– బీఆర్ఎస్ నేతలకు ప్రజల ద్వారా బుద్ధి చెప్పిస్తాం
– కేసీఆర్.. మీకు అసెంబ్లీ అంటే భయం ఎందుకు?
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తల్లాడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టే కాంగ్రెస్ బలపరిచిన 85% మందిని సర్పంచులుగా గెలిపిస్తే తోలు వలుస్తా అని కేసీఆర్ మాట్లాడటమేమిటని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిలదీశారు. తమకు దిగజారి మాట్లాడడం రాదు.. చేతల ద్వారా, ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెప్పిస్తామన్నారు. తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో పలు సబ్ స్టేషన్ల పనులకు మంగళవారం శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రెండేళ్లపాటు ఫామ్‌హౌస్‌లో పడుకున్న ఓ పెద్దాయన మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారంటే ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి.. మంచిగా చేయండి అని ఆశీర్వదిస్తారని భావించాం.. కానీ ఆయన తోలు తీస్తాం అంటూ మాట్లాడారని, అలా అనడం సరైంది కాదని అన్నారు. ఆయన తోలు వలిచే ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నారో అని భట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నాయకుడిగా రెండేళ్లల్లో ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు.. అసెంబ్లీ అంటే కేసీఆర్‌కు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని ఆయనకు అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదా అవసరమా అని ప్రశ్నించారు. తాము ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా తాను ఏ ఒక్కరోజూ అసెంబ్లీకి గైర్హాజరు కాలేదని గుర్తు చేశారు. పదిమంది నాయకులను పక్కన కూర్చోబెట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్న వారిని తోలు వలుస్తాం అంటే చూస్తూ ఊరుకోం.. ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరు అని డిప్యూటీ సీఎం ఘాటుగా బదులిచ్చారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాస్వామ్య పద్ధతుల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ప్రజలకు అన్ని విషయాలు వివరించినప్పటికీ కాంగ్రెస్ బలపరిచిన 85 శాతం మంది అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించారని డిప్యూటీ సీఎం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు పనికిరావని పక్కకు కూర్చోబెట్టారు.. తాజాగా సర్పంచ్ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ మెజారిటీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు పల్లె ప్రజలు పట్టం కట్టారు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రైజింగ్ అవుతుంది.. రాష్ట్రానికి దేశవ్యాప్తంగా నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు.. ఈ సమయంలో తాము ఎక్కడ కనిపించకుండా పోతామోననే ఆందోళనతో రెండేళ్ల తర్వాత బయటకొచ్చి ప్రభుత్వంపై విషం కక్కి తిరిగి ఫామ్ హౌస్‌లో పడుకోవడానికి వెళ్లారు అని ఎద్దేవా చేశారు. మీకు ప్రజలే బుద్ధి చెబుతారని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రంలోని 94 శాసనసభ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 85 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారని, ఈ మధ్యకాలంలో ఏ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ప్రజల ఆశీర్వాదం లభించలేదని అన్నారు. ప్రజల మధ్య నిలబడి ప్రజల కోసం ఇందిరమ్మ రాజ్యం నిర్ణయాలు చేయడంతోనే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలుపొందారని భట్టి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





