– అందుకే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు
– భయపెట్టడం, ప్రలోభపెట్టడమే పనిగా మారింది
– మహదేవప్ప కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ
మక్తల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: మక్తల్‌లో 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహదేవప్ప కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని, ఈ అంశాన్ని రాజ్యసభలో డాక్టర్ లక్ష్మణ్, లోక్‌సభలో తాను ప్రస్తావించినట్లు తెలిపారు. కొన్ని రోజులుగా మక్తల్ నుంచి గోదావరిఖని వరకు, జహీరాబాద్ నుంచి ఖమ్మం వరకు బీజేపీ అభ్యర్థులపై, కార్యకర్తలపై సీఎం ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులకు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ మహిళా అభ్యర్థులను బెదిరించడం, యువకులు పోటీ చేస్తే వారి తల్లిదండ్రులను బెదిరించి మానసిక వేదనకు గురిచేయడం, పోలీస్ స్టేషన్లకు పిలిపించి వేధించడం, ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని, రేషన్ కార్డులు తొలగిస్తామని భయభ్రాంతులకు గురిచేయడం, ఇతర ప్రలోభాలకు గురిచేయడం, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పరిస్థితి ఉందని చెప్పారు. మేమే గెలుస్తాం, గెలిచాక మీరు ఎలా పనిచేస్తారో చూస్తాం అంటూ బీజేపీ కార్యకర్తలను మానసికంగా వేదనకు గురిచేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో భయభ్రాంతులకు గురిచేసి గెలవాలని ప్రయత్నం చేస్తోందని తెలిపారు. మహదేవప్ప పోటీ చేస్తున్న వార్డులో బీజేపీ 500పై ఓట్ల మెజారిటీతో గెలవబోతోందని, అందుకే ఆయనను భయభ్రాంతులకు గురిచేశారని, సీఎం సొంత జిల్లాలోనే ఇలా జరగడం దారుణమని అన్నారు. ఏ సీఎం కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు. ఈ రకంగా గెలిచే అభ్యర్థులను బెదిరించే పరిస్థితులు రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మూడు రోజుల క్రితం ఎంపీ అరుణ ఇక్కడ ప్రచారం చేశారని, ఆమెతో కలిసి మహదేవప్ప ప్రచారంలో పాల్గొన్నారని, తాను గెలుస్తున్నానని చెప్పాడని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే వార్డులో బీజేపీ 570 ఓట్ల మెజారిటీ సాధించిందని, ఇప్పుడు కూడా బీజేపీ గెలవబోతుందనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ దారుణానికి పాల్పడిందని ఆరోపించారు. లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను పిలిచి మాట్లాడారని, వెంటనే ఇక్కడికి వెళ్లాలని పంపారని కిషన్ రెడ్డి చెప్పారు. రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప పనులు గడప దాటడం లేదని విమర్శించారు. భయపెట్టడం, బెదిరింపులు, డబ్బుతోనే రాజకీయాల్లో గెలవలేరని అన్నారు. ప్రజల ఆదరణ, ప్రేమతోనే శాశ్వతమైన రాజకీయాలు చేయవచ్చని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు మహదేవప్ప కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




