ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది గులాబీ జెండానే

– ఎమ్మెల్యేలు వెళ్లినా కేడర్ అంతా కేసీఆర్ వెంటే
– శేరిలింగంపల్లిలో పార్టీ అత్యంత బలోపేతం
– కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: మహానగరాన్ని ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి తెలంగాణ భవన్‌లో గురువారం బీఆరఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పార్టీని వీడినా కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా కేసీఆర్ నాయకత్వంలోనే ఉన్నారని ప్రశంసించారు. మొత్తం హైదరాబాద్‌లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా నిలిచిందన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లినా బంగారం వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని, శేరిలింగంపల్లిలోని 24 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేసే సత్తా మనకుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అబద్ధాలు.. బీజేపీ శూన్య హస్తం

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అరిచేతిలో వైకుంఠం చూపి అధికారం దక్కించుకుందని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు బీజేపీ 12 ఏళ్లుగా తెలంగాణకు 12 పైసల పని కూడా చేయలేదని, అది పూజకు పనికిరాని పువ్వు అని ఎద్దేవా చేశారు. వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలి అన్న నానుడిని గుర్తు చేస్తూ తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.

నగరంలో కుప్పకూలిన శాంతిభద్రతలు

కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలే సుల్తాన్ బజార్ ఎస్‌బీఐ బ్రాంచిలో దోపిడీలు, చందానగర్‌లో జ్యువెలరీ షాపులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు కుదేలయ్యాయని, కొత్త కొలువులు రాకపోగా ఉన్నవి పోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

త్వరలో డివిజన్ల వారీగా సమావేశాలు

కార్పొరేషన్ ఎన్నికల కోసం త్వరలో డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు. ఎమ్మెల్యే లేడని బాధ‌పడకండి.. ఏ అవసరమొచ్చినా మీకు అండగా తాను, తలసాని శ్రీనివాస్ యాదవ్, కృష్ణారావు ఉంటాం అని హామీ ఇచ్చారు. తప్పుడు ఓటు వేస్తే ఐదేళ్లపాటు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు ముఖ్యంగా మహిళా లోకానికి కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, విజయ్ కుమార్ రెడ్డి వంటి యువకులు పార్టీకి ఆస్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డిలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *