– వివిధ శాఖల అధికారులకు మార్గదర్శకాల జారీ
– మూడు రోజులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30 : తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాల మేరకు అన్ని ప్రభుత్వ విభాగాలకు దిశానిర్ధేశం చేసేందుకు మూడు రోజులుగా విభాగాల వారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సమీక్ష నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, సహకార, పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్య, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక, ఆహార, పౌర సరఫరాల, కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, జి.ఎ.డి సర్వీసెస్ శాఖలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్షించారు. వ్యవసాయ శాఖకు సంబంధించి రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణ విజన్ 2047 కార్యాచరణ ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవాలని, భవిష్యత్ లో యూరియా, ఎరువుల పంపిణీని ఐటి ఆధారిత సేవల ద్వారా పటిష్టంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హార్టికల్చర్ శాఖలలో అమలవుతున్న పథకాలపై సమీక్షించారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్, ప్రజల అవసరాల మేరకు పండ్లు, కూరగాయల పెంపకం విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం హైబ్రిడ్ మోడ్ లో భాగంగా చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోహెడ మార్కెట్ నిర్మాణ పనులపై సమీక్ష చేశారు. రైతుల సంక్షేమం, పంటల దిగుబడి, రైతు సమస్యల పట్ల వ్యవసాయ శాఖ నిరంతర మానిటరింగ్ చేయాలని, డిజిటల్ క్రాప్ సర్వే కూడా నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ రంగం ప్రస్తుత స్థితిగతులు, రైతులకు అందుతున్న సేవలు, సాగునీటి లభ్యత, విత్తనాలు, ఎరువుల సరఫరా, పంటల దిగుబడి, అలాగే సహకార శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. రాబోయే సాగు కాలానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు తగినంతగా అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సి.ఎస్ ఆదేశించారు. సహకార సంఘాల పనితీరు, రైతు సహకార సంఘాల ఆర్థిక స్థితి, రుణాల పంపిణీ పై సమీక్ష చేశారు. సహకార సంఘాలను మరింత పటిష్టం చేసి రైతులకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, సమస్యలు ఎదురైనచోట పరిష్కరించాలని సి.ఎస్ స్పష్టం చేశారు.
పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్య శాఖలపై సమీక్షలో పశుసంవర్ధక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, డెయిరీ రంగంలో ఉత్పత్తి పెంపు, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడంపై చేపట్టిన కార్యక్రమాలు, మత్స్యశాఖ ద్వారా మత్స్యకారుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల పురోగతిని ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. పశువైద్య సేవలను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, పశు ఆరోగ్య శిబిరాల నిర్వహణను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. డెయిరీ అభివృద్ధి అంశంలో పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాలని, చిన్న, సన్నకారు పాడి రైతులకు లాభదాయకంగా ఉండే విధంగా విధానాలు రూపొందించాలన్నారు. సహకార డెయిరీ సంస్థల పనితీరును మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. చేపల ఉత్పత్తి పెంపు, చెరువులు, కుంటలు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, మిడ్ మానేరు, పాలేరు తదితర జలాశయాల్లో చేపల పెంపకంపై కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. మత్స్యకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, మత్స్యకారుల సంక్షేమ పథకాలు సమయానికి లబ్ధిదారులకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండేలా పనిచేయాలని స్పష్టం చేశారు.
పర్యావరణం, అటవీ, కాలుష్య నియంత్రణ మండలికి చెందిన శాఖల వారీగా అమలు చేస్తున్న పథకాలు, పురోగతి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై సి.ఎస్ సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపు, జీవ వైవిధ్య సంరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావం తగ్గింపు దిశగా చేపడుతున్న చర్యలపై అధికారులు సి.ఎస్ కు వివరించారు. అటవీ శాఖ పరిధిలో అటవీ సంరక్షణ, అటవీ ఆధారిత జీవనోపాధి కార్యక్రమాలు, అటవీ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ-గవర్నెన్స్, తెలంగాణ విజన్ 2047, పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టుల వేగవంతం, శాఖల మధ్య సమన్వయం పెంచుకుని ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత కాలంలో సాధించాలని తెలిపారు. కవ్వాల్, అమ్రాబాద్, టైగర్ రిజ్వర్వ్ ప్రాంతాల సమస్యలపై సమీక్షించారు. కంపా నిధుల వినియోగం, హరిత నిధి, ఎకో టూరిజం, గ్రీన్ కవర్, ట్రెక్ పార్క్ లో, అర్బన్ పార్కులు తదితర అంశాలపై సమీక్షించారు. పౌర సరఫరాల శాఖపై సి.ఎస్ సమీక్షిస్తూ శాఖ పరిధిలో అమలవుతున్న వివిధ పథకాలు, ప్రజలకు అందుతున్న సేవలు, సరఫరా వ్యవస్థ పనితీరు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, లబ్ధిదారులకు సన్న బియ్యం, గోదాముల్లో నిల్వలు, రేషన్ దుకాణాల పనితీరు, ఈ-పాస్ యంత్రాల వినియోగం, ఆహార భద్రత చట్టం అమలు, రేషన్ కార్డుల జారీ అంశాలపై సమీక్షించారు. కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపాధి కల్పన లక్ష్యంగా చేపడుతున్న శిక్షణ కార్యక్రమాలు పరిశ్రమల అవసరాలకనుగుణంగా ఉండాలని, యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎటిసి, ట్రిపుల్ ఐఐటీ, ఐటీఐలు, కృషి విజ్ఞాన కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని, ప్రైవేట్ రంగంతో సమన్వయం పెంచాలని అన్నారు. యువతకు స్కిల్స్ అప్ గ్రేడింగ్ కార్యక్రమాలు నిర్వహించి విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,నర్సింగ్ కోర్సుల ద్వారా యువతకు విదేశాలలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. తదుపరి సాధారణ పరిపాలన శాఖ పై సమీక్ష నిర్వహించారు. రాజ్యాంగ బద్ధమైన సంస్థల స్థితిగతులు, పెండింగ్ డిసిప్లినరీ కేసులు, కార్యాలయాల లభ్యత, జనగణన, పెండింగ్ ఆడిట్ వివరాలు, పరిపాలన సంబంధ విషయాలపై సమీక్షించారు. సమీక్షలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు దాన కిషోర్, బిఎండి ఎక్కా, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పిసిసిఎఫ్ సువర్ణ, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఇలంబర్తీ, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, మత్స్యశాఖ కమిషనర్ నిఖిల, హర్టీకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, ఇ.శ్రీధర్, డైరెక్టర్ సెన్సెస్ భారతీ హోళికేరి, ఐటి శాఖ ప్రత్యేక కార్యదర్శి భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





