టి.కాంగ్రెస్‌లో చొరబడుతున్న తెలుగుదేశం!!

“బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయాలన్నదే చంద్రబాబు, రేవంత్‌ల లక్ష్యం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మిగిలున్న టీడీపీ వోటు బ్యాంకును ఐక్యం చేసి తనకు అనుకూలంగా మలచుకొని కాంగ్రెస్‌లో తన ఆధిపత్యానికి తిరుగులేకుండా చేసుకోవాలన్నది రేవంత్ వ్యూహంగా కనబడుతోంది. ఒకవేళ దీన్ని అమలు చేయడంలో రేవంత్ విజయం సాధిస్తే, కాంగ్రెస్‌లోని “సీనియర్ నాయక త్వానికి” ఇక భవిష్యత్తు లేనట్టే! సీనియర్ నాయకులే లక్ష్యంగా కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలపై లీకులివ్వడం ద్వారా వారి ప్రతిష్టను దెబ్బతీసి, రాష్ట్రంలోని మిగిలున్న తెలుగుదేశం వోటుబ్యాంకును సంఘటితం చేసి, కాం గ్రెస్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి రేవంత్ చేస్తున్న ప్రయత్నాలను పరిశీలిస్తే, రాష్ట్ర పార్టీలో చీలిక తథ్యమన్న సూచనలు కనిపిస్తున్నాయి.”

బలీయమైన రాజకీయ సమస్యలు ఎప్పుడూ పూర్తిగా సమసిపోవు. అవి నిద్రాణస్థితిలో ఉండి , చిన్నపాటి సంభాషణల్లో ఒక్కసారిగా బయటకు వెల్లడవుతుంటాయి. పరిశీలిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత గతిశీలక రాజకీయాలు నిర్ణాయక దశకు చేరుకున్నాయా, అన్న ప్రశ్నకు గాంధీభవన్ వెలుపల చోటు చేసుకుంటున్న పరిణామాలని పరిశీలిస్తే, “అవును” అనే సమాధానమే వస్తున్నది. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో “సీనియర్ నాయకులు”, రేవంత్ గ్రూపుల మధ్య విభేదాలు పరాకాష్టకు చేరినట్టు అర్థమవుతోంది. సింగరేణికి చెందిన నైనీ బొగ్గు బ్లాక్ కేటాయింపుల్లో జరిగిన అవినీతి వ్యవహారంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాత్రపై బయటకు లీకులు రావడం, పార్టీలో నెలకొన్న పరస్పర అనుమానాలు, పరస్పర విభేదాలను బట్టబయలు చేస్తోంది.

ఇదిలాఉండగా జనవరి 18న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ ర్యాలీ సందర్భంగా మాట్లాడుతూ, “బీఆర్‌ఎస్‌ను నిట్టనిలువగా పాతిపెట్టడమే ఎన్టీఆర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి” అంటూ ఎన్టీఆర్ అనుయాయులు, టీడీపీ క్యాడర్‌కు ఇచ్చిన పిలుపు ప్రస్తుతం కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్న‌ది. తెలంగాణలో టీడీపీని ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసిన బీఆర్‌ఎస్‌ను పూర్తిగా ఓడించడమే సరైన ప్రతీకార మంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఆశ్చర్యం కలిగించింది. నిజానికి ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ కంటే తెలుగుదేశం జెండాలే ఎక్కువగా కనిపించడం విశేషం!! ఈ ప్రకటన వెనుక రేవంత్ ఉద్దేశమేంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ వారసత్వ పరిరక్షకుడిగా తనను తాను ప్రదర్శించుకోవడం వెనుక, కాంగ్రెస్ నాయకత్వానికి, చంద్రబాబుకు మధ్య రహస్య ఒప్పందం ఏమైనా ఉన్నదా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ ర్యాలీలో ముఖ్యమంత్రి తెలుగుదేశం ప్రస్తావన తీసుకురావడంతో, ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న సంగతి స్పష్టమైంది. అంటే పార్టీలో “ఒరిజినల్‌” నాయకులు, రేవంత్ నాయకత్వంలోని టీడీపీ విధేయుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నదన్నది బహిర్గతమైంది. రాబోయే కాలంలో తెలంగాణ రాజకీయాలను శాసించేందుకు ఈ రెండు గ్రూపులు ఎవరికి వారే సమయాత్తమవుతున్నారనుకోవాల్సి వస్తోంది.

బొగ్గు బ్లాక్ కేటాయింపుల విషయంలో కుట్రపూరితంగా తన పేరును బయటకు లాగారని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇది కేవలం చట్టపరమైన సమస్య మాత్రమే కాదు, “కొత్తగా పార్టీలో చేరినవా రు” తనపై ఎక్కుపెట్టిన రాజకీయ అస్త్రాలుగా ఆయన పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్‌లో మొదట్నుంచీ ఉన్నవారు రేవంత్‌ను కేవలం చంద్ర బాబు శిష్యుడిగా మాత్రమే చూస్తున్నారనేది అర్థమవుతుంది. టీడీపీనుంచి వలస వచ్చిన రేవంత్‌పై వారు అనుమానాస్పద దృక్కులతో ఉన్నారు. బీఆర్ఎస్ కోటను కూల్చాలని రేవంత్ పిలుపు నివ్వడం, అంతకుముందు రాయలసీమ‌ ఎత్తిపోతల పథకాన్ని నాలుగు గోడల మధ్య జరిగిన చర్చల్లో కేవలం తన వ్యక్తిగత అభ్యర్థన మేరకే చంద్రబాబు నిలిపేసారని వెల్లడించడం, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల్లో అనుమానాలను మరింత బలపరచింది. రేవంత్ తన ప్రకటనల ద్వారా టీడీపీతో తన పాత అనుబంధాన్ని గుర్తుకు తెస్తూ, ఏక నాయకత్వ లక్షణాన్ని బహిర్గతం చేసి, సంప్రదాయిక కాంగ్రెస్ విలువలను తుంగలో తొక్కా రని సీనియర్ నాయకులు గట్టిగా విశ్వసిస్తున్నారు.

టీడీపీ మద్దతు విషయం లేదా రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండా రేవంత్ బహిర్గతం చేసే అవకాశం లేదని విమర్శకుల వాదన. అందువల్ల రేవంత్ ప్రకటనలు, దిల్లీ కాంగ్రెస్‌కు, చంద్రబాబుకు మధ్య ఉన్న రహస్య సంబంధాన్ని వెల్లడిస్తోందని వారు పేర్కొంటున్నారు. బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయాలన్నదే చంద్రబాబు, రేవంత్‌ల లక్ష్యం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మిగిలున్న టీడీపీ వోటు బ్యాంకును ఐక్యం చేసి తనకు అనుకూలంగా మలచుకొని కాంగ్రెస్‌లో తన ఆధిపత్యానికి తిరుగులేకుండా చేసుకోవాలన్నది రేవంత్ వ్యూహంగా కనబడుతోంది. ఒకవేళ దీన్ని అమలు చేయడంలో రేవంత్ విజయం సాధిస్తే, కాంగ్రెస్‌లోని “సీనియర్ నాయక త్వానికి” ఇక భవిష్యత్తు లేనట్టే! సీనియర్ నాయకులే లక్ష్యంగా కాంట్రాక్టుల అవకతవకలపై లీకులివ్వడం ద్వారా వారి ప్రతిష్టను దెబ్బతీసి, రాష్ట్రంలోని మిగిలున్న తెలుగుదేశం వోటుబ్యాంకును సంఘటితం చేసి, కాం గ్రెస్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి రేవంత్ చేస్తున్న ప్రయత్నాలను పరిశీలిస్తే, రాష్ట్ర పార్టీలో చీలిక తథ్యమన్న సూచనలు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ సంప్రదాయ విలువలు తెరమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతున్నదని సీనియర్ నాయకత్వం భయపడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలోని ఒక వర్గం ఇప్పటికే నాయకత్వ మార్పును డిమాండ్ చేస్తున్నది. ఇప్పటి మాదిరిగానే కేంద్రీకృత నాయకత్వ శైలి, కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి పుట్టగతులుండవన్నది వీరి అభిప్రాయం. అదీకాకుండా ఆంధ్రకు చెందిన టీడీపీ సహకారం, పార్టీ ఆంధ్ర నాయకత్వంలోకి వెళ్లిందన్న అపవాదుకు మరింత బలం చేకూర్చి పార్టీకి తీవ్ర నష్టం కలుగజేస్తుందన్నది కూడా వీరి భయం.

ఇదిలా ఉండగా పార్టీలోని రెడ్డి వర్గానికి చెందిన ఒక గ్రూపు వైఎస్‌ఆర్‌సీపీతో రహస్య సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైఎసఆర్‌సీపీ శాఖను తెలంగాణలో మళ్లీ ప్రారంభించాలని వీరు కోరుతున్నారట. అది వాస్తవరూపం దాలిస్తే ఈ వర్గమంతా ఆ పార్టీశాఖలో చేరి బీఆర్‌ఎస్‌తో కూటమిగా ఏర్పడి రాబోయే ఎన్నికల్లో తలపడాలన్నది వీరి వ్యూహంగా కనబడుతోంది. ఈ పరిణామాలు సాధారణ పౌరుడికి పెద్దగా ప్రాముఖ్యత కలిగినవిగా కనిపించకపోవచ్చు కానీ, సంబంధం లేనట్టు కనిపిస్తున్న ఈ పరిణామాలను జాగ్రత్తగా కూర్చుకుంటూ వెళితే, తెలంగాణ కాంగ్రెస్ నిట్ట నిలువు చీలిక దిశగా పయనిస్తున్నదని అర్థమవుతుంది. ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ విభేదాలు, బొగ్గు స్కాం పుణ్యమాని ఒక్కసారిగా బయట పడ్డాయి.

అధిష్టానం అనుమతితో టీడీపీతో రేవంత్ చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నాడన్న అనుమానం సీనియర్ నాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. మంత్రివర్గంలో కూడా ఈ విభేదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇది ఇదే మాదిరి కొనసాగితే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీల పంట పండినట్టే. బొగ్గు కేటాయింపు అవకతవకలు బయటకు లీకవడం మంత్రివర్గంలో విభేదాలను వెల్లడిచేస్తోంది. ఒకవేళ పార్టీలో చీలికే సంభవిస్తే, సీనియర్ నాయకత్వం, వైఎసఆర్‌సీపీలో చేరి, బీఆర్‌ఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తే, రేవంత్ టీడీపీ వోటు బ్యాంకుపై ఆధారపడి కాంగ్రెస్‌ను ఎన్నికల రణరంగం లోకి దింపాల్సి ఉంటుంది. అప్పుడు రేవంత్ ఇచ్చిన పిలుపు “ గులాబి రంగు గతం, నేడు పచ్చదనం” నినాదం నిజమై, తెలంగాణ కాంగ్రెస్, ఆంధ్ర తెలుగుదేశం గుప్పిట్లోకి వెళ్లి పోక తప్పదు.

– శామ్ సుందర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *