18న మేడారానికి ముఖ్యమంత్రి, మంత్రుల రాక

– భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
– 19న గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం
– అధికారులతో ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష

ములుగు, ప్రజాతంత్ర, జనవరి 14: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు మంత్రులు ఈ నెల 18న మేడారానికి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై మేడారం హరిత హోటల్‌లో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌, జిల్లా ఎస్పీ రామ్‌నాథ్‌ కేకన్‌, ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా, జిల్లా అటవీ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌లతో కలిసి అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి 18న మేడారం చేరుకున్న అనంతరం అక్కడే బస చేయనున్నారని, 19న శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. 18న రాష్ట్రస్థాయి యంత్రాంగం మొత్తం మేడారంలోనే ఉంటున్నందున ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జిల్లాకు మంచి పేరు తేవాలని అధికారులను కోరారు. 18వ తేదీ ఆదివారం కావడం, పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, ఆ దృష్టితో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మేడారం అభివృద్ధి పనుల్లో సహకరిస్తున్న జిల్లా అధికారులు, వారి బృందాలకు, ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా ప్రొటోకాల్‌, బందోబస్తు, వసతి, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్‌ దివాకర స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హెలిప్యాడ్‌ నిర్వహణ పనులను ఆర్‌అండ్‌బీ శాఖకు, సీఎం, వీఐపీ ప్రొటోకాల్‌ బాధ్యతలను ఆర్డీవో వెంకటేష్‌కు అప్పగించారు. జాతరతోపాటు గద్దెల ప్రాంగణ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీపీవోను ఆదేశించారు. సీఎం భద్రత, రూట్‌ మ్యాప్‌, పార్కింగ్‌, గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రామ్‌నాథ్‌ కేకన్‌ పర్యవేక్షిస్తారు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు జిల్లాలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. అలాగే ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా ధింసా, కోయ, గుస్సాడి, కొమ్ము కోయ తదితర సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిరచారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌ జీ, అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు సంపత్‌ రావు, ఆర్డీవో వెంకటేష్‌, జిల్లా అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *