చరిత్రలో ఎస్సీ స్టడీ సర్కిల్ నూతన అధ్యాయం

– స్టడీ సర్కిల్ ఉన్నత ఉద్యోగాలు కల్పించే విశిష్ట కేంద్రం
– ప్రభుత్వ ఉద్యోగం పదవి కాదు… ప్రజల పట్ల ఉన్న గొప్ప బాధ్యత
– సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ , ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ రాష్ట్ర పాలనకు కొత్త తరం అధికారులను అందిస్తూ రాష్ట చరిత్రలో మరో నూతన అధ్యాయాన్ని నమోదు చేసిందని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. గ్రూప్–Iతోపాటు వివిధ కీలక హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు ప్రజాసేవ–పాలన విలువలకు ప్రతీకలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారధ్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రూప్-1తో పాటు వివిధ ఉన్నత ఉద్యోగాలకు ఎంపికైన వారినుద్దేశించి మంత్రి ప్రసంగించారు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ సాధించిన ఈ ఫలితాలు కేవలం వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదని, సమాజమంతటికీ స్ఫూర్తినిచ్చే చారిత్రక విజయాలుగా నిలుస్తాయని అన్నారు. గ్రూప్–I ద్వారా ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు, ఏడుగురు డీఎస్పీలు, ఇద్దరు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు, నలుగురు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు, ఒక అసిస్టెంట్ లేబర్ కమిషనర్, ఆరుగురు ఎంపీడీవోలుగా ఎంపిక కావడం అత్యంత అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఉచిత కోచింగ్‌కు ఎస్సీ స్టడీ సర్కిల్ ఒక విశ్వసనీయ కేంద్రంగా మారిందని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన విజన్‌, దృఢ సంకల్పమే ఈ స్థాయి ఫలితాలకు ప్రధాన కారణమని మంత్రి తెలిపారు. మహిళా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఎంపిక కావడం ప్రత్యేకంగా అభినందనీయమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం ఒక పదవి మాత్రమే కాదు… ప్రజల పట్ల ఉన్న గొప్ప బాధ్యత. మీరు చేపట్టే ప్రతి హోదా ప్రజల విశ్వాసంతో ముడిపడి ఉంటుంది. అధికారంతో కాదు.. సేవాభావంతో పరిపాలన సాగాలి అని ఉద్బోధించారు. కార్యక్రమంలో ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, గ్రూప్ 1-లో విజయం సాధించిన ఉద్యోగుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.

నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలి : గ్రూప్-1 ట్రైనీల‌తో భ‌ట్టి

ఇందిర‌మ్మ ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నూత‌న ఆలోచ‌నలు చేసి స‌రికొత్త కార్య‌క్ర‌మాల‌తో ముందుకు వెళుతోందని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. వివిధ స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలా మీరు అత్యంత నిబ‌ద్ద‌త‌తో ముందుకు వెళ్లాల‌ని ఎస్సీ స్ట‌డీ స‌ర్కిల్ ద్వారా వివిధ ఉద్యోగాల‌కు ఎంపికైన వారినుద్దేశించి అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుక‌బ‌డిన స్థానం నుంచి వ‌చ్చిన మీరు రేప‌టి రోజున వెనుక‌బ‌డిన వారికి, స‌మాజంలో నిల‌దొక్కుకోవ‌డంలో ఇబ్బందులు ప‌డుతున్న‌వారికి తోడ్పాటునందించాలన్నారు. ఎస్సీ స్ట‌డీ స‌ర్క‌ల్ లో శిక్ష‌ణ పొంది గ్రూప్-1 సాధించిన శిక్ష‌ణ పొందుతున్న వారికి మెమెంటోలు అందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *