– ఈ ప్రాంతంవాడితోనే రాష్ట్రానికి ద్రోహం
-మరో చారిత్రక ద్రోహానికి పాల్పడుతున్న కాంగ్రెస్
– ప్రణాళికా బద్ధంగా ఏపీకి సహకరిస్తున్న రేవంత్
– గురుదక్షిణ కింద జలదోపిడీకి ఏపీకి రెడ్ కార్పెట్
– ప్రభుత్వంపై విరుచుకుపడ్డ హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: రాష్ట్రానికి జల ద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అయితే పొడిచేది రేవంత్ రెడ్డి అని హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. కాళోజీ ముందే ఊహించి చెప్పినట్లు ప్రాంతంవాడే తెలంగాణకు చేస్తున్న ద్రోహం ఇదన్నారు. దిల్లీ కేంద్రంగా రాష్ట్రానికి జరుగుతున్న జల ద్రోహాన్ని వివరించేందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టామని తెలిపారు. ఒకవేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుందన్నారు. గోదావరి నదీ జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ మొదటి నుండి అప్రమత్తం చేస్తూనే వస్తుంది. గతంలో అనేకసార్లు ప్రెస్ మీట్ పెట్టినం. వాస్తవాలు బయట పెట్టినం. అది బనకచర్ల అయినా, నల్లమల సాగర్ అయినా మారింది పేరు మాత్రమే.. కానీ ఏపీ జల దోపిడి ఆగలేదు. సమైక్య పాలనలో మనకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్.. నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నదన్నారు. ఈరోజు డిల్లీలో జరుగుతున్న ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా రేవంత్ ప్రభుత్వం మరణ శాసనం రాయబోతున్నదన్నారు. పోలవరం నల్లమల సాగర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తున్నదని ఆరోపించారు. ఆ కుట్రల తీరు గమనిస్తే, పోను పోను అనుకుంటూనే రేవంత్ రెడ్డి ఆనాడు డిల్లీ మీటింగ్ కు వెళ్ళాడు. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపారు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాల హక్కులను కాలరాసాడు. వేయను అంటూనే కమిటి వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేశాడు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీం కోర్టు కు వెళ్ళి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపాడు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్ కు మద్దతు ప్రకటించాడు. దానికి వాపస్ తెచ్చుకున్నడు ఉత్తం కుమార్‌రెడ్డి. ప్లాన్డ్ గా సహకరిస్తూ చంద్రబాబుకు రేవంత్ గురు దక్షిణ చెల్లిస్తున్నడని ఆరోపించారు. ఏపీ ఒత్తిడితో జరుగుతున్న మీటింగ్ లో నేడు ఇంజినీర్లు పాల్గొంటున్నారు. పేరుకు జలవివాదాల మీటింగ్ కానీ మన 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ ప్రాజెక్టు సంబంధించిన కుట్ర ఇది. ఇలాగే గతంలో కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ ఈ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా ముందుపెట్టింది. ఇప్పుడు కూడా ఏపీ నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చి చర్చ చేస్తున్నరన్నారు. బిఆర్ఎస్ నిలదీస్తే డిసెంబర్ 30న నేను ఉత్తరం రాస్తే తెల్లారి ఒక మీటింగ్ రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ఏముంది.. ఏపీ నల్లమల సాగర్ విషయంలో ముందుకు పోతుంది, డిపిఆర్ ప్రక్రియ ముందుకు పోతుంది అని స్పష్టంగా రాసింది. దీంతోపాటు ఇంకేం రాసారు.. రెండు కండీషన్లకు ఒప్పుకుంటేనే ఢిల్లీ మీటింగ్ కు వస్తం అన్నరు. మొదటి కండీషన్ ఏమిటంటే నల్లమల సాగర్ కు డిపిఆర్ వెంటనే ఆపాలి, కేంద్రం అనుమతుల ప్రక్రియను తక్షణం ఆపాలి అని.. రెండోది.. ప్రీ ఫీజబులిటి రిపోర్టు ఆపినట్లు ఏపీ హామి ఇవ్వాలని రాసారు. నా ప్రశ్న ఏమిటంటే ఈ రెండు కండీషన్లకు కేంద్రం హామి ఇచ్చిందా? ఏపీ హామి ఇచ్చిందా? నీ అప్రువల్ తోనే లెటర్ పోయింది కదా ఉత్తం.. ఎందుకు హామీ లేకుండా పాల్గొంటున్నారు? తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోడు.. మీరైనా ఎందుకు పట్టించుకోరు ఉత్తం రెడ్డి అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ సోయి వున్న ఇంజినీర్లు దొరకలేదా?
ఈ మీటింగ్ కు వెళ్లేది ఆదిత్యనాథ్. గతంలో 9వ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్న ఆదిత్యనాథ్ దాస్, కాళేశ్వరం, గోదావరి, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టు, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, చనాక కొరటా, రామప్ప డైవర్షన్ లు అన్నీ అక్రమ ప్రాజెక్టులు, వీటిని నిలిపివేయాలని చెప్పాడు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తిని మీటింగ్ కు పంపడం అంటే తెలంగాణకు ద్రోహం చేయడానికే కదా? తెలంగాణ సోయి ఉన్న ఒక్క ఇంజినీర్ దొరకలేదా? పోను పోను అంటూనే మీటింగ్ లకు అటెండ్ అవడం అంటే ఏమిటి? తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్ప చెప్పడమే మీ చర్చల లక్ష్యమా? కేసీఆర్ గోదావరిలో 400 టిఎంసీలు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చారు. గోదావరి మీద 10 డిపిఆర్ లు పంపి 7 ప్రాజెక్టులకు అనుమతులు సాధించారు. రెండేళ్లలో ఒక్క డిపిఆర్ పంపింది లేదు, ఒక్క అనుమతి తెచ్చింది లేదు. వార్దా, కాళేశ్వరం మూడో టిఎంసీలకు సగం అనుమతులు వస్తే, పూర్తి చేయకుండా డీపీఆర్ లు వాపస్ చేసింది. రేవంత్ రెడ్డి పాలనలో డిపిఆర్ లు వాపస్ వచ్చిన పరిస్థితి. మన డిపిఆర్ లు వాపస్ తెచ్చుకుంటవు, నల్లమల సాగర్ కు జెండా ఊపుతవు. అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి నిన్ను తెలంగాణ సమాజం క్షమించదన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ఒత్తిడితో కేంద్రం నిర్వహిస్తున్న ఈరోజు ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు పెట్టిన కండీషన్లకు వచ్చిన సమాధానం బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి.. నీ గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణను సాధించిన బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. నీ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తెలంగాణ నీటి హక్కుల కోసం మరో పోరాటం చేస్తం. కేసీఆర్ పాలన గురించి ఎకనామిక్ సర్వే రిపోర్టే స్పష్టం చేసింది. తెలంగాణ అద్బుతమైన ప్రగతి సాధించింది. రెండు కోట్ల 20లక్షల ఎకరాల మాగాణిగా మారింది. కాళేశ్వరం, మిషన్ కాకతీయ ద్వారా అద్బుతమైన ఆయకట్టు వచ్చింది. కాళేశ్వరం ద్వారా 17 లక్షల 823 ఎకరాల స్థిరీకరణ, మిషన్ కాకతీయ ద్వారా పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు సాధ్యమైంది. 32 లక్షల ఎకరాల ఆయకట్టు బిఆర్ఎస్ సాధించింది. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పటికైనా నోరు పారేసుకోవడం మంచిది కాదు. కేంద్రంలోని మీ ప్రభుత్వమే తెలంగాణ ప్రగతి పథాన్ని వివరిచిందని గుర్తుచేశారు. కళ్లు తెరవండి అనవసరంగా బిఆర్ఎస్ మీద నోళ్లు పారేసుకోకండన్నారు. మేమేమో తెలంగాణకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే, రేవంతు ఏపీకి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేసిండు. నీటిని ఒడిసి పట్టింది కేసీఆర్ విడిచి పెట్టింది రేవంత్! సోయి లేని రేవంత్ నల్లమల సాగర్ కు జెండా ఊపుతున్నడు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మీటింగ్ బాయికట్ చేయాలి. ఢిల్లీకి, దావోస్ కు తిరగడమే తప్ప పాలన మీద దృష్టి లేదు. బిఆర్ఎస్ సేద్యంపై దృష్టి సారిస్తే, రేవంత్ చోద్యం చూస్తున్నడని ఎద్దేవా చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




