– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఈరోజు బీజేపీ¾లో పెద్దఎత్తున చేరికలు జరిగాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు పెద్దఎత్తున బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో పెద్దఎత్తున జూనియర్ న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, వారి బంధుమిత్రులు చేరడం సంతోషకరమని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ కాలం నాటి చెల్లని చట్టాలను భారతీయ పద్ధతికి అనుగుణంగా మార్చిందని వెల్లడించారు. న్యాయ వ్యవస్థలో వేగవంతమైన అభివృద్ధిని చూసి అడ్వకేట్లు, సమాజం దీనిని స్వాగతించారని గుర్తుచేశారు. పెండింగ్ కేసులు పరిష్కరించడం, ఖాళీగా ఉన్న జడ్జి పోస్టులను వేగవంతంగా భర్తీ చేయడం మోదీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 150మంది యువ న్యాయవాదులు, ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్లతోపాటు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌లో అవకాశం పొందారని తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయని, బీజేపీ అన్ని సీట్లలో పోటీ చేస్తుందని, ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే పార్టీ లక్ష్యమని రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్రంలో బీఆరఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాయని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు.. ఏ వర్గానికీ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య కలహాలు, కాంట్రాక్టర్లు, కమీషన్ వ్యవస్థ రాష్ట్రంలో విస్తరించిందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి పునాది వేస్తామన్నారు. ‘సేవ్ తెలంగాణ-ఓట్ ఫర్ బీజేపీ’ నినాదం ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మేధావులు ముందుకు రావాలని, విద్య, ఉద్యోగాలు, రైతు సంక్షేమంపై ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణను అభివృద్ధి రాష్ట్రంగా మార్చగలిగేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





