రాయలసీమను రతనాల సీమ చేస్తానని అనలేదా?

– నీటి హక్కులపై దోబూచిలాడిందే కెసిఆర్‌
‌- మండిపడ్డ మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 22: బీఆర్‌ఎస్‌ ‌బలహీనమైందని కేసీఆర్‌కు అర్ధమైందని, పార్టీని కాపాడుకోవడానికే మాజీ సీఎం బయటకు వచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్‌తో లాభం లేదని తెలుసుకున్నాడని ఎద్దేవా చేశారు. సోమవారం మాట్లాడుతూ కొడుకు, అల్లుడు వల్ల పార్టీ దిగజారుతోందని కేసీఆర్‌ ‌భావించారని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ‌పట్టించుకోవడం లేదనేది అబద్ధమన్నారు. కేసీఆర్‌ ‌ముందు చేసే పని వెనక, వెనక చేసే పని ముందు చేశారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇరిగేషన్‌ ‌కోసం కాదు తాగునీటి కోసమే అని సుప్రీం కోర్టులో కేసీఆర్‌ ‌ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. పదేళ్లపాటు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని, దీనికి సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్‌ ‌నీళ్ల విషయంలో అనేక తప్పిదాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ నీటి హక్కులను వాడుకోవడంలో కేసీఆర్‌ ‌విఫలమయ్యారన్నారు. బీజేపీ ప్రతి అడుగులో బీఆర్‌ఎస్‌ ‌తోడుగా ఉందని ఆరోపించారు. జగన్‌ ‌దగ్గరకు వెళ్ళి రాయలసీమను రతనాల సీమగా చేస్తానని కేసీఆర్‌ అన్నారని, నీటి హక్కులను సాధించడంలో వైఫల్యం కేసీఆర్‌ ‌దే అని వ్యాఖ్యలు చేశారు. పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ ఉన్నట్టు కేసీఆర్‌ ‌నటిస్తున్నారని మంత్రి విమర్శలు గుప్పించారు. యూరియాపై కేసీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ దాని కొరతకు కేంద్రమే కారణమన్నారు. సప్లయ్‌ ‌లేనప్పుడు డిమాండ్‌ ఎక్కువవుతుందని తెలిపారు. ఉన్న యూరియాను సక్రమంగా ఇవ్వాలనుకోవడం తమ తప్పా అని ప్రశ్నించారు. రైతులు లైన్లో ఉండడం చూడలేకనే ప్రత్యామ్నాయ వ్యవస్థ తెస్తున్నామన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎందుకు తెరిపించలేదని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలపై అబద్దాలు ఆపాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం నుండి కృష్ణా జలాల పంపకాల వరకు బీఆర్‌ఎస్‌ ‌నేతలు అనుసరించిన విధానాలు రాష్ట్ర‌ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారాయని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని, అటువంటి ఘోర తప్పిదాన్ని సమర్థించుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రూ.1.80 లక్షల కోట్లు అప్పు తెచ్చి నిర్మించిన ప్రాజెక్టు నిరుపయోగం కావడం బీఆర్‌ఎస్‌ ‌ఘనతేనని, ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని కాగ్‌ ‌కూడా పేర్కొందని ఆయన గుర్తుచేశారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంది కేవలం 70 నుండి 80 టీఎంసీల నీరు మాత్రమేనని, కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టు డిజైన్‌ ‌మార్చారని ఆరోపించారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేసీఆర్‌, ‌హరీశ్‌ ‌రావు తీరని అన్యాయం చేశారని మంత్రి విమర్శించారు. 2020లో కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణకు 33 శాతం నీరు సరిపోతుందని బీఆర్‌ఎస్‌ ‌నేతలు రాసివ్వడం వల్లే ఇవాళ ట్రిబ్యునల్‌ ‌ముందు ఏపీ బలమైన వాదన వినిపిస్తోందన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చిన తర్వాతే తెలంగాణకు 71 శాతం వాటా కావాలని కేంద్రానికి, ట్రిబ్యునల్‌కు స్పష్టంగా తెలియజేశామని వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కూడా ఏపీతో కుమ్మక్కై, అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశాన్ని వాయిదా వేయించుకుని తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును పదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి నిలదీశారు. కనీసం కాలువల తవ్వకం కూడా చేపట్టకుండా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వకుండా 90 శాతం పనులు పూర్తయ్యాయని అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. కక్షతోనే బ్రాహ్మణ వెల్లెల ప్రాజెక్టును పక్కనపెట్టారని, ఎస్సెల్బీసీ, డిండి వంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నల్గొండ జిల్లాకు బీఆర్‌ఎస్‌ అన్యాయం చేసిందని ఆరోపించారు. పెండింగ్‌ ‌ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని, బీఆర్‌ఎస్‌ ‌నేతలు చేసిన అప్పులకు నెలకు రూ.16 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే ముందు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అక్రమంగా సంపాదించిన సొమ్మును జేబుల్లో నింపుకున్నారని మంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *