వేల మంది పోలీసు బలగాలతోపాటు సాయుధ బలగాలు , క్విక్ రెస్పాన్స్ టీమ్స్ నిరంతరం పహరా కాస్తాయని, అదనపు భద్రత కోసం ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీ టీవీ కెమెరాల నిఘాలో ఉంచామని, వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను తన కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షిస్తామని వివరించారు. లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నామని, పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఏదైనా అల్లర్లు లేదా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో సంబంధిత చట్టాల ప్రకారం నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు డిజిపి తెలిపారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తామని, జన సమూహాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, పోలీసు అధికారులు అప్రమత్తతతో వ్యవహరిస్తూ కౌంటింగ్ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. బిఎన్ఎస్ఎస్ 163 ప్రకారం కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఎక్కువమంది గుమికూడటం, ఆయుధాలు ధరించడం వంటి చర్యలపై నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని డిజిపి పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా ముగిసేందుకు అన్ని పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసు యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని డిజిపి కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





