విజ్ఞాన సర్వస్వనిధి గుంజి వెంకటరత్నం

“హంసవింశతి అంటే హంస చెప్పిన ఇరవై కథల సంపుటి. ఈ కథలన్నిటిలోనూ విశృంఖల జార శృంగారం వర్ణించబడింది. ఆంగ్లేయులు మన దేశాన్ని పాలిస్తున్నరోజుల్లో ఈ గ్రంథాన్ని నిషేధించారని  చెబుతారు. పురుష సంగమాసక్త అయిన నాయిక హేమవతి, ఆ ప్రాంత రాజు అయిన చిత్రభోగుని కలిసేందుకు పయనమైనప్పుడు ఆమె స్నేహితురాలు ‘హంస’ నివారించడం ఇందులోని కథాంశం..”
     ( 2026 సంవత్సరానికిగాను ప్రఖ్యాత ‘అబో విభో కందాళం’ సంస్థవారి జీవనసాధన (లక్ష రూపాయల) పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా..)      

అతను ఒక నడిచే ఎన్‌సైక్లోపీడియా. ఆయన స్పృశించని విభాగం లేదనటంలో అతిశయోక్తి లేదు. నిత్య పఠనాభిలాషి, నిత్య శోధకుడు. కవి, కథకుడు, నాటకకర్త, మంచి విమర్శకుడు, బహుగ్రంథకర్త, ప్రధానంగా విజ్ఞాన సర్వస్వాలపై మంచి పట్టును సాధించిన వ్యక్తి. తెలుగు అధ్యాపకులుగా, రీడర్‌గా, తెలుగు విభాగ శాఖాధ్యక్షులుగా, జానపద రీసర్చ్ ‌ఫెలోగా, సంస్కృతాంగ్ల భాషల చరిత్రపై పరిశోధనలు చేసిన వ్యక్తిగా తెలుగు సాహిత్య లోకంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి. ప్రాచీన మానవ సమాజాల సాంస్కృతిక విశేషాలతో ‘మహా భారతం’లోని శాస్త్ర సాంకేతిక అంశాలను నేటి సమాజానికి అనుగుణంగా ఒంటిచేత్తో విశదీకరించడమన్నది సామాన్య విషయంకాదు. అందుకే ‘విజ్ఞాన సర్వస్వ కళానిధి’లాంటి పురస్కారాలతో స్వర్ణకంకణాభూషణుడయ్యారు. ఆయనే డాక్టర్‌ ‌గుంజి వెంకటరత్నంగారు.

    విజ్ఞాన సర్వస్వాలన్నవి ప్రజలకు విజ్ఞాన ప్రసార సాధనాలుగా నేటికీ, ఏనాటికీ, తరతరాలకు విజ్ఞాన గనులుగా విరాజిల్లుతున్నాయి. అయితే ఇందులో సాహిత్యపరమైన విజ్ఞాన సర్వస్వాలు అరుదనే చెప్పాలి. ప్రాచీన సాహిత్య సర్వస్వాలన్నవి ఇంగ్లీషులోనేగాని తెలుగులో వెలుగులోకి రాలేదు. కాని ఆంగ్లేయుల భాషాసాహిత్యాల ప్రభావం మన దేశభాషల్లోనూ కొన్ని కొత్త సాహిత్య పక్రియలు ఆవిర్భవించడానికి కారణమైనాయి. అటువంటివాటిల్లోవే ఈ విజ్ఞాన సర్వస్వాలు. ఇందులో సాహిత్యపరమైన సర్వస్వాలులేని లోటును గ్రహించి తీర్చిన వ్యక్తి గుంజి వెంకటరత్నం గారు. మన పూర్వికుల చరిత్ర,సంస్కృతి, వారి సాహిత్యం ముందుతరాలవారు ఆస్వాదించాలన్నా, సాహిత్యపరమైన విజ్ఞానాన్ని అందుకోవాలన్నా అందుకు సంబందించిన ‘సర్వస్వాల’ను ఈ సమాజానికి అందించడమే లక్ష్యంగా వెంకటరత్నంగారు అనేక పరిశోధనలు చేశారు.
అవి వెంకటరత్నంగారు ఎం.ఏ చేసిన రోజులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో వరంగల్‌లో కొత్తగా పి.జీ తెలుగు విభాగం ఆచార్య బిరుదరాజు రామరాజు పర్యవేక్షణలో (1967) ప్రారంభమైంది. ఎం.ఏ తెలుగు విభాగంలో మొదటి బ్యాచ్‌లో చేరిన రత్నంగారు 1969లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనారు. వీరికి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య ఆశీస్సులు లభించడంతోపాటు, ఆయన పర్యవేక్షణలో ‘హంసవింశతి విజ్ఞాన సర్వస్వం’పైన పరిశోధన మొదలైంది. వాస్తవానికి గ్రాడ్యుయేషన్‌, ‌పోస్టుగ్రాడ్యుయేషన్‌ ‌చదువుతున్న రోజుల్లోనే ఆచార్య సుప్రసన్నాచార్యతోపాటు ఆచార్యులు కేతవరపు రామకోటిశాస్త్రి, మాదిరాజు రంగారావుగార్ల ప్రభావం వెంటరత్నంగారిపై పడింది.
మొదట్లో కొద్దోగొప్పో కవిత్వం రాసేవాడల్లా పరిశోధనవైపు దృష్టిమళ్ళించారు. అప్పటినుంచి ఆయన సర్వస్వాల నిర్మాణాభిమానిగా మారారు. హంసవింశతి విజ్ఞాన సర్వస్వంపైన పరిశోధన ప్రారంభంలో అనేక అవరోధాలను ఆయన ఎదుర్కున్నారు. ముందుగానే చెప్పిట్లు తెలుగులో సాహిత్య సర్వస్వాలగురించి గతంలో ఎవరూ పరిశోధన చేయకపోవడంవల్ల కావల్సిన సమాచార సేకరణ దుర్లభమైంది. అందుకు ఆంగ్ల విజ్ఞాన సర్వస్వాలను బాగా అధ్యయన చేయాల్సివచ్చింది. సమాచారం కోసం గ్రామాలు, పట్టణాలు కలియతిరుగాల్సి వచ్చింది. ఆయన కష్టానికి తగిన ఫలితం కూడా లభించిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఏ గ్రంథంలో లభించని సమాచారాన్ని ఆయన సేకరించగలిగారు. ఒక విధంగా సాహిత్య పరిశోధనారంగంలోనే రత్నంగారి పరిశోధన కొత్తబాటలు వేసిందనే చెప్పవచ్చు. విచిత్రమేమంటే ఉస్మానియాలో కొత్తగా ఎం.లిట్‌ ( ఆ ‌తర్వాత దీన్ని ఎం.ఫిల్‌గా మార్చారు) కోర్సు ప్రారంభంకావటంతోనే వెంకటరత్నంగారు ‘హంసవింశతి సాహిత్య విజ్ఞాన సర్వస్వ సిద్ధాంత గ్రంథాన్ని’ సమర్పించి, మొదటి బ్యాచ్‌లోనే ఎం.లిట్‌ ‌డిగ్రీ(1977) పొందారు. హంసవింశతిలో కావ్య స్వరూపం-విజ్ఞాన సర్వస్వ లక్షణాలకు సంబంధించి  తొమ్మిది చాప్టర్‌లున్నాయి. హంసవింశతి ప్రబంధకర్త ‘అయ్యలరాజు నారాయణామాత్యుడి దేశకాల నిర్ణయం, వంశం,ఇతర రచనల వివరాలే కాకుండా అందులోని కథా సంవిధానం, నీత్యుపదేశం, నిఘంటు లక్షణాలు, విజ్ఞాన సర్వస్వ లక్షణాలు మొదలైన వివరాలున్నాయి. వెంకటరత్నం గారి అభిలాష కూడా అదే. అందుకే తన పిహెచ్‌డికీ దాన్నే పరిశోధనాంశంగా ఎంచుకున్నారు.
హంసవింశతి అంటే హంస చెప్పిన ఇరవై కథల సంపుటి. ఈ కథలన్నిటిలోనూ విశృంఖల జార శృంగారం వర్ణించబడింది. ఆంగ్లేయులు మన దేశాన్ని పాలిస్తున్నరోజుల్లో ఈ గ్రంథాన్ని నిషేధించారని  చెబుతారు. పురుష సంగమాసక్త అయిన నాయిక హేమవతి, ఆ ప్రాంత రాజు అయిన చిత్రభోగుని కలిసేందుకు పయనమైనప్పుడు ఆమె స్నేహితురాలు ‘హంస’ నివారించడం ఇందులోని కథాంశం. చివరలో వారిద్దరిలో మానసిక పరివర్తన కలుగడమే ఈ కథల సారాంశం. జార శృంగారం ప్రాణాపాయకరం, సహజ హానికరమన్న నీతి ఇందులో ఉంది. లోతుగా అధ్యయనం చేస్తే కావల్సినంత విజ్ఞాన భాండాగారం ఇందులో కనిపిస్తుంది. దీనిపై పరిశోధన చేస్తున్న క్రమంలో మరిన్ని విజ్ఞాన సర్వస్వాల నిర్మాణాలపై రత్నంగారికి ఆసక్తి పెరిగింది. దీంతో ‘ప్రాచీన సమాజ విజ్ఞాన సర్వస్వం’ పేరున రెండవ పరిశోధనా గ్రంథాన్ని ఆవిష్కరించారు. నాటి తెలుగు అకాడమీ సంచాలకులు ఆచార్య యాదగిరిగారి అభిలాషమేరకు దీన్ని పరిశోధించడమైంది. ప్రాచీన విజ్ఞానంలో సర్వస్వలక్షణాలు అధికంగా ఉన్న పండితారాధ్య చరిత్ర, సింహాసన ద్వాత్రింశిక, శుకసప్తతి, వాణి విలాస వనమాలిక, హంసవింశతి కావ్యాలు ఎంచుకుని, వాటిని నేటి సమాజానికి అనుగుణంగా అందించడంలో ఆయన ఎనలేని కృషి చేశారనే చెప్పవచ్చు. 2012లో ప్రచురితమైన ఈ గ్రంథం నేటి సాహిత్యాభిమానులకు ఎంతో తోడ్పడుతున్నది. అలాగే ‘మహాభారత విజ్ఞాన సర్వస్వం’ ఆయన మూడవ పరిశోధనా గ్రంథం.
రత్నంగారి స్వస్థలం నెల్లూరు జిల్లా కలిచేడు గ్రామమైనప్పటికీ, తనను మంచి సాహిత్యకారుడిగా, పరిశోధకుడిగా తీర్చిదిద్దింది మాత్రం ఓరుగల్లు అన్న విషయాన్ని ఆయన తరుచూ గుర్తుచేస్తుంటారు. కోవెల సంపత్కుమారాచార్య, హరిశివకుమార్‌, ‌సినారెలాంటి పలువురు విజ్ఞుల సహవాసాన్ని కలిగించిన వరంగల్‌ ‌రుణంతీర్చుకొమ్మని ఆచార్య బిరుదరాజు రామరాజు చేసిన సూచనమేరకు వెంకటరత్నంగారు ‘వరంగల్‌ ‌జిల్లా విజ్ఞాన సర్వస్వాన్ని’ రూపొందించారు. అప్పటి వరకు ఉమ్మడి వరంగల్‌జిల్లా సంపూర్ణ సమాచారంతో కూడిన గ్రంథమేదీ రాకపోవడంతో ఈ గ్రంథానికి మంచి గుర్తింపు లభించింది. ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిచే ఈగ్రంథం వరంగల్‌లోనే ఆవిష్కరించబడింది.  ప్రస్తుతం ఇది ద్వితీయ ముద్రణలో ఉంది. ఒక విధంగా రత్నంగారి పరిశోధనలన్నీ దేనికదే ప్రత్యేకతను సంతరించున్నాయి. కాగా, జానపద గిరిజన విజ్ఞానపీఠంలో రిసర్చ్ ‌ఫెలోగా కొనసాగినప్పుడు (2011) ‘జానపద గిరిజన విజ్ఞాన సర్వస్వ’ నిర్మాణానికి ఆయన కొంతవరకు కృషిచేశారు. అయితే ఆక్కడ కొంతకాలమే పనిచేయడంతో ఆ కృషి అర్థాంతరంగా నిలిచిపోయింది.
అంతటితో ఆయన తన పరిశోధనలకు స్టాప్  ‌పెట్టకుండా కొనసాగిస్తూనే వచ్చారు. తెలుగులోనే కాకుండా తన రచనా వ్యాసాంగాన్ని ఆంగ్లంలో కూడా కొనసాగించారు. ప్రపంచ విజ్ఞాన సర్వస్వాల స్థూల చరిత్రను, దేశ భాషల్లోని విజ్ఞాన సర్వస్వాలను  Circle of  Learning- A Study in Telugu Encyclopeadia Making  అన్న మరో  గ్రంథంలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విజ్ఞానం, సర్వస్వ నిర్మాణాలు ఎన్నిదశల్లొ రూపుదిద్దుకుంటున్నాయన్న వివరాలను ఇందులో పొందుపర్చారు. విజ్ఞాన సర్వస్వాలపై రత్నంగారి కృషికి మరో మచ్చుతునక ‘తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు’. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన విజ్ఞాన సర్వస్వాల చరిత్రను, వాటి నిర్మాణ పద్దతులను ఈ గ్రంథంలో విశ్లేషించారు. ఆలాగే ఆయన రచనల్లో ఆసక్తిని కలిగిస్తున్నది ‘మహాభారతంలో…ఇవి మీకు తెలుసా’ అన్న గ్రంథం. భారతంలోని కొన్ని సంఘటనలకు సామాజికపరంగా విశ్లేషణనిస్తూ రచించిన గ్రంథమిది. ముఖ్యమైనవిగా భావిస్తున్న 27 ప్రశ్నలను ఎంచుకుని వాటిపై వివరణ ఇచ్చారు. అలాగే మనిషి మంచి నడవడికకు సూక్తులు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. అలాంటి 153 సూక్తులతో కూడిన ‘సూక్తి రత్నా ప్రభావళి’ అనే గ్రంథ రచనచేశారాయన.
నెల్లూరు జిల్లా ‘కలిచేడు’ గ్రామంలో అతిసామాన్య కార్మిక కుటుంబం(16-05-1937)లో జన్మించిన గుంజి వెంకటరత్నంగారు గ్రామంలో అయిదవ తరగతివరకే ఉండటంతో, ఏడుమైళ్ళ దూరంలోని సైదాపూర్‌కు రోజూ కాలినడకన వెళ్ళి పదవతరగతి చదివారు. ఆ తర్వాత నెల్లూరులో బి.ఏ.(1961) పూర్తిచేశారు. కుటుంబ పోషణలో తండ్రికి తోడుగా ఉండేందుకు కలిచేడు గ్రామంలోని మైకా మైన్స్‌లోనే ఉపాధిని ఎంచుకున్నారు. తండ్రి, తాత కాలంనుండి మైకామైన్స్(అ‌భ్రకపు గనులు)తో ఆ కుటుంబానికి అవినాభావ సంబంధముంది. మైకా కాంట్రాక్టర్‌గా వృత్తి ప్రారంభించి చెయ్యికాల్చుకున్నారు. తర్వాత వరంగల్‌ ఆజంజాహి మిల్లులో 92 రూపాయల వేతనంతో 1965లో రైటర్‌గా చేరిన నాటినుండి నేటికి 88 ఏండ్ల వయస్సులోకూడా ఆయనకు వరంగల్‌తో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. రత్నంగారికి వరంగల్‌ అన్నా, కాకతీయ రాజన్యులన్నా ఎంతో ఇష్టం. ముఖ్యంగా కాకతీయకాలపునాటి మహిళామణులు కామసాని, బయ్యాంబ, మైలాంబ, ముమ్మడాంబ, రుద్రమల చరిత్రలంటే ఆయన పరవశించిపోతారు. వారి దానధర్మాలు, సాహిత్య, కళాపోషణ, ఆలయ నిర్మాణాలతోపాటు వ్యవసాయ రంగానికి వారిచ్చిన ప్రాధాన్యత తననెంతో ఆకట్టుకున్నాయంటున్న రత్నంగారు ‘కాకతీయ పంచవింశతి- ఓరుగల్లు కథలు’పేర 25 కథల సంపుటిని ఆవిష్కరించారు.
    అలాగే పుట్టిపెరిగిన కలిచేడు గ్రామంలోని మైకా మైనింగ్‌ ‌ఫ్యాక్టరీతో ఉన్న అనుబంధాన్ని దృష్ట్యా అక్కడి కార్మికుల జీవన స్థితిగతులను దగ్గరగా చూసినవాడిగా ‘కలిచేడు కథా విపంచి-మైకా మైన్స్ ‌కథలు’ పేరున 20 కథలతో ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఇందులో కార్మికుల శారీరక, ఆర్థిక కష్టాలు, సింగరేణి కార్మికుల్లాగానే ఇక్కడి కార్మికులుచేసే అండర్‌ ‌మైనింగ్‌, ఓపెన్‌ ‌కాస్ట్, ‌ప్రమాదాలు, మృత్యువాత పడుతున్నతీరు, వారి వేతనాలు, జీవన విధానాలు కండ్లకు కట్టినట్లు ఆ కథల్లో ప్రతిబింబిస్తాయి. కష్టాల్లోనే ఆనందాన్ని వెతుక్కునే విధంగా అక్కడి శ్రమజీవులు సామూహికంగా జరుపుకునే కోడి పందాలు, పేకాట, క్రీడలు, పండుగలు, తిరునాళ్ళకు సంబందించిన వివరాలు ఈ ఇరవై కథల్లో ఆయన పొందుపర్చారు.
కథా రచనతోపాటు ఆయన సాగించిన కవితా రచనలో చెప్పుకోతగింది ‘నీతి పద్య రత్నావళి’. ఇది 1008 ఆటవెలది పద్యాల సమాహారం. సమాజంలో జరుగుతున్న దోపిడీలు, అత్యాచారాలు, హత్యలు, కుట్రలు, కుతంత్రాలు, స్క్యాములపై భావిభారత పౌరులను చైతన్యపర్చాలన్న అభిలాషతో 1016 పద్యాలతో ‘తెలసిమసలుకో తెలుగుబాల’ మకుటంతో రాసిన మహాశతకం పలువురి ప్రశంసలనందుకుంది. అలా సాహిత్య రంగంలో దూసుకుపోతున్న రత్నంగారి ఇంట పెనువిషాధం చోటుచేసుకుంది. కరోనా రక్కసి ఆయన చిన్న కుమారుడిని కబళించింది. ఆ విషాధం నుండి ఉపశమనం పొందేందుకు ఆయన పఠించిన భగవద్గీత సామాజిక కోణంలో పరిశోధనకు పురిగొల్పింది. అంతే.. రెండు నెలల్లో తెలుగు అనువాద తాత్పర్యసహితంగా 700 శ్లోకాలను తెలుగు తేటగీతి పద్యాల్లో అనువదించారు. ఇప్పటివరకు ముద్రిత గ్రంథాలే వెలుగుచూశాయి. కాని ఆయన రచించిన విమర్షనాత్మక, విశ్లేషణాత్మక గ్రంథాలనేకం అముద్రిత గ్రంథాలుగానే మిగిలిపోయాయి.
ఇంతటి సాహిత్యసేవ చేసిన వెంకటరత్నంగారి పూర్వ శిష్యబృంధం ‘అభినందన సమితి’గా ఏర్పడి స్వర్ణకంకణాన్ని తొడిగి ‘విజ్ఞాన సర్వస్వనిధి’ బిరుదుతో సత్కరించారు. అనేక సాహిత్య, సాస్కృతిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు వివిధ పురస్కారాలతో ఘనంగా సన్మానించాయి. వాటిల్లో తెలుగు విశ్వవిద్యాలయం ‘కీర్తిపురస్కారం’, తెలంగాణ సారస్వత పరిషత్‌ అం‌దజేసిన ‘ఆచార్య పోలూరి హనుమజ్జానకి రామశర్మ పురస్కారం’ చెప్పుకోతగ్గవి. మీరా సంగీత మండలి ‘డాక్టర్‌ ఇం‌దారపు కిషన్‌రావుగారి స్మారక పురస్కారం’, వరంగల్‌లోని సాహితీ బంధు బృందం ‘ఓరుగల్లు సాహితీ కీర్తి పతాక’, వేద సంస్కృతి పరిషత్‌-‌మూసీమాసపత్రిక సంయుక్తంగా ‘బిఎన్‌ ‌శాస్త్రి విశిష్టపురస్కారాన్ని అందించాయి. ఆధ్యాపకుడిగా వరంగల్‌ ‌సికెఎం కళాశాలనుండి పదవి విరమణ చేసిన సందర్భంగా ఆచార్య బిరదరాజు రామారాజు చేతులమీదుగా ‘స్వర్ణాంగుళీయం’ పొందారు. కళాదీప్తివారు ‘విజ్ఞాన సర్వస్వనిధి’, హనుమకొండలోని సాహితీసంస్థ ‘సాహితీ కార్మికుడు, సరస్వతీ పుత్రుడు లాంటివి చెప్పుకోదగిన కొన్ని పురస్కారాలందుకున్న వెంకటరత్నంను అబో విభో కందాళం సంస్థ లక్ష రూపాయల జీవనసాధన పురస్కారాతో జనవరి  4న వరంగల్‌లో సన్మానించనుంది.
– మండువ రవీందర్ రావు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *