– లోగో, పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీహరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద స్టేడియంస్థాయి స్పోర్ట్స్ ఇన్నోవేషన్ లీగ్ అయిన స్పోర్ట్స్ హ్యాకథాన్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనుండడం రాష్ట్రానికి గర్వకారణమని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, క్రీడా, యువజన సర్వీసులు శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మార్చి 28, 29 తేదీలలో జరిగే స్పోర్ట్స్ హ్యాకథాన్ పోస్టర్, లోగోను శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, హ్యాకథాన్ నిర్వహకులు సందీప్ కుమార్ మక్తాలతో కలిసి మినిస్టర్స్ క్వార్టర్స్‌లో గురువారం ఆవిష్కరించారు. స్పోర్ట్స్ హ్యాకథాన్ ఒక పోటీ కార్యక్రమం మాత్రమే కాదని, ఇది క్రీడలు, సాంకేతికతను సమన్వయం చేసే విశ్వస్థాయి ఉద్యమమని మంత్రి పేర్కొన్నారు. సంప్రదాయ హ్యాకథాన్‌లకు భిన్నంగా ప్రొఫెషనల్ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ప్రత్యక్షంగా క్రీడల్లో పాల్గొని, ఆ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని క్రీడలకు సంబంధించిన వాస్తవ సమస్యలకు సృజనాత్మక, ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి యువత, క్రీడాకారులు, విద్యార్థులు, టెక్నాలజీ నిపుణులు, స్టార్టప్‌లను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, సుమారు పదివేల మంది పాల్గొనేలా సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు. కొంతమంది అంతర్జాతీయ ప్రతినిధులు కూడా పాల్గొననుండటం విశేషమన్నారు. ప్రపంచంలోనే మొదటి స్టేడియం స్థాయి స్పోర్ట్స్ హ్యాకథాన్ కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ వినూత్న నమూనా ద్వారా తెలంగాణను క్రీడా ఆవిష్కరణల గ్లోబల్ కేంద్రంగా నిలబెట్టడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ హ్యాకథాన్ ద్వారా యువతలో సృజనాత్మకత, ఆవిష్కరణాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం లభిస్తుందని, క్రీడారంగ భవిష్యత్తును రూపుదిద్దే చరిత్రాత్మక అడుగుగా ఇది నిలుస్తుందని మంత్రి శ్రీహరి అన్నారు. యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





