అధికారులు సమన్వయంతో పనిచేయాలి

– వివిధ విభాగాల వారీ సమీక్షలో సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్, జనవరి 29 : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఇంధన, వైద్య ఆరోగ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, మైన్స్, టిజిఐఐసి, భారత ఫ్యూచర్ సిటీ, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మూసీ సుందరీకరణ, హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ తదితర శాఖల పనితీరుపై విభాగాల వారీగా రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంధన విభాగ స‌మీక్ష‌లో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, టీజీ ట్రాన్స్‌కో, టీజీ జెన్‌కో, టీజీ ఎస్‌పిడిసిఎల్, టిజి ఎన్‌పీడీసీఎల్ విభాగాలలో కొనసాగుతున్న ప్రతిపాదిత ప్రాజెక్టుల పురోగతి, అలాగే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ప్రాజెక్టుల అమలులో నిర్ణీత కాలపరిమితులను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో విద్యుత్ రంగంలో అమలవుతున్న విధానాన్ని పరిశీలించి మన రాష్ట్రంలో కూడా వివిధ డిస్కంలలో అమలు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇ-గవర్నెన్స్, తదితర అంశాలు, అండర్ గ్రౌండ్ కేబులింగ్, విజన్ 2047 లక్ష్యాలు, గ్రేటర్ హైదరాబాద్ భవిష్యత్ విద్యుత్ అవసరాల మేరకు ప్రతిపాదించిన చంద్రవెళ్లి, రాయదుర్గం, షాద్‌నగర్, పరిగిలో విద్యుత్ సబ్ స్టేషన్ల పనుల పురోగతిపై సీఎస్ సమీక్షించారు.

వైద్య ఆరోగ్య శాఖ

వరంగల్, ఆల్వాల్, సనత్‌నగర్, ఎల్‌బి నగర్, న్యూ ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రి విస్తరణ, పలు ప్రాంతాలలో నిర్మితమవుతున్న ప్రభుత్వ హాస్పిటల్స్ భవనాల పురోగతి, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యత, వైద్య సదుపాయాల లభ్యత, మౌలిక వసతుల అభివృద్ధి, మందుల సరఫరా, వైద్య శాఖలో నర్సింగ్, వైద్యుల నియామకాలు, ఉద్యోగులకు సంబంధించిన ఈహెచఎస్, వైద్య పరికరాల సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎస్ ఆదేశించారు. లక్ష్యాల సాధనలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హాస్పిటల్స్‌ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్‌లు, ఇతర నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచించారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, మైన్స్, టిజిఐఐసి

ఐటీఈడీసీ శాఖలో ప్రస్తుత కార్యకలాపాలు, కొనసాగుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై అధికారులు సీఎస్‌కు వివరించారు. డిజిటల్ గవర్నెన్స్, ఐటీ పెట్టుబడుల ఆకర్షణ, స్టార్టప్ ఎకో సిస్టం అభివృద్ధి, ఈ-గవర్నెన్స్ సేవల విస్తరణ, సైబర్ సెక్యూరిటీ, రాష్ట్రంలో ఉన్న 12,751 గ్రామ పంచాయతీలలో టి-ఫైబర్ విస్తరణపై సమీక్షించారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ సేవలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించే దిశగా చర్యలు తీసుకోవాలని, వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఐటీ సేవలను ప్రజలకు సులభతరంగా అందించేందుకు వాట్సాప్ రూపొందించాలని సూచించారు. మైన్స్ శాఖలో ఇసుక సరఫరాపైౖ సాండ్ రీచ్‌లలో ఏర్పాటు చేసిన కెమెరాల ఏర్పాటు, ఇటీవల చేపట్టిన సంస్కరణలపై అధికారులు సీఎస్‌కు వివరించారు. భారత ఫ్యూచర్ సిటీ, టిజి ఐఐసి చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించారు. ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మూసీ సుందరీకరణ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ విభాగాలలో చేపట్టిన ప్రాజెక్టులపై సీఎస్ సమీక్షించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్ రంజన్, సంజయ్ కుమార్, నవీన్ మిట్టల్, మైన్స్ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, హెచ్ యం.డి.ఎ. కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, మున్సిపల్ పరిపాలన కార్యదర్శి టి.కె.శ్రీదేవి, టిజి ట్రాన్స్‌కో సిఎండి కృష్ణ భాస్కర్, టిజి ఎస్పిడీసీల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కమిషనర్ శశాంక, హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్, ఐటి ప్రత్యేక కార్యదర్శి భవేష్ మిశ్రా, టిజి ఎన్.పి.డి.సి.ఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ ఎండీ ఆశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *