రైతు బంధుకు, మున్సిపల్ ఎన్నికలకు లింకు ఎందుకు?

– ఎన్నికల వరకు ఆశ చూపి ఆనక మోసం చేయడానికే
– ఇపుడు సురుకు పెడితేనే ప్రభుత్వం మాట వింటది
– సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్

సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు.. కానీ ఇప్పటికీ ఎన్ని పంట కాలాలు గడిచాయి.. ఎన్నిసార్లు రైతుబంధు వేసిండో చెప్పాలి అని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నిలదీశారు. రైతన్నల ఖాతాలో డబ్బులు వేయడానికి మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా అడ్డొస్తున్నాయి అని ప్రశ్నించారు. ఎన్నికలయ్యే వరకు ఆశ చూపి మరోసారి మోసం చేయడానికే రేవంత్ రెడ్డి ఈ మాట చెబుతున్నారన్నారు. సిరిసిల్లలో గురువారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను కూడా పక్కన పెట్టారని, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. అన్ని వర్గాల వారినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేస్తే ప్రజలను మళ్లీ మోసం చేయడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రికి చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ని తిట్టవలసిన అవసరం ఏమున్నది? చేతనైతే ప్రజలకు మంచి చేయాలి.. ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని హితవు పలికారు. ప్రతి అంశంలో అడ్డగోలుగా మాట్లాడటం, అబద్ధాలు ఆడటం తప్పించి ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని కేటీఆర్ ఆరోపించారు. జిల్లా కేంద్రాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, అది మంచా, చెడా అన్న విషయాన్ని ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పదేళ్లపాటు ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన పార్టీకి, రెండేళ్ళలో ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఈ ఎన్నికలు అని కేటీఆర్ తెలిపారు. మరోసారి కేసీఆర్‌ని ముఖ్యమంత్రిని చేస్తేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయని, ఈ మున్సిపల్ ఎన్నికలతోనే కేసీఆర్‌ని ముఖ్యమంత్రిని చేసుకునే కార్యక్రమం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో నిలదీయకుంటే, ఇచ్చిన హామీల మోసంపైన ప్రశ్నించకుంటే మరో మూడేళ్లకు జరిగే శాసనసభ ఎన్నికల దాకా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అధికారం, అవకాశం ప్రజలకు రాదని హితబోధ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసేలా ఈ ఎన్నికల్లో ఓటు వేయకుండా ఉండాలని, సురుకు పెట్టకుంటే కాంగ్రెస్ పార్టీ తన మోసాలను కొనసాగిస్తుందని కేటీఆర్ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *