– కాంగ్రెస్ అరాచక, అవినీతి పాలనపై బీజేపీ చార్జిషీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలు, అమలు కాని హామీలు, విస్తరిస్తున్న అవినీతి అరాచకాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీజేపీ రాష్ట్ర శాఖ పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజలకు చేసిన మోసాలను ఎండగడుతూ బూటకపు హామీలు – మోసపూరిత వాగ్దానాలు పేరిట చార్జిషీట్‌ను విడుదల చేసింది. దీనిని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, మహారాష్ట్ర మంత్రి, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి అశిష్ షెలార్, పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికల కో-ఇన్చార్జిలు అశోక్ పర్ణామి, ఎంపీ ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్.గౌతం రావు, ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్చార్జి ఎన్.వి.సుభాష్, సీనియర్ నాయకులు జి.వెంకట్ రెడ్డి, సునీత, విఠల్ కప్పర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420కి పైగా హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ఘోరంగా మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులే లేవని, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా మోసపోయారని తెలిపారు. డీఏ, పీఆర్సీ, హెల్త్ కార్డులు అమలు చేస్తామని ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని, నగదు రహిత వైద్యం పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లకు కూడా సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు హామీ గాలిలో కలిసిపోయిందని, ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక, ఆరోగ్య భద్రత లేకుండా అనిశ్చితిలోకి నెట్టబడ్డారని పేర్కొన్నారు.రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. భూభారతి చట్టం రైతులను కొత్త సమస్యల్లోకి నెట్టిందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వేల కోట్లకు చేరాయని, విద్యా భరోసా కార్డులు, బస్తీల్లో పాఠశాలల నిర్మాణం, గదుల ఏర్పాటు వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కొత్త నియామకాలు లేకుండా పాత నోటిఫికేషన్లకే నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలిచ్చామని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, అన్ని మున్సిపాలిటీల్లో 100 పడకల ఆసుపత్రులు, ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ, ప్రసూతి ఆసుపత్రుల ఏర్పాటు హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. కార్మికులు, యువతకు ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని తెలిపారు. రిజర్వేషన్లు, కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం, అసైన్డ్ భూములు, పోడు పట్టాల సమస్యలు పరిష్కరించడంలోనూ విఫలమైందని తెలిపారు. సామాజిక న్యాయం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. మున్సిపాలిటీల్లో పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని రామచందర్ రావు విమర్శించారు. గత పదేళ్లు ప్రజలను వంచించిన బీఆరఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా నడుస్తోందని ఆరోపించారు. మున్సిపాలిటీల్లో సుమారు రూ.2,500 కోట్ల మేర కుంభకోణం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూనే రెండున్నరేళ్లుగా అభివృద్ధి, మౌలిక వసతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ప్రాణాధారంగా మారిందన్నారు. మతోన్మాదులు ఆలయాలపై దాడులు చేస్తే వారిని పిచ్చివారిగా చూపించి ఈ ప్రభుత్వం వదిలివేస్తోందని మండిపడ్డారు. హిందూ దేవాలయాల భూములు కబ్జాలకు గురవుతున్నాయని, ఆక్రమణకు పాల్పడిన వారిలో పలువురు అధికార పార్టీ నాయకులు కూడా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో హోంమంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యాశాఖ వంటి కీలక శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయని, అయినప్పటికీ ఈ శాఖలన్నీ పూర్తిగా ఫెయిల్ అయ్యాయని రాంచందర్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి కూడా పాలనలో విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. బొగ్గు కుంభకోణాలు, టెండర్లలో అక్రమాలు జరుగుతున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. గత బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన ఘటనలను ప్రస్తావిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని రామచందర్‌రావు విమర్శించారు. మాటకు కట్టుబడి ప్రజల పక్షాన నిలబడేది బీజేపీ ఒక్కటేనని అన్నారు. సేవ్ తెలంగాణ – ఓట్ ఫర్ బీజేపీ’ నినాదంతో ప్రజలంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. న మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అవినీతిరహిత, అభివృద్ధి దిశలో పాలన అందించే కమలం గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




