– వనదేవతల జాతరలో తొలి అంకం పూర్తి
– గద్దెపైకి చేరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు
– రేపే అసలు ఘట్టం
– చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి ఆగమనం..
– లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనం
మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28: ములుగు, ప్రజాతంత్ర , జనవరి 28:మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం అభయారణ్యం జనసంద్రంగా మారింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పిలువబడుతున్న మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతరకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు జరిగే మహా జాతరలో బుధవారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లిని ఆదివాసి గిరిజన సంప్రదాయాల ప్రకారం కోయ పూజారులు గద్దెపైకి తీసుకువచ్చారు . తల్లిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజు రాజును మహబూబ్ నగర్ జిల్లా గంగారం మండలం పూస గుండ్ల నుంచి, గోవిందరాజులను ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కన్నాయిగూడెం మండలం కొండాయి నుంచి గిరిజన పూజారులు సంప్రదాయపద్ధంగా తీసుకువచ్చి గద్దెలపై కి తీసుకువచ్చారు. దీంతో జాతరలో తొలి ఘట్టం విజయవంతంగా ముగిసింది.
రేపు సమక్క ఆగమనం
మేడారం మహా జాతరలో మరో కీలక ఘట్టం గురువారం సాయంత్రం జరగనుంది. సమీపంలోని చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని కోయ పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో భారీ బందోబస్తు మధ్య గద్దెలపైకి తీసుకువస్తారు. సమ్మక్క వచ్చే దారిలో భక్తులను అదుపు చేయడం కీలకం. శుక్రవారం రోజున సమ్మక్క సారలమ్మ తల్లులు కొలువై ఉండడంతో భక్తజనులు దర్శించుకుని తరిస్తారు. శనివారం సాయంత్రం సమ్మక్క, సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.
సంస్కృతికి ప్రతీకగా మేడారం జాతర

తెలంగాణ సంస్కృతి, గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా మేడారం మహా జాతర నిలుస్తోంది. భక్తుల రద్దీ దృష్ట్యా జాతరకు ముందే లక్షలాదిగా తల్లులకు మొక్కులు సమర్పించారు. నాలుగు రోజుల మహా జాతరలో కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి మేడారం చేరుకున్న భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన బెల్లం(బంగారం) మొక్కుగా చెల్లించుకుంటున్నారు. తలనీలాలు సమర్పించి కోరిన కోరికలు తీర్చాలని తల్లులను వేడుకుంటున్నారు. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. నూతనంగా ఏర్పాటు చేసిన గద్దెలపై అమ్మవార్లను భక్తులు దర్శించుకోనున్నారు. ఇప్పటికే ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, వివిధ రకాలైన వాహనాలలో తరలివచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కనిపిస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



