– కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10: సోమనాథ్ ఆలయ చరిత్రను గొప్పతనాన్ని స్మరించుకుంటూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. సోమనాథ్ స్వాభిమాన పర్వ్-2026 సందర్భంగా పంజాగుట్ట దుర్గాభవానీ ఆలయంలో శివుడికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ దేవాలయాన్ని రక్షించేందుకు ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాలను స్మరించుకోవడానికే ఈ సోమనాథ్ స్వాభిమాన పర్వ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ మహనీయుల త్యాగాలు రాబోయే తరాల సాంస్కృతిక చైతన్యానికి ఎల్లప్పటికీ ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్తోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.
ప్రజలందరూ శివాలయాలు సందర్శించాలి : రామచందర్రావు
సోమనాథ్ స్వాభిమాన పర్వ్-2026 సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని శివాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమనాథ్ దేవాలయాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలను అర్పించిన అనేకమంది భారతీయులను స్మరించుకోవడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని, శతాబ్దాలపాటు విదేశీ దాడులు, విధ్వంసాలు జరిగినప్పటికీ ఈ ఆలయం భారతీయుల అచంచలమైన ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో కొలువైన ఈ మహత్తర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు. ఈ ఆలయం దురదృష్టవశాత్తు విదేశీ ఆక్రమణదారుల విధ్వంస లక్ష్యంగా మారిందన్నారు. 2026 సోమనాథ్ ఆలయ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంవత్సరమని, జనవరి 1026లో గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయంపై మొదటిసారి దాడి చేసి విధ్వంసం సృష్టించాడని తెలిపారు. ఇది ఒక ఆలయంపై దాడి మాత్రమే కాదు.. భారతీయ విశ్వాసం, సంస్కృతి, నాగరికతపై జరిగిన హింసాత్మక, అనాగరిక ప్రయత్నమని అభివర్ణించారు. ఆ తరువాత అనేక సందర్భాలలో సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ప్రయత్నాలు జరగగా పునర్నిర్మాణం 1951 మే 11న పూర్తయిందని రామచందర్రావు తెలిపారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయ్యే అమృత మహోత్సవ సంవత్సరం కావడం విశేషమన్నారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ప్రజలందరూ శివాలయాలను సందర్శించి ఓంకార జపంతోపాటు విశేష పూజలు నిర్వహించాలని, మన సంస్కృతి, ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





