– సకల భాషల ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వస్తే ఎందరికో ఉపాధి
– ఫిలిం అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాదును కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సెక్రటేరియట్లో బుధవారం నిర్వహించిన గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. బాంబే, కలకత్తా, చెన్నై వంటి నగరాల్లో సినీ ఇండస్ట్రీ పెరగడానికి అంతగా అవకాశాలు లేవు కానీ దేశంలో ఉన్న అన్ని భాషల ఇండస్ట్రీ హైదరాబాద్ లో విస్తరించడానికి సానుకూల అంశాలు అనేకం ఉన్నాయన్నారు. సకల భాషల సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌కు తరలి వస్తే రాష్ట్ర యువతకు, టెక్నీషియన్లు, రైటర్లు, డైరెక్టర్లకు ఉపాధి లభిస్తుందన్నారు. సినీ ప్రపంచ మార్కెట్‌కు హైదరాబాద్ కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను ప్రభుత్వం తయారు చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం సినిమా రంగానికి సంబంధించిన అవార్డుల విషయం వదిలేస్తే ప్రజా ప్రభుత్వం అవార్డులు ఇచ్చి సినీ రంగాన్ని తిరిగి ప్రోత్సహించడం ప్రారంభించిందని వివరించారు. సమాజం కోసం కళల ద్వారా తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు గద్దర్ అని భట్టి అన్నారు. తెలంగాణ అంటే కళలు, విప్లవం, ప్రశ్నించడం, సున్నిత మనసుతో, ప్రేమానురాగాలతో కూడినదని, తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి గద్దర్ అని పేర్కొన్నారు. అందుకే వారి పేరు మీద గత ఏడాది నుండి సినిమా అవార్డులు ఇవ్వడం ప్రారంభించి సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ, పారదర్శకతలే ప్రమాణంగా సినిమా అవార్డుల ఎంపిక ఉంటుందని, గత ఏడాది జ్యూరీ సభ్యులు అవార్డుల ఎంపికను గొప్పగా నిర్వహించి అభినందనలు పొందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సినీ రంగ ప్రముఖులకు ఉన్న అనుభవాన్ని, నిబద్ధతను, సినిమా రంగం పట్ల వారికున్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫ్డీసీ ద్వారా అందరితో సంప్రదింపులు జరిపి జ్యూరీ సభ్యులుగా ఎంపిక చేశారని, ప్రభుత్వ నుంచి తగు సహకారాన్ని పూర్తిస్థాయిలో అందజేస్తామని తెలిపారు. గద్దర్ అవార్డుకు ఎంపిక చేసే సినిమాలో కమర్షియల్ అంశంతోపాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే రాబోయే రోజుల్లో మంచి సినిమాలను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈనెల 6 నుంచి అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఉగాది పండగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంక, ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్‌బాబు, సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, రామారావు, రోజా రమణి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





