పద్మశ్రీ అంకె గౌడ: బస్ కండక్టర్ నుంచి “గ్రంథాలయ విప్లవకారుడు” ..

“నేను చనిపోయినా, నా పుస్తకాలు బ్రతికి ఉండాలి.. అవి సమాజానికి వెలుగునివ్వాలి” అనేదే అంకె గౌడ   ఆశయం. సమాజం కోసం ఏదో చేయాలని తపించే వారికి ఆయన జీవితం ఒక గొప్ప పాఠం. ఒక సామాన్య వ్యక్తి అసామాన్యమైన కృషి చేస్తే ప్రపంచమే ఆయన వైపు చూస్తుందని అంకె గౌడ నిరూపించారు…: “
నిజమైన విప్లవాలు చాలా సార్లు మౌనంగా జరుగుతాయి. పెద్ద వేదికలు, పెద్ద ప్రకటనలు లేకుండానే సమాజాన్ని మార్చే వ్యక్తులు ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు పద్మశ్రీ అవార్డు గ్రహీత అంకె గౌడ. వృత్తిగా ఒక సాధారణ బస్ కండక్టర్, కానీ ఆలోచనలతో ఒక సాంస్కృతిక ఉద్యమకారుడు.ఈ రోజుల్లో మొబైల్ ఫోన్, రీల్స్, షార్ట్ వీడియోల ప్రపంచంలో పుస్తకాలు కనుమరుగవుతున్న సమయంలో, 20 లక్షల (2 మిలియన్) పుస్తకాలతో ఒక ఉచిత గ్రంథాలయాన్ని నిర్మించిన అసాధారణ  వ్యక్తి అంకె గౌడ.

జ్ఞానం అనేది పంచే కొద్దీ పెరుగుతుంది అంటారు. కానీ ఆ జ్ఞానాన్ని భద్రపరిచి, భావి తరాలకు ఉచితంగా అందించడం కోసం తన జీవితాన్నే ధారపోసిన మహనీయుడు అంకె గౌడ. కర్ణాటకలోని మాండ్య జిల్లా, పాండవపుర తాలూకాకు చెందిన ఈయన, నేడు ‘పుస్తక ప్రేమికుల కాశీ’గా పిలవబడే ‘పుస్తక మనె’ స్థాపకుడు.

 ఆరంభం: ఒక చిన్న అలవాటు.. ఒక పెద్ద లక్ష్యం
అంకెగౌడ  ప్రయాణం చాలా సామాన్యంగా మొదలైంది. ఆయన కెరీర్ తొలినాళ్లలో బస్సు కండక్టర్‌గా ఉండేవారు. ఆ తర్వాత పాండవపుర షుగర్ ఫ్యాక్టరీలో టైమ్ కీపర్‌గా చేరారు. ఉద్యోగ రీత్యా ఆయనకు వొచ్చే జీతం చాలా తక్కువ. కానీ ఆయనకు పుస్తకాలంటే ప్రాణం. బస్సులో ప్రయాణికులు వదిలేసిన పాత పుస్తకాలు, దినపత్రికలు సేకరించడం ఆయన అలవాటు. పాత సామాన్ల షాపుల దగ్గరకు వెళ్ళి, అక్కడ కిలోల లెక్కన అమ్మే పాత పుస్తకాలను తన జీతం డబ్బులతో కొనేవారు.  రాత్రిపూట అందరూ నిద్రిస్తున్న వేళ, ఆయన దీపం వెలుగులో ఆ పుస్తకాలకు బైండింగ్ చేస్తూ, వాటిని భద్రపరిచేవారు.
 ‘పుస్తక మనె’ – అక్షరాల అద్భుత లోకం 

గౌడ  సేకరించిన పుస్తకాలు వేల నుంచి లక్షలకు చేరాయి. వాటిని భద్రపరచడానికి తన సొంత ఇల్లు సరిపోకపోవడంతో, ఆయన ఒక గ్రంథాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ లైబ్రరీలో 20 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఇందులో సాహిత్యం, విజ్ఞానం, చరిత్ర, ఆధ్యాత్మికం మరియు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ వంటి దాదాపు 20 భాషల పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి.  1834 నాటి బైబిల్ ప్రతి, కొన్ని వందల ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాలు, మైసూరు మహారాజుల కాలం నాటి రికార్డులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
నిస్వార్థ త్యాగం: ఆస్తి మొత్తం అక్షరాలకే..
అంకెగౌడ  త్యాగం వర్ణనాతీతం. గ్రంథాలయ నిర్మాణం కోసం మరియు పుస్తకాల నిర్వహణ కోసం ఆయన తన సర్వస్వాన్ని ధారపోశారు: పెన్షన్ నిధులు.. రిటైర్మెంట్ అయ్యాక వచ్చిన ₹45 లక్షల గ్రాట్యుటీ, పెన్షన్ డబ్బులను ఒక్క రూపాయి కూడా తన కోసం దాచుకోకుండా లైబ్రరీ కోసమే ఖర్చు చేశారు. లైబ్రరీ విస్తరణ కోసం మైసూరులో తనకున్న ఇల్లు, రెండు ప్లాట్లను కూడా అమ్మేశారు.  నేడు 75 ఏళ్ల వయస్సులో ఆయన తన భార్యతో కలిసి ఆ లైబ్రరీ ప్రాంగణంలోని ఒక చిన్న రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. పుస్తకాల మధ్య నివసించడమే ఆయనకు పరమానందం.
 నిబంధనలు లేని నిలయం
ఈ లైబ్రరీ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఎటువంటి కఠినమైన రూల్స్ ఉండవు. చదువుకోవడానికి వచ్చే వారిని పేరు కూడా అడగరు. ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా ఎవరైనా వొచ్చి ఎంతసేపైనా చదువుకోవచ్చు. అందుకే ఇక్కడికి దేశవిదేశాల నుంచి పరిశోధకులు, పీహెచ్‌డీ స్కాలర్లు వొస్తుంటారు.
పద్మశ్రీ పురస్కారం
దశాబ్దాల పాటు ఎటువంటి ప్రచారం ఆశించకుండా అంకెగౌడ  చేసిన ఈ అక్షర యజ్ఞాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. 2026 లో ఆయనకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది. ఈ అవార్డు ఆయనకు మాత్రమే కాదు, ఆయన ప్రేమించే పుస్తకాలకు దక్కిన గౌరవంగా భావిస్తారు.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *