కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు ఆగమాగం

– నిధులు లేక పడకేసిన అభివృద్ధి.
– మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌లో క్లీన్ స్వీప్
– బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేస్తోందని, అభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అమలు కాని హామీలపై విసిగిపోయి పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నాయకులు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ లో గురువారం చేరారు. సంగారెడ్డి (9వ వార్డు) లాడ్ బాలుయాదవ్, శేఖర్, పాండు, నర్సాపూర్ (10వ వార్డు) రాజు, శేఖర్, దశరథ్, పటాన్‌చెరు (ఇస్నాపూర్) మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, పాండు, వెంకట్ రెడ్డి, పటాన్‌చెరు (గుమ్మడిదల) కుమార్, ఇతర నాయకులు పార్టీలో చేరారు. వీరందరికీ హరీశ్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో పట్టణ ప్రగతి ద్వారా ప్రతినెలా నిధులు విడుదల చేసి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదని విమర్శించారు. దీంతో మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి, చెత్త ఎత్తడానికి కూడా నిధులు లేని దుస్థితి నెలకొందన్నారు. నిధుల కొరతతో పట్టణాల్లో పారిశుధ్యం లోపించిందని, దోమల బెడద పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వీధి దీపాలు వెలిగే పరిస్థితి లేదని అన్నారు. తాగునీటి సరఫరాలో కూడా కోతలు విధిస్తున్నారని ఆయన అన్నారు.

ఇస్నాపూర్, గుమ్మడిదల వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని, ఇప్పుడు ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా చేతులెత్తేసిందని అన్నారు. మహిళలకు, యువతకు, రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. పెన్షన్ల పంపిణీలో కూడా జాప్యం జరుగుతోందంటూ పేదల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ మోసపూరిత పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, బీఆరఎస్ పటాన్‌చెరు ఇన్‌చార్జి ఆదర్శ్‌రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *