ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

– 90శాతం మున్సిపాలిటీలు తమవే అంటున్న కాంగ్రెస్‌
– భరోసాలో బిఆర్‌ఎస్‌, ‌బిజెపి, బోణి కొట్టనున్న జనసేన

                                                         (మండువ రవీందర్‌రావు)
మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మరి కొద్ది గంటల్లో తేలనున్న తమ భవిష్యత్‌పై అభ్యర్ధులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పోరేషన్‌లకు ఈ నెల 11న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తీవ్రంగా పోటీ పడ్డాయి. పోటీ సందర్భంగా ఆయాపార్టీలు తమ స్థాయిని మరిచి విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నాయి. అయితే ఎన్నికల యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవడంతో ఒకటిరెండు చెదురుమదురు సంఘటనలు తప్ప పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. ఎన్నికల సరళిపై పలు సంస్థలు అప్పుడే తమ సర్వేలను ప్రకటించాయి. మొత్తంమీద అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగానే ఉన్నాయి. కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటున్నట్లుగా ఆ సర్వేలద్వారా తెలుస్తున్నది. ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 90 శాతం మున్సిపాలిటీలను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని ఆయన బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ప్రస్తావించి ఆయన ప్రశంసలను అందుకున్నారు.  బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించిన కాంగ్రెస్‌, ‌తిరిగి మున్సిపల్‌ ఎన్నికల్లోకూడా విజయాన్ని సాధిస్తున్న సూచనలు రావడంతో ఖర్గె ఆయన్ను అభినందించారు.
ఇదిలాఉంటే ఎగ్జిట్‌పోల్స్ ‌కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ అభ్యర్దుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా పీపుల్స్‌పల్స్ ‌సంస్థ ఇచ్చిన సర్వేతో కాంగ్రెస్‌లో అప్పుడే విజయోత్సవం తొణికిసలాడుతోంది. ఆ సర్వే ప్రకారం ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ 68 ‌నుంచి 76 స్థానాలను గెలుచుకునే అవకాశముంది. అలాగే బిఆర్‌ఎస్‌ 29 ‌నుంచి 36 స్థానాలను, బిజెపి మూడు నుంచి అయిదు, ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకోవచ్చని తన సర్వే రిపోర్టులో పేర్కొంది. అయితే సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లు 90 శాతం కాకుండా 70 శాతం స్థానాలనే కాంగ్రెస్‌ ‌గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కొత్తగా జనసేన కొన్ని వార్డులను కైవసం చేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. కనీసం 30 నుంచి 35 వార్డులను గెలుచుకోవచ్చని ఆపరేషన్‌ ‌చాణక్య సర్వే చెబుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా  జరిగిన 2,982 వార్డుల ఎన్నికల్లో  40 శాతం ఓట్లను సాధించుకుని 1400 నుంచి 1449 వార్డులను కాంగ్రెస్‌ ‌గెలుచుకునే అవకాశముందని చాణక్య సర్వే చెబుతున్నది. అలాగే 26 శాతంతో 745 నుంచి 793 వార్డులను ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌, 13.04 ‌శాతంతో 358 నుంచి 399 వార్డులను బిజెపి గెలుచుకోవచ్చని చాణక్య తన సర్వేలో పేర్కొంది. కాగా కాంగ్రెస్‌తో ములాకాత్‌ అయిన ఎంఐఎం 6.03 శాతం ఓట్లతో 150 నుంచి 187 వార్డులను సాధించుకునే అవకాశముందని చెప్పింది. ఇక జనసేన 1.02 శాతం ఓట్లతో 30 నుంచి 35 వార్డులను, నాలుగు శాతం ఓట్లతో 80 నుంచి 119 వార్డులను ఇతరులు గెలచుకునే అవకాశముందని చాణక్య సర్వే తెలుపుతున్నది. పీపుల్స్‌పల్స్ ‌సర్వే ప్రకారం కాంగ్రెస్‌ ‌గెలుచుకునే వాటిల్లో మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లుండవచ్చని, బిజెపి కరీంనగర్‌, ‌నిజామాబాద్‌ ‌కార్పోరేషన్‌లల్లో తమ ఆదిపత్యాన్ని నిరూపించుకునే అవకాశముందంటున్నారు. అయితే నిజామాబాద్‌, ‌కరీంనగర్‌, ‌మహబూబ్‌నగర్‌లలో ఎంఐఎం కింగ్‌మేకర్‌గా వ్యవహరించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నమాట.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *