జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం

– పది రోజుల్లో అక్రిడిటేషన్‌ కార్డులపై జీవో
– వచ్చే ఏడాది ఇళ్ల స్థలాలపై తీపి కబురు
– టీడబ్ల్యూజేఎఫ్‌ మహాసభలో మంత్రి పొంగులేటి

ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజెఎఫ్‌) జిల్లా మహాసభలనుద్దేశించి ఫోన్‌ ద్వారా ప్రసంగించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్‌ కార్డుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాబోయే పది రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (విడుదల చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని, ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

ఇళ్ల స్థలాలపై స్పష్టత

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఇప్పటికే లోతుగా చర్చించామని మంత్రి పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన చిక్కుల వల్ల కొంత ఆలస్యమైందని, వాటన్నింటినీ అధిగమించి వచ్చే ఏడాది జర్నలిస్టులకు తీపి కబురు అందిస్తామని ప్రకటించారు. జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యతని ఆయన ఉద్ఘాటించారు.

సమష్టిగా ముందుకు సాగాలి

టీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘం నాయకులను, సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *