– సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14 : రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత విలువైనదని, సమాజానికి ప్రాణవాయువు వంటిదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రిటైర్డ్ లోకాయుక్త (గోవా) జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. పరిమితుల్లేని స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇవ్వలేదని తెలిపారు. ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రసారం చేసిన కథనాలను ఓ ప్రకటనలో ఆయన ఖండించారు. సోషల్ మీడియా అయినా, ప్రధాన స్రవంతిలోని మీడియా అయినా ప్రచార సాధనాలు ఏవైనా బాధ్యత లేకుండా భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగిస్తే నియంత్రణ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తుందని, ఇది కూడా అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. స్వీయ నియంత్రణ, సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించడం చేతగాకపోతే మీ భావ ప్రకటనా స్వేచ్ఛను మరొకరు నియంత్రించకుండా మీకు మీరే ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటే మంచిదని సూచించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో తమ బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వహించే యువ మహిళా అధికారుల పట్ల అసభ్యంగా, బాధ్యతారహితంగా, అమర్యాదగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా రాయడం, మట్లాడడం అత్యంత గర్హనీయమని, పురుషాధిక్య భావజాలంతో కూడిన ప్రమాదకరమైన దుశ్చర్య అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





