– అత్యంత పేదరిక నిర్మూలనపై పీఆర్ అండ్ ఆర్ డీ శాఖ ఫోకస్
– మహిళా స్వయం సహాయక బృందాల నేతృత్వంలో అర్హుల గుర్తింపు
– అధికారులకు మార్గ నిర్దేశం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12ః రాష్ట్రంలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి వారికి సహాయం అందించే దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలకమైన కసరత్తును ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా అత్యంత పేద వర్గాల గుర్తింపు, వారి అవసరాల అంచనా, విడతల వారీగా పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సచివాలయంలో సోమవారం శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేవలం గణాంకాల ఆధారంగాకాక గ్రామీణ స్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలాపేదరిక గుర్తింపు జరగాలని స్పష్టం చేశారు. ఇందుకోసం స్పష్టమైన ప్రమాణాలు రూపొందించి ప్రతి కుటుంబం జీవన స్థితి, ఆదాయ వనరులు, నివాస పరిస్థితులు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.
మహిళా స్వయం సహాయక బృందాల పాత్ర కీలకం
అత్యంత పేదలను గుర్తించే ప్రక్రియలో మహిళా స్వయం సహాయక బృందాల పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో స్థానిక పరిస్థితులను బాగా తెలిసిన ఈ బృందాల ద్వారా ఇంటింటా సర్వేలు నిర్వహించి, నిజంగా అత్యవసర సహాయం అవసరమైన కుటుంబాలను గుర్తించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అర్హుల గుర్తింపు కోసం విలేజ్ యూనిట్ గా సోషల్ మ్యాపింగ్ జరగాలన్నారు. గ్రామ సభల తరహాలో గ్రామస్తులందరినీ ఒక దగ్గరకు చేర్చి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అలా గుర్తించిన అనంతరం వారికి ఉపాధి, నివాసం, ఆరోగ్యం, పోషణ, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో విడతల వారీగా సమగ్ర సహాయం అందించే కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. లక్ష్యం కేవలం సహాయం చేయడం కాకుండా ఈ కుటుంబాలను దీర్ఘకాలికంగా స్వయం ఆధారితంగా నిలబెట్టాలలని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా కొన్ని కుటుంబాలకు కావలసిన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నాయని, వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. దీనికి సంబంధించి త్వరలో సీఎం నేతృత్వంలో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్, డైరెక్టర్ శృతి ఓజా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో దివ్య దేవ రాజన్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





