– పోలీసుల అత్యుత్సాహం ఎవరి కోసం??
– తెలంగాణ తెచ్చిన పెద్దాయననే అవమానిస్తారా
– ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ‘సిట్’ రెండోసారి ఇచ్చిన నోటీసును నందినగర్‌లోని ఆయన నివాసం గోడకు అతికించడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ’ఎక్స్’ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై ఈ దుర్మార్గపు వైఖరి ఏంటని నిలదీశారు. కేసీఆర్ స్వయంగా తానుంటున్న నివాసం చిరునామాతో పోలీసులకు సమాధానం ఇచ్చిన తర్వాత కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గోడకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణమన్నారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటన్నారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దే విచారించాలన్న నిబంధనను కూడా పోలీసులు అతిక్రమిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అసలు పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా అని ప్రశ్నించారు. లేదా ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మల్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం, న్యాయంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అక్రమ కేసులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి చేస్తోన్న ప్రతి తప్పుడు పనిని ప్రజల ముందు పెడతామని, సమయం వచ్చినప్ప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. కాగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘సిట్’ అధికారులు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





