– 57 పోటీ పరీక్షలకు ఉచిత క్లాసులు
– 2 వేల గంటల వీడియో పాఠాలు
– ఒక్కొక్క‌రికి రూ.50 వేల ఖర్చు ఆదా
– త్వరలో ప్రారంభించ‌నున్న హ‌రీష్‌రావు

సిద్ధిపేట , ప్రజాతంత్ర, జనవరి 22:  నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా, వారి భవిష్యత్తుకు బాటలు వేసేలా మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు  మరో చారిత్రక ముందడుగు వేశారు. హైదరాబాద్‌కు వెళ్లి ఖరీదైన కోచింగ్ సెంటర్లలో చదవాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే ఉచితంగా ఉద్యోగ సాధనకు మార్గం చూపే ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్’ ను తన స్వంత ఖర్చులతో రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 57 రకాల పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా ఈ యాప్‌లో 2 వేల గంటల వీడియో పాఠాలు, 4 వందల నమూనా ప్రశ్నాపత్రాలు, 4 వేల స్టడీ మెటీరియల్ పిడిఎఫ్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌ను కొద్ది రోజుల్లోనే సిద్ధిపేటలో అధికారికంగా ప్రారంభించనున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంది.ఇప్పటివరకు ఉద్యోగం కోసం యువత హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి కోచింగ్, రూమ్ కిరాయి, భోజనం తదితర అవసరాల కోసం రూ.50 వేల నుంచి లక్ష  వరకు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో, ఈ యాప్ యువతకు పెద్ద ఊరటగా మారనుంది. ఇంటి వద్దనే నాణ్యమైన కోచింగ్ తరహా ఆన్‌లైన్ క్లాసులు వినేలా రూపొందించారు. గతంలో గ్రూప్–1, గ్రూప్–2, పోలీస్ కానిస్టేబుల్, టెట్, ఉపాధ్యాయ నియామకాల కోసం ఉచిత కోచింగ్‌లు నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేలా చేసిన హరీష్ రావు, అదే సేవాభావంతో ఈ యాప్‌ను రూపొందించడం విశేషం.
యాప్ ప్రత్యేకతలు
-57 రకాల పోటీ పరీక్షల సిద్ధత
-2,000 గంటల వీడియో పాఠాలు
-400 టెస్ట్ పేపర్లు – రోజువారీ పరీక్షలు
-4,000 స్టడీ మెటీరియల్ పిడిఎఫ్ లు
-తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో బోధన
ఉద్యోగ ప్రకటనలు, క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు,సందేహాల నివృత్తికి ప్రత్యేక సమయం. మొదటి విడతలో సిద్ధిపేట నియోజకవర్గానికి చెందిన వెయ్యి మంది నిరుద్యోగ యువతకు ఏడాది పాటు ఉచిత యాక్సెస్ కల్పించనున్నారు. ఒకసారి రిజిస్టర్ అయితే ఏడాది కాలంలో ఎన్నిసార్లైనా వీడియో పాఠాలు వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా హరీష్ రావు  మాట్లాడుతూ “ఉద్యోగం కోసం అప్పులు చేసి నగరాలకు వెళ్లే పరిస్థితి యువతకు రావద్దు. చదువు ఉన్న ప్రతిభావంతుడు ఆర్థిక పరిస్థితితో వెనుకబడకూడదు. సిద్ధిపేట యువత ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగాలు సాధించాలి” అని పిలుపునిచ్చారు.
———————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.