ట్రైబల్ పోలీస్ బెటాలియన్ సమస్యలు ప‌రిష్క‌రించండి

– డీజీపీకి మంత్రి సీతక్క విన‌తి

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః ట్రైబల్ పోలీస్ బెటాలియన్‌ను బలోపేతం చేయాలంటే ఉద్యోగ భద్రత, నూతన నియామకాలు, బదిలీలు, పదోన్నతులు కల్పించడం అత్యంత అవసరమని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకటరావు, జారే ఆది నారాయణలతో కలిసి మంత్రి సీతక్క మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. సత్తుపల్లి లోని ట్రైబల్ పోలీస్ బెటాలియన్‌లో నూతన రిక్రూట్మెంట్లు, పదోన్నతులు, స్థానికత, బదిలీల అంశాల్లో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వారు వివరించారు. ఈ సమస్యల వల్ల ట్రైబల్ యువత, పోలీస్ సిబ్బందిలో అసంతృప్తి నెలకొని ఉందని, తక్షణమే పరిష్కారాలు చూపాలని కోరారు. ఈ అంశాలపై డీజీపీ శివధర్ రెడ్డి సానుకూలంగా స్పందించి ట్రైబల్ బెటాలియన్ సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి తగిన పరిష్కారాలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో త్వరలో జరగనున్న మేడారం మహా జాతరకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై కూడా మంత్రి సీతక్క డీజీపీతో చర్చించారు. లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు పోలీసు సిబ్బందిని కూడా నియమించాలని సూచించారు. అనంతరం మంత్రి సీతక్క డీజీపీకి మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి, పోలీస్ కుటుంబాలందరినీ జాతరకు ఆహ్వానించారు.-


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *