“పూర్వం వియత్నాం ను ‘ వియట్ ‘ అని పిలిచే వారట. ఆ కాలంలో బౌద్ధమతం ప్రధానంగా ఉండేది. నేను హారిని వియత్నాంలో స్త్రీల పరిస్థితి గురించి అడిగినప్పుడు .. స్త్రీలకు ప్రాచీన కాలం నుంచీ ఆ దేశంలో ప్రత్యేక స్థానం ఉందనీ ట్రాన్ ట్రాంగ్ కిమ్ అనే మహిళ వియత్నాం మొదటి చక్రవర్తి అంటూ స్త్రీ అర చేతిలో ఉన్న రాజుల శిల్పాన్ని చూపించాడు. ట్రాన్ హంగ్ డావో అనే మహిళ వియత్నాం చరిత్రలో గొప్ప యోధురాలట. లీ వంశానికి చెందిన లీ ట్రాంగ్ టియన్ అనే మహిళ చక్రవర్తిగా పరిపాలించిందట. స్త్రీలు యుద్ధాలలో పాల్గొనడం వలన ప్రజలలో సామరస్య భావం బలపడిందని, ఇప్పటికీ వియత్నాంలో స్త్రీలకు అదే గౌరవప్రదమైన స్థానం ఉందని గైడ్ హారీ చెప్పినప్పుడు ఒక మహిళగా చాలా గర్వించాను.”
గిరియానం – 13
ఈ రోజు మా ప్రణాళికలో నిన్ బిన్, హోవా లు అనే ప్రదేశాల సందర్శన ఉంది. హనోయ్ లో ఉదయమే ఉపాహారం ఏడు గంటలకు బయలు దేరాము. సుమారు మూడుగంటల ప్రయాణం. హోవాలు వియత్నాం పురాతన రాజధాని. క్రీస్తుశకం పదవ శతాబ్దంలో దిన్హ, లీ రాజవంశాలు వియత్నాం దేశాన్ని పరిపాలించాయి. దుర్భేద్యమైన తొంభై పర్వతాలల నడుమ ఈ ప్రాంతం ఉన్నది. అయితే ప్రస్తుతం అక్కడ రాజ భవనాలు చాలా వరకు శిథిలమై పోయాయని గైడ్ హారీ చెప్పాడు. పూర్వం వియత్నాం ను ‘ వియట్ ‘ అని పిలిచే వారట. ఆ కాలంలో బౌద్ధమతం ప్రధానంగా ఉండేది.
నేను హారిని వియత్నాంలో స్త్రీల పరిస్థితి గురించి అడిగినప్పుడు .. స్త్రీలకు ప్రాచీన కాలం నుంచీ ఆ దేశంలో ప్రత్యేక స్థానం ఉందనీ ట్రాన్ ట్రాంగ్ కిమ్ అనే మహిళ వియత్నాం మొదటి చక్రవర్తి అంటూ స్త్రీ అర చేతిలో ఉన్న రాజుల శిల్పాన్ని చూపించాడు. ట్రాన్ హంగ్ డావో అనే మహిళ వియత్నాం చరిత్రలో గొప్ప యోధురాలట. లీ వంశానికి చెందిన లీ ట్రాంగ్ టియన్ అనే మహిళ చక్రవర్తిగా పరిపాలించిందట. స్త్రీలు యుద్ధాలలో పాల్గొనడం వలన ప్రజలలో సామరస్య భావం బలపడిందని, ఇప్పటికీ వియత్నాంలో స్త్రీలకు అదే గౌరవప్రదమైన స్థానం ఉందని గైడ్ హారీ చెప్పినప్పుడు ఒక మహిళగా చాలా గర్వించాను. ఆ చారిత్రక ప్రదేశంలో తిరుగుతూ ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యాను.
అక్కడినుంచి వెళ్ళి మేము ట్రాంగ్ యాన్ పడవ ప్రయాణం చేసాము. ఆ పడవలను చాలావరకు మహిళలే నడపడం నాకు చాలా నచ్చింది. ఒక్క పడవలో ముగ్గురు కూర్చోవచ్చు. అది అద్భుతమైన అనుభవం. పర్వతాల మధ్యలో నుంచి ప్రడవ ప్రయాణం సాగుతుంది. కొన్ని సార్లు పర్వత గుహలలోనుంచి పడవ ప్రయాణిస్తుంది. అలా మేము నాలుగు గుహలను దాటాము. మొదటి గుహ అరవై మీటర్లు, రెండో గుహ రెండువందల యాభై మీటర్లు, మూడో గుహ మూడు వందల మీటర్లు, నాలుగో గుహ నూటయాభై మీటర్లు పొడుగు ఉన్నాయి. ఆయా గుహల ముందు వాటి పొడుగును సూచించే బోర్డులున్నాయి. అలా మేము
పడవలో సుమారు రెండుమూడు గంటలు ప్రయాణం చేసి ఆ నది మధ్యలో అక్కడ అక్కడున్న మూడు బౌద్ధారామాలను చూసాము. అవి అన్నీ అతి ప్రాచీనమైన నిర్మాణాలు. ఉదయమే ఎయిర్ పోర్టుకు బయలుదేరాము. దనాoగ్ నగరానికి మా ప్రయాణం. సుమారు గంటన్నర ప్రయాణం. మేము లగేజీతో బయటకు వచ్చేసరికి గైడ్ తాయ్ సిద్ధంగా ఉన్నాడు. దనాoగ్ జనాభా మూడు మిలియన్ లు. వియత్నాం ‘S ‘ ఆకారంలో ఉండే దేశం. పై భాగం నార్త్ వియత్నాం అయితే మధ్యలోని సన్నటి భాగం దనాoగ్ సౌత్ వియత్నాం. భోజనం చేసి కొబ్బరి తోటల్లోకి వెళ్ళాము. అవి నేల మీదున్న కొబ్బరి తోటలు కాదు. నదికి రెండు తీరాలలో పెంచిన కొబ్బరి తోటలు. పైకి తొనలు తొనలుగా ఉన్న అలాంటి కొబ్బరి బోండాలు నేను చూడడం ఇదే మొదటిసారి. వాటిలో నీళ్ళుకాకుండా మన తాటి ముంజలు లాంటి మృదువైనన తెల్లటి, తియ్యటి తొనలుంటాయి. వాటిని అక్కడి స్థానికులు సాగుచేస్తారు. గుండ్రటి బుట్ట లాంటి పడవను రంగులతో అందంగా అలంకరించారు స్థానికులు. ఒకదానిలో ఇద్దరు మాత్రమే కూర్చోవాలి. దాదాపు గంటన్నర షికారు చేయొచ్చు.
ఒకదానిలో నేను గుంటూరు నుంచి వచ్చిన అనురాధ కూర్చున్నాం. ఇరువైపులా పచ్చటి కొబ్బరి తోటలు. వయ్యారంగా పడవ ముందుకు సాగుతోంది. ఆ కదలిక, ఆ ప్రకృతి నన్ను మరో లోకంలోకి తీసుక వెళ్ళింది. మధ్యలోకి వెళ్ళాక కొన్ని గుండ్రటి పడవలు ఆగి ఉన్నాయి. ఒక దాంట్లో ఉన్న ఇద్దరు యువకులు గుండ్రంగా, వేగంగా దానిలో తిరుగుతూ కేరింతలు కొడుతున్నారు. చాలా మంది ఉత్సాహంగా చూస్తున్నారు. కానీ ఎవ్వరూ తిరిగే సాహసం చేయడం లేదు. నా మనసు ఒక్కసారిగా గిర్రున తిరిగింది. నేనూ తిరగాలని ఉత్సాహపడ్డాను. నాతో ఉన్న అనురాధను అడిగాను. వయసు రీత్యా ముందు కొంచం సందేహంచినా నా ప్రోద్బలo వల్ల వెంటనే అంగీకరించింది. మేము అలా తిప్పే మరో పడవలోకి మారాము. అలా తిప్పడానికి ప్రత్యేకమైన నైపుణ్యం కావాలి కాబోలు. తిప్పినందుకు ఒక్కరికి వంద డాంగ్ లు తీసుకుంటారు.
అంటే సుమారు మూడువందల యాభై రూపాయలన్నమాట. మూడు నిమిషాలు తిప్పుతారు. మమ్మల్ని తిప్పిన యువకుడి పేరు చాంగ్. అనురాధ దిగి పోయిన తర్వాత నన్ను ఒక్కదాన్ని మళ్ళీ తిప్పుమని అడిగాను. ఆ అబ్బాయి కొంత ఆశ్చర్యంతో, మరికొంత ఆసక్తి తో ” మేడం జీ! మీరు ఒక్కరే బ్యాలన్స్ చేసుకుంటానంటే తిప్పుతూను.” అన్నాడు. సాధారణంగా ఒక్కరు తిరుగరట. ఇద్దరు ఉంటేనే పుట్టి బ్యాలెన్స్ అవుతుందట. అతడు ఆశ్చర్యపోవడానికి మహిళను కావడం, నా వయసు కూడా కారణం కావచ్చు. ఏమైతేనేం నేనొక్కదాన్నే మళ్ళీ గిర గిరా తిరిగాను. అప్పుడు భూమ్యాకాశాలు ఒక్కటైన అనుభూతి కలిగింది. నాకు ఆ క్షణం నేను నింగీ నేలను ఒక్కటి చేసాననే ధీమా కలిగింది. ఇలాంటి సాహసాలే మదిలో చిరకాలం ఉంటాయి కదా! రెండోసారి తిరిగాను కాబట్టి వంద డాంగ్ లు ఇవ్వబోయాను. ” నాకూ మొదటి అనుభవం మేడం. ఇకమీదట ఇలా ఒక్కరిని కూడా తిప్పగలననే నమ్మకం వచ్చింది.” అంటూ చాంగ్ సున్నితంగా తిరస్కరించాడు.
తర్వాత నేను మొదట ఎక్కిన పడవలోకి చేరాను. అక్కడినుంచి కొంత దూరం వెళ్ళాక పడవ మళ్ళీ ఆగిపోయింది. ప్రకృతి మాత ఒడిలో సాయం సంధ్యలో వియత్నమీస్ భాషలో జానపద గేయాలు పాడుతూ స్త్రీ పురుషులు నృత్యం చేస్తున్నారు. మరికొందరు యువతీ యువకులు తామున్న చోటునుంచే వారికి జత కలిసారు. నేనూ అనురాధ కూడా వెంటనే లేచి నిలబడ్డాం. అంతే! మా ప్రమేయం లేకుండానే పడవ కుదుపులకు మా తనువులు వయ్యారంగా కదిలాయి. బాలెన్స్ చేసు కోవడం కష్టమే అయింది. మేం తీరం చేరాక యాజమాన్యం వారు మాకు కొబ్బరి బొండాలు కాంప్లిమెంటరీగా యిచ్చారు. వియత్నాంలో అవి చాలా ప్రత్యేకం. బహుశః అమృతం ఎప్పుడూ రుచి చూడలేదు కానీ ఆ కొబ్బరి నీళ్ళు మాత్రం అమృతం లాగా అనిపించింది. అక్కడి స్థానిక ఫలమైన డూరియో పండును రుచి చూసాం. అది చూడడానికి మన పనస పండు తొనలలాగా ఉన్నా భిన్నమైన రుచి. దానితో ఆ రోజు డిన్నర్ ను ముగించాను.





