అప్పుడు అరాచకం.. ఇప్పుడు ఆరాటం

– గత పాలకుల నిర్లక్ష్యంపై మంత్రి పొంగులేటి నిప్పులు
– పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత నాదే
– ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం

ఏదులాపురం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: గత పాలకులు పేదల సొంతింటి కలను పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారని, ఆనాడు అర్హులైన వారికి స్థలాలు ఇవ్వకుండా వంచించారని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. నాడు నిరుపేదల గురించి పట్టించుకోకుండా అరాచకంగా వ్యవహరించిన వారు నేడు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఆరాటపడుతున్నారని ధ్వజమెత్తారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 9, 12, 13 వార్డుల్లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో మంత్రి పొంగులేటి ప్రజలకు కీలక భరోసా ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని కూడా తానేనని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అర్హులైన ప్రతి నిరుపేదకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాటిలో ఇందిరమ్మ ఇళ్లు కూడా కట్టించి ఇచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఏప్రిల్ నుంచి వరుస విడతల్లో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు విశ్రమించనని హామీ ఇచ్చారు.

సంక్షేమ పథకాలతో పేదల చెంతకు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం వంటి పథకాలతో పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి వివరించారు. ఏదులాపురం మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని, వార్డుల్లో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రైన్ల పనులను వేసవి లోపే పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. తనను అసెంబ్లీ ఎన్నికల్లో దీవించినట్టే ఏదులాపురం మున్సిపాలిటీ బరిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మంత్రి పొంగులేటి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *