– ప్రజల సమస్యలు పరిష్కరించేది బీజేపీయే
– బీఆరఎస్ బాటలోనే పయనిస్తున్న కాంగ్రెస్
– ఎలఆరఎస్ దరఖాస్తుల సమస్య పరిష్కరించాలి
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: గత ఎంపీ, ఎమ్మెల్సీ, సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమ పార్టీ పట్ల చూపిన విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి స్థానంలో పోటీ చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 2,996 వార్డులు, డివిజన్లలో బీజేపీ వంద శాతం స్థానాల్లో పోటీకి నామినేషన్లు వేసినట్లు వివరించారు. అభ్యర్థులకు బీ-ఫారమ్ కూడా పంపామన్నారు. బ్యాలెట్ పేపర్లలో తమ అభ్యర్థులకు కమలం గుర్తు ఉంటుందన్నారు. బీజేపీ ప్రజల సమస్యలను పరిష్కరించి, బలమైన నాయకత్వాన్ని చూపిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడటం ఖాయమని రామచందర్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్
బీఆర్ఎస్ దోవలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని, రెండు పార్టీలు కుంభకోణాలు, అవకతవకలకు పాల్పడి ప్రజల నమ్మకాన్ని వమ్ముచేశాయని ఆరోపించారు. మున్సిపాలిటీలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఎల్‌ఆర్ఎస్ లక్షలాది ప్రజలను బాధపెట్టిందన్నారు. దాదాపు 25.67 లక్షల దరఖాస్తులపై ప్రభుత్వానికి రూ.250 కోట్ల ఆదాయం వచ్చిందని, కానీ, ప్రజలకు అందిన లాభం 10% మాత్రమేనని తెలిపారు. న్యాయపరమైన సమస్యలు, బకాయిల కారణంగా స్కీమ్ నిలిపివేశారన్నారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 20% మాత్రమే ఫీజులు ప్రభుత్వానికి సమర్పించేలా చేసిందని, అయినా ఎల్‌ఆర్ఎస్ అమలు కాలేదని చెప్పారు. 15 రోజుల్లో రెగ్యులేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని, ప్రజలకు న్యాయం చేయాలని, ఫీజులు వసూలైనప్పటికీ అమలు కాని సమస్యలను వెంటనే పరిష్కరించాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. 20 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఇది కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎల్‌ఆర్ఎస్ ఫీజు రద్దు చేసి ప్రజలకు డబ్బులు వాపస్ చేయాలని, ప్రొసీడింగ్స్ పూర్తి కాని దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, పేద, మధ్యతరగతి కుటుంబాలపై వేసిన ఫీజులు, 10% మార్కెట్ ధర రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు న్యాయం చేయాలన్నారు. కాగా, రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలోనూ పాలన సరిగ లేదన్నారు. కాల్పులు, అత్యాచారాలు, డ్రగ్స్, దొంగతనాలు వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ప్రజలకు చిన్న అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు సరైన రీతిలో అందడం లేదన్నారు. నల్గొండలో గతంలో తమ పార్టీ నాయకులు మున్సిపల్ చైర్మన్‌గా విజయం సాధించారని, బోనగిరిలో కూడా వైస్ చైర్మన్‌గా గెలిచామని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో కొన్ని సీట్లు దగ్గరగా ఓడినా ఇది తమకు బలహీన ప్రాంతం కాదని స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్.వి.సుభాష్, సీనియర్ నాయకులు ఆంటోని, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ విజయమే లక్ష్యం కావాలి
రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్‌లో బీజేపీ విజయమే లక్ష్యం కావాలని రామచందర్‌రావు పార్టీ ఇన్‌చార్జిలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లోకి వెళ్లే ప్రచార విధానం, సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎలక్షన్ ఇన్‌చార్జిల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ప్రజల సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన, అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం పోరాడుతున్నదని చెప్పారు. తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని ఆయన అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





