దేశాన్ని ఉన్న‌తంగా నిలిపిన మ‌హానుభావుడు

– మాజీ ప్రధాని పీవీకి బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధానిగా పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలను, దేశానికి అందించిన విశేష సేవలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు స్మరించుకున్నారు. మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌ వద్ద ఆయన మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామచందర్‌ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి అయిన తర్వాత పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణల ద్వారా భారత దేశాన్ని కొత్త దారిలో నడిపించారన్నారు. ప్రతిపక్షంతో కలిసి దేశాన్ని సరైన దిశగా నడిపించిన, దేశాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టిన అరుదైన నాయకత్వం ఆయనది అని కొనియాడారు. పీవీ సంస్కరణల వల్లే ఈరోజు భారత దేశం ప్రపంచంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కాగా, ఆయన జీవించి ఉన్నప్పుడు గానీ, మరణానంతరం గానీ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వాలనే ఆలోచనను కాంగ్రెస్‌ పార్టీ చేయలేదని ఆయ‌న‌ విమర్శించారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌ గాంధీ వంటి ఒకే కుటుంబానికి చెందినవారు ప్రధానమంత్రి అయితేనే దిల్లీలో వారికి ప్రత్యేక గౌరవాలు, ఘాట్లు కట్టే సంప్రదాయం ఉందా అని ప్రశ్నించారు. పీవీ నరసింహారావు వర్థంతి కార్యక్రమానికి కూడా కాంగ్రెస్‌ మంత్రులు, నాయకులు కనీస ప్రొటోకాల్‌ లేకుండా రావడం చూస్తే వారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పీవీకి సముచిత గౌరవం దక్కలేదనే విషయం స్పష్టమవుతోందని రామచందర్‌రావు అన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పీవీ సేవలను సముచితంగా గుర్తించి ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వంటి మహానుభావుల సేవలను కూడా గుర్తించి వారికి దేశ అత్యున్నత గౌరవమైన భారతరత్నను అందించిందని గుర్తు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *