గజ్వేల్ ఘనతను చాటుదాం

– మళ్లీ బీఆర్ఎస్‌నే గెలిపిద్దాం
– మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పిలుపు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధి ప్రదాత అని, గజ్వేల్‌లో బీఆర్ఎస్‌ను మళ్ళీ గెలిపించుకోవాలని ఆ పార్టీ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ’కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండె.. ఇప్ప్పుడు ఎట్లుందన్నది ఆలోచించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజ్ఞాపూర్‌లో జరిగిన భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధిని, రేవంత్‌రెడ్డి వైఫల్యాలను ఎండగట్టారు. మనకు అన్నం పెట్టిన వాళ్లకు, మనకు పని చేసిన వాళ్లకు, మనల్ని మంచిగా చూసుకున్న వాళ్లకే ఓటేయాలి. సద్ది తిన్న రేవు తలవాలి’ అని చెప్పారు. ప్రజ్ఞాపూర్`గజ్వేల్ రోడ్డు అప్ప్పుడు ఎట్లుండె.. ఆ రోజు గజ్వేల్ దవాఖాన పందులకు నిలయంగా ఉండేది. ఈ రోజు 250 పడకల హాస్పిటల్ తెచ్చి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించింది కేసీఆర్. గజ్వేల్‌కు ఆర్డీవో ఆఫీస్, రైలు, అండర్ గ్రౌండ్ డైనేజీ, ఊర చెరువు, పాండవుల చెరువు సుందరీకరణ చేసింది కేసీఆర్.. కళ్యాణ లక్క్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.1,00,116 అందించి మేనమామలా ఆదుకున్నది కేసీఆర్. ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రసవిస్తే కేసీఆర్ కిట్‌తోపాటు రూ.13వేలు అందించిన ఘనత కేసీఆర్‌ది అని చెప్పారు. మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, బీసీ, ఎస్సీ, మైనార్టీ బిడ్డలకు గురుకులాలు స్థాపించి చదువుల విప్లవం తెచ్చారని వివరించారు.

కరోనా కష్టకాలంలో కూడా రైతుబంధు ఆపలేదు

ఒకప్ప్పుడు గజ్వేల్‌లో మూడు రోజులకోసారి నీళ్లు వచ్చే పరిస్థితి పోయి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీళ్లు అందించారన్నారు. రైతుబంధు ఎందుకు వేయలేదు అంటే ఎలక్షన్ అయ్యాక ఇస్తానంటున్నాడు రేవంత్. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతుబంధు ఆపలేదు. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటికి రెండు రైతుబంధులు ఎగ్గొట్టిండు. ఇది మూడోది. మూడు రైతుబంధులు వెంటనే వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కావాలంటే అభ్యంతరం లేదని ఎలక్షన్ కమిషన్‌కు తామే లేఖ ఇస్తామన్నారు. 11వ తేదీలోగా రైతుబంధు వేయకపోతే రైతులు నిన్ను చీల్చి చెండాడుతారు అని హరీష్‌రావు హెచ్చరించారు. రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడే బూతుల పిత. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను రేవంత్ రెడ్డి ఆగం చేస్తుండు అన్నారు. పెన్షన్‌లు, హామీల గురించి అడిగితే ముఖ్యమంత్రి హోదాలో ఉండి లాగుల తొండలు వదులుతా, పేగులు మెడలో వేసుకుంటా అంటాడు.. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి వచ్చానని చెప్ప్పుకునే రేవంత్ బుద్ధి కుక్క తోక వంకర అన్నట్టే ఉంది అని తీవ్రంగా విమర్శించారు. ఆడోళ్లకు ఫ్రీ బస్సు అని మగోళ్లకు డబుల్ టికెట్ కొట్టి కుటుంబాలను తిప్పలు పెట్టారన్నారు. పువ్వు గుర్తు వాళ్ళు ఎన్నడైనా రూపాయి పని చేశారా? అక్షింతలు పంచడం తప్ప ఏమైనా చేశారా.. యాదాద్రి నరసింహ స్వామి గుడి కట్టింది కేసీఆర్.. గజ్వేల్ వెంకటేశ్వర స్వామి గుడి, రామాలయం, శివాలయం అద్భుతంగా కట్టించింది కేసీఆర్.. పనిచేసే వాళ్లకు ఓటేద్దామా.. అక్షింతలు వేసే వాళ్లకు ఓటేద్దామా అని ప్రశ్నించారు. కేసీఆర్ ముస్లిం పిల్లల చదువు కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. షాదీ ముబారక్ ఇచ్చారు.. రేవంత్ రెడ్డి మైనారిటీల కోసం ఒక్క రూపాయి పనిచేశారా అని నిలదీశారు. ఎరువులు ఇచ్చే తెలివి లేదు. చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అని హరీష్‌రావు మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలి.. ఇప్ప్పుడు గెలిచిన కౌన్సిలర్లు ఐదేళ్లు ఉంటారు.. రెండేళ్లలో వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే.. ప్రజ్ఞాపూర్ గౌరవం నిలబడాలంటే బీఆరఎస్ గెలవాలి అని చెప్పారు. ప్రచారంలో వంటేరు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *